జీ స్పెషల్ : పాతికేళ్ళ 'అమ్మోరు'!

Tuesday,November 24,2020 - 04:47 by Z_CLU

తెలుగులో కొన్ని సినిమాల గురించి తలుచుకుంటే చాలు సినిమా ఆడిన అప్పటి రోజులు , థియేటర్స్ లో ప్రేక్షకులు చేసిన సందడి  అన్నీ గుర్తొస్తాయి. ఆ లిస్టులో ‘అమ్మోరు’ ఒకటి.   25 ఏళ్ల క్రితం థియేటర్లోకొచ్చి ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ కి కూడా పూనకాలు తెప్పించిన ‘అమ్మోరు‘ సినిమా గురించి ‘జీ సినిమాలు‘ స్పెషల్ స్టోరీ.

 ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి వరుస విజయాల తర్వాత ‘ఆగ్రహం’ సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ అపజయాన్ని మరిచేలా ఓ అద్భుతమైన సినిమా తీసి ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా విదేశాలకు పయనమయ్యారు. అక్కడ కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఇలాంటి మాయాజాలంతో తెలుగులో ఓ సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఇండియాకి తిరిగొచ్చి క్షుద్ర పూజలు, దేవత మహిమల నేపథ్యం ఓ గ్రామీణ కథను సిద్దం చేయించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వై.రామారావుకి దర్శకుడిగా అవకాశమిచ్చి ప్రాజెక్ట్ ను అతని చేతిలో పెట్టారు శ్యామ్ ప్రసాద్ . హీరోయిన్ గా సౌందర్య ను ఎంపిక చేసారు. హీరోగా సురేష్ , కీలకమైన దేవత పాత్రకు రమ్య కృష్ణ