ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో మేఘసందేశం

Monday,September 24,2018 - 03:59 by Z_CLU

తెలుగుతెరపై ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలవి. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలవి. అలాంటి ఓ క్లాసిక్ మూవీనే మేఘసందేశం. లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు నటించిన ఈ సినిమా విడుదలై ఈ రోజుకు (సెప్టెంబర్ 24, 2018) సరిగ్గా 36 సంవత్సరాలైంది.

కొన్ని పాత్రలు చూస్తే అవి అక్కినేని కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది. సెక్రటరీ, దసరా బుల్లోడు, దేవదాసు, ప్రేమ్ నగర్ చిత్రాల్లో మరో హీరోను ఊహించుకోలేం. అలాంటిదే మేఘసందేశం కూడా. మనసులో ఎంతో బాధ, గుండెనిండా మరెంతో భావుకత. ఆ రెండింటినీ కళ్లల్లో చూపించే నేర్పు కావాలి. ఇలాంటి క్లిష్టమైన పాత్రను ఒంటిచేత్తో పండించారు మహానుభావుడు ఏఎన్నార్.

అక్కినేనికి ఇది 200వ చిత్రం కావడం మరో విశేషం. దర్శకరత్న దాసరి నారాయణవు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. రమేష్ నాయుడు ఆ సినిమాకు సంగీతం అందించారు. ఇక అవార్డుల విషయానికొస్తే, మేఘసందేశం సినిమాకు ఏకంగా 4 నేషనల్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డుతో పాటు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫిమేల్ సింగర్ విభాగాల్లో దీనికి జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సినిమాలో పాటలు ఎంత హిట్ అయ్యాయో చెప్పడానికి ఈ అవార్డులే నిదర్శనం.