April Box Office Review - ఒకే ఒక్కడు

Saturday,May 01,2021 - 06:15 by Z_CLU

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్యలో కేసులు మరింత పెరగడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ఇలాంటి టఫ్ టైమ్ లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

యువరత్న సినిమాతో ఏప్రిల్ టాలీవుడ్ బాక్సాఫీస్ మొదలైంది. 1వ తేదీన విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక 2వ తేదీన వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ ఓ మోస్తరు హిట్ అనిపించుకోగా.. కార్తి-రష్మిక కలిసి చేసిన సుల్తాన్ మాత్రం ఫ్లాప్ అయింది.

ఇక ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 శాతం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కళ్లముందే వంద కోట్ల క్లబ్ లో చేరింది. పవన్ కల్యాణ్ స్టామినాను చాటిచెప్పింది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఏప్రిల్ 16న ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. అయితే అన్నీ చిన్న సినిమాలే. అప్పటికే థియేటర్లలో వకీల్ సాబ్ హవా కొనసాగుతుండడంతో, వీటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలా ఆర్జీవీ దెయ్యం, 99 సాంగ్స్, ఇట్లు అంజలి లాంటి సినిమాలు వచ్చీ రావడంతోనే ఫ్లాప్స్ అయ్యాయి.

ఏప్రిల్ 23న శుక్ర, కథానిక అనే రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అయితే అప్పటికే కరోనా వల్ల తెలంగాణలో థియేటర్లు మూసేశారు. అటు ఏపీలో ఆక్యుపెన్సీ లేక చాలామంది తమ థియేటర్లు క్లోజ్ చేసుకున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

  • vakeelsaab 2nd week poster zeecinemalu

చివరిగా 30వ తేదీన ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ అనే సినిమా కూడా రిలీజైనప్పటికీ, ప్రేక్షకులు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అలా ఏప్రిల్ లో 14 సినిమాలు రిలీజ్ అయితే.. వాటిలో పవన్ నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ గా నిలవగా.. నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఓ మోస్తరుగా సక్సెస్ అయింది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics