మరో వెయ్యి రోజుల సినిమా రాబోతోందా...?

Saturday,November 12,2016 - 08:30 by Z_CLU

ఈ కాలంలో వెయ్యి రోజుల సినిమాను ఎక్స్ పెక్ట్ చేయగలమా… వంద రోజులు ఆడడమే కష్టమనుకుంటే… ఏకంగా వెయ్యి రోజులు ఓ సినిమా ఆడితే అది వింత మాత్రమే కాదు.. పెద్ద చరిత్ర కూడా. అలాంటి చరిత్రనే సృష్టించాడు నందమూరి నటసింహం బాలయ్య. ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో లెజెండ్ మూవీ వెయ్యి రోజుల విజయోత్సవం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు అలాంటిదే మరో థౌజండ్ వాలాను సిద్ధంచేసే పనిలో నటసింహం బిజీగా ఉంది. అవును.. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేసే ఛాన్స్ దగ్గర్లోనే ఉంది.

ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య. ప్రతిష్టాత్మక సెంచరీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… తన 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురానున్నాడు. ఈ మూవీ తర్వాత బోయపాటితో సినిమా చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి అన్నీ కుదిరితే బాలయ్య 100వ సినిమాకు బోయపాటి దర్శకుడు కావాల్సింది. కానీ 100 వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించిన బాలయ్య క్రిష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ఈసారి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.