అవంతిక ఇంటర్వ్యూ

Monday,July 17,2017 - 04:33 by Z_CLU

జయ డైరెక్షన్ లో హరీష్, అవంతిక హీరో, హీరోయిన్స్ గా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘వైశాఖం’ ఈ నెల 21 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అవంతిక ఈ సినిమా విశేషాలను మీడియాతో షేర్ చేసుకుంది.

 

వైశాఖంలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?

నిర్మాత బి.ఎ. రాజుగారు, డైరెక్ట‌ర్ జ‌య‌గారు నా ఫోటోస్ చూశారు. వాళ్ళ‌కు న‌చ్చ‌డంతో ఫోటో షూట్‌కు ర‌మ్మ‌ని పిలిచారు. నేను, హీరో హ‌రీష్ ఫోటో షూట్‌లో పాల్గొన్నాం. షూట్ పూర్తయ్యాక ఓకె చెప్పి, కథ చెప్పేశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు భానుమతి.

 

భానుమతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

భానుమతి ఫ్యామిలీ వ్యాల్యూస్ కి కట్టుబడి ఉండే మోడ్ర‌న్ అమ్మాయి… ఏ విషయంలో అయినా ఖచ్చితంగా ఉంటుంది. జ‌య‌గారు భానుమ‌తి పాత్ర చెప్ప‌గానే నాకు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఎందుకంటే రియ‌ల్ లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటాను. భానుమ‌తి క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌డం ఎంతో ఆనందంగా అనిపించింది. `ఈ సినిమా నాకు డెఫ్ఫినేట్ గా మంచి బ్రేక్‌నిస్తుంది. ‘వైశాఖం’ మంచి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ.

 

పాట‌ల‌కు ఎలాంటి రెస్పాన్స్  వస్తుంది?

డిజె వసంత్‌గారు అందించిన పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. భానుమ‌తి.. అనే సాంగ్‌తో పాటు కంట్రి చిల‌కా …సాంగ్ కూడా నాకు బాగా న‌చ్చాయి. ఒక్కొక్క పాట ఒక్కో వేరియేష‌న్‌లో ఉంది.

 

సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?

ఈ సినిమాలో సాయికుమార్‌గారు, ర‌మాప్ర‌భ‌గారు, కాశీ విశ్వ‌నాథ్‌ గారితో స‌హా చాలామంది సీనియ‌ర్ న‌టీన‌టులు న‌టించారు. హై ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉండే సినిమా. ముఖ్యంగా సాయికుమార్‌గారితో చాలా ఇంపార్టెన్స్ సీన్స్ ఉన్నాయి. అలాగే పృథ్విగారితో మంచి కామెడి స‌న్నివేశాలున్నాయి.

 

నటించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది..?

నేను చిన్న‌ప్పుడు టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. ఫైలట్ లేదా స్పోర్ట్స్ ప‌ర్స‌న్ కావాల‌నుకున్నాను. నేను స్టేట్ లెవ‌ల్ బ్యాడ్మింట‌న్ కూడా ఆడాను. నేష‌న‌ల్ లెవ‌ల్‌కు ట్ర‌యినింగ్ తీసుకున్నాను. కానీ నెమ్మ‌దిగా సినిమాల వైపు ఆక‌ర్షితురాలిన‌య్యాను. తెలుగులో ముందుగా  `మాయ` సినిమాలో న‌టించాను. త‌ర్వాత చేసిన సినిమా ‘వైశాఖం’.

 

డ్యాన్స్ కోసం కష్టపడినట్టున్నారు…

అవునండి… నేను క‌థ‌క్ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో డ్యాన్స్ చేయ‌డం అనేది కొత్త అనుభవాన్ని నేర్పింది. ప్ర‌తి జోన‌ర్‌లో ఒక్కొక్క సాంగ్ ఉంది. ముఖ్యంగా కంట్రి చిలకా సాంగ్ కోసం 15 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజిష‌న్‌లో ఈ సాంగ్‌ను క‌జికిస్థాన్‌లో -6 డిగ్రీల చ‌లిలో చిత్రీక‌రించారు. జ‌య‌గారు, రాజుగారు ఓ డ్యాన్స్ అసిస్టెంట్‌ను అపాయింట్ చేసి మరీ డ్యాన్స్ నేర్పించారు. ఈ సినిమాకు చేసిన ప్రాక్టీస్ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో చేయ‌బోయే సినిమాల్లో బాగా డ్యాన్స్ బాగా చేయ‌గ‌లుగుతాన‌నే న‌మ్మ‌కం క‌లిగింది.

 

డైరెక్ట‌ర్ జ‌య‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్…

జ‌య‌గారు చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కురాలు. న‌టీన‌టుల నుండి ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. వారి న‌ట‌న‌ను ఎలా రాబ‌ట్టుకోవాలో తెలిసిన వ్య‌క్తి. ఒక హీరోయిన్ అందంగా క‌న‌ప‌డ‌ట‌మే కాదు, చ‌క్క‌టి పెర్‌ఫార్మెన్స్ కూడా చేయాల‌నేది ఆమె త‌త్వం. షూటింగ్ ముందు నాతో ప్రాక్టీస్ చేయించారు. జ‌య‌గారు మ‌హిళా ద‌ర్శ‌కురాలైనా ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. ప్ర‌తి షాట్‌ను ఎంతో చ‌క్క‌గా రావాల‌ని త‌ప‌న ప‌డ‌తారు. ఆవిడ వ‌ర్కింగ్ స్టైల్ న‌న్నెంతగానో ఇన్‌స్ఫైర్ చేసింది.

 

సినిమాలో మీరు బాగా క‌ష్ట‌ప‌డ్డ స‌న్నివేశం?

క్లైమాక్స్ సీన్‌. నాలుగైదు పేజీల డైలాగ్‌ను చెప్పాల్సి వ‌చ్చింది. తెలుగు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను కాబ‌ట్టి అంత పెద్ద సీన్ చేయ‌డం క‌ష్ట‌మైంద‌నే అనాలి. కాన జ‌య‌గారి స‌పోర్ట్‌తో ఆ సీన్‌ను చాలా బాగా చేశాను. మంచి ఎమోష‌నల్ సీన్‌. ఆడియెన్స్ అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది.

 

హీరో హ‌రీష్ గురించి?

హ‌రీష్ చాలా మంచి వ్య‌క్తి. ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడు. డౌన్ టు ఎర్త్. త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

 

తెలుగులో మీ అభిమాన న‌టీన‌టులెవ‌రు?

తెలుగు సినిమాల‌ను చూస్తుంటాను. రీసెంట్‌గా అంటే బాహుబ‌లి2, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాల‌ను చూశాను. బాగా న‌చ్చాయి. ప్ర‌భాస్‌, బ‌న్ని, అనుష్క వంటి ఎంతో మంది గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు.

 

డ్రీమ్ రోల్‌?

 పీరియాడిక్ మూవీలో నాకు వారియ‌ర్ ప్రిన్స్ పాత్ర చేయాల‌నే కోరిక ఉంది.

 

నెక్స్‌ట్ మూవీస్‌..

త‌మిళంలో అశోక్ సెల్వ‌న్‌తో `నెంజ‌మెల్ల కాద‌ల్` సినిమా చేస్తున్నాను. ఇంకా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.