అర్జున్ ఇంటర్వ్యూ

Monday,August 14,2017 - 05:19 by Z_CLU

నటుడిగా 150 సినిమాలు పూర్తి చేసుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ గా నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు..ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ ఆగస్టు 15 తన జన్మదినాన్ని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అయన మాటల్లోనే…

 

అదే రెస్పాన్స్

1984లో ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం అయ్యాను. మళ్ళీ ఇన్నేళ్లకి తెలుగులోనే విలన్ గా నటించడం నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. హీరోగా చేసినప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ చూశానో ఇప్పుడూ అదే చూస్తున్నాను. విలన్ గా ఈ సినిమాలో చాలా బాగా చేసారని క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తున్నారు. తెలుగు ఆడియన్స్ నన్ను బాగా ఓన్ చేసుకున్నారు. మా పల్లెలో గోపాలుడు సినిమాలో రాణి రాణమ్మా పాట ఇప్పటికీ నేను కనిపించినప్పుడల్లా పాడుతూ ఆ సినిమా గురించి అలాగే మిగతా సినిమాల గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషం కలుగుతుంది.

ఇదే కరెక్ట్ టైం అనుకున్నా

నటుడిగా 150 సినిమాల్లో నటించాను. కొత్త క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటుండగా హను నాకు ఈ స్క్రిప్ట్ తో పాటు నా క్యారెక్టర్ గురించి చెప్పాడు. క్యారెక్టర్ నాకు బాగా నచ్చడం పైగా నితిన్ హీరో అని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పాను.

కొత్త అనుభూతి

హీరోగా ఓ వైపు సినిమాలు చేస్తూనే విలన్ గా నటించడం ఒక కొత్త అనుభూతి కలిగించింది. నిజానికి అవకాశం వచ్చినప్పుడు కొన్ని మంచి క్యారెక్టర్స్ వదులుకోకుండా ప్రేక్షకులను కొత్తగా ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఆలోచన. అందుకే ఈ క్యారెక్టర్ చెప్పగానే ఇలాంటి రోల్ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాను.

 

బ్రేక్ చేయడం ఇష్టం

లై సినిమాలో విలన్ గా చేస్తున్నాని చెప్పగానే కొంత మంది నాతో పని చేస్తున్న దర్శకులు, నిర్మాతలు చాలా విషయాలు చర్చించి ఇది సరైన నిర్ణయం కాదని చెప్పారు. కానీ నటుడిగా ఆ రూల్స్ ని బ్రేక్ చెయ్యడానికే ఇష్టపడతాను. ఈ వయసులో కూడా నటుడిగా ప్రయోగాలు చేయకపోతే ఎలా.. ఆ ఆలోచనతోనే అందరినీ కన్విన్స్ చేసి ఫైనల్ గా ఈ రోల్ చేశాను.

 

వాళ్ళు ఎప్పుడో మారారు

నిజానికి హాలీవుడ్, బాలీవుడ్ లో ఇలా హీరో, విలన్ గా నటించడం మళ్ళీ తిరిగి హీరోగా నటించడం కామనే. మనమే ఇప్పటికి మారాం. నిజానికి క్యారెక్టర్ నచ్చితే ప్రేక్షకులు హీరోనా విలన్ ఆ? అని ఆలోచించరు జస్ట్ ఎంటర్టైన్ అవుతారు. ఒక క్యారెక్టర్ నచ్చితే ఇక మిగతా విషయాలు పట్టించుకోరనేది నా నమ్మకం.

 

 

నితిన్ అంటే ఇష్టం

హను ఈ స్క్రిప్ట్ చెప్పి నితిన్ హీరో అనగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే నితిన్ అంటే నాకిష్టం. గతంలో ఇద్దరం కలిసి శ్రీ ఆంజనేయం సినిమా చేశాం. చాలా హార్డ్ వర్కర్. నటుడిగా ఎంత కష్టమైనా పడతాడు. అలంటి క్వాలిటీస్ ఉన్నందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు.

 

అందరూ హీరోలే

నిజానికి ఏ సినిమా అయినా ఒక్కరి వల్లే ఆడదు. అలాగే ఒక్కరి వల్లే ఫ్లాపు కూడా అవ్వదు. అన్నిటికీ అందరూ కారకులే. అందరూ కలిస్తేనే ఒక సినిమా రెడీ అవుతుంది. అలాంటప్పుడు ఒకరి వల్లే రిజల్ట్ డిసైడ్ చేస్తే ఎలా.. ఈ సినిమా విషయంలో కూడా సక్సెస్ లో భాగం నితిన్ కి నాకు మాత్రమే కాదు… ప్రతీ ఒక్కరికీ దక్కుతుంది. దర్శకుడితో పాటు సినిమాకు పనిచేసిన అందరూ హీరోలే.

