65 ఏళ్లు పూర్తిచేసుకున్న క్లాసిక్

Tuesday,June 26,2018 - 12:04 by Z_CLU

తెలుగు సినీచరిత్రలో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటి దేవదాసు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా ఇవాళ్టితో 65 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1953 జూన్ 26న విడుదలైన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.

ఇప్పటికీ లవ్ లో ఫెయిలైన వాళ్లను దేవదాసుగా పిలవడం కామన్ అయిపోయింది. అంతా తరతరాల్ని ప్రభావితం చేసింది దేవదాసు సినిమా. దేవదాసుగా ఏఎన్నార్, పార్వతిగా సావిత్రిల నటన ఈ తరాన్ని కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.

ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారై తాగుబోతులాగా సహజంగా కనిపించారు.

భగ్నప్రేమికుడి పాత్రలకు, ఆ టైపు సినిమాలకు పునాదిగా నిలిచింది దేవదాసు సినిమా. ఇది వచ్చిన తర్వాతే విషాదాంతంతో కూడా ప్రేమకథలు తీయొచ్చని చాలామందికి తెలిసింది. భగ్న ప్రేమికులుగా తెలుగులోనే కాదు, ఇండియాలో చాలామంది హీరోలు నటించారు. కానీ భగ్నప్రేమికుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏఎన్నారే. అంతలా దేవదాసు పాత్రలో జీవించారు అక్కినేని.

దేవదాసు విడుదలైన మొదటి వారం అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదేం సినిమా అన్నారంతా. ఆ తర్వాత మెల్లమెల్లగా స్లో-పాయిజన్ లా ఎక్కేసింది దేవదాసు. ఇది ఎంత హిట్ అయిందంటే.. వంద రోజులు పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల ముందు వేల సంఖ్యలో క్యూ కట్టేవారు ప్రేక్షకులు. అంతేకాదు.. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తే, హైదరాబాద్ లో 365 రోజులాడింది.