 

ప్రతిసారి భయపడుతుంటాను

నటుడిగా అదే లుక్ మైంటైన్ చేయడానికి నా దర్శకులు, నిర్మాతలే కారణం. ప్రతీ రోజు అందరిలాగే నా దినచర్య ను ఫాలో అవుతుంటాను. కానీ నాపై నమ్మకం పెట్టుకున్న దర్శక నిర్మాతలు, ప్రేక్షకుల కోసం కాస్త ఎక్కువ జిమ్ చేస్తూ అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాను. నటుడిగా ఏమైనా మార్పు వస్తుందా.. అని ప్రతీ క్షణం బయపడుతుంటాను.. నా సినిమా చూసి అర్జున్ ఏంటి ఇలా ఉన్నాడు.. ఇలా మారిపోయాడు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు.

 

అందుకే రిజెక్ట్ చేశాను

తెలుగులో ఈ సినిమా కంటే ముందు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు కొత్తగా అనిపించలేదు. క్యారెక్టర్ నాకు బాగా నచ్చాలి.. ఆ తర్వాత ప్రేక్షకులు మెచ్చాలి. సినిమా ఓకే చేసే ముందు కేవలం అదొక్కటి మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను. అంతకు ముందు వచ్చిన క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు అందుకే రిజెక్ట్ చేశా. కొత్త క్యారెక్టర్స్ వస్తే తెలుగులో సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీనే.

 

హను మేకింగ్ నచ్చింది

ఈ సినిమా చేస్తున్నప్పుడు హను మేకింగ్ స్టైల్ బాగా నచ్చింది. ప్రతీ విషయాన్నీ క్లారిటీ గా చెప్తూ డైరెక్టర్ గా సూపర్ అనిపించాడు. గతంలో తను చేసిన రెండు సినిమాలు కొంచెం చూశాను. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించి దర్శకుడిగా మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

 

అవి అవసరమే

నటుడిగా మేకోవర్ అవసరమా..అంటే కచ్చితంగా అవసరమనే అంటాను. ఎందుకంటే నటుడిగా ఒక కొత్త మేకోవర్ లో కనిపించినప్పుడు ప్రేక్షకులకు మనలో కొత్త యాంగిల్ కనిపిస్తుంది. అందులో మనం నార్మల్ గానే నటించినా ఆ మేకోవర్ వల్ల కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని గెటప్స్ కి మేకప్ వేసుకోవడానికి 2 , 3 గంటలు పట్టింది. కానీ ఆ గెటప్స్ నాలో ప్రేక్షకులకు ఒక కొత్తదనం చూపించాయి.

 

కమల్ హాసన్ నిజంగా గ్రేట్

నిజానికి ఒక క్యారెక్టర్ కోసం గంటల పాటు మేకప్ వేసుకోవడమనేది చాలా కష్టం. అందుకు చాలా ఓపిక తో పాటు నటనపై ఎంతో గౌరవం-ప్రేమ ఉండాలి. ఈ సినిమాలో మేకప్ వేసుకునేటప్పుడు కమల్ హాసన్ గారు, ఇంకా మిగతా నటులంతా చాలా గ్రేట్ అనిపించింది.

 

నేనే నమ్మకపోతే ఎలా ?

మా అమ్మాయి ఐశ్వర్య హీరోయిన్ గా ప్రేమ బరహా అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమాలో నటించింది. ఇది తనకి రెండో సినిమా. అందరు తనను హీరోయిన్ చేస్తానంటే వొద్దని చెప్పారు. 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ, నటుడిగా 150 సినిమాలు చేసి నేనే ఈ పరిశ్రమను నమ్మకపోతే ఎలా.. ఏ పరిశ్రమలో అయినా మంచి చెడు రెండూ ఉంటయని నా ఫీలింగ్. సో అందుకే ఎవ్వరి మాట వినకుండా తనని ఇండస్ట్రీలో హీరోయిన్ చేశాను. తను చాలా హ్యాపీ గా ఉంది. ఆ సినిమా త్వరలోనే తమిళ్, కన్నడలో రిలీజ్ కానుంది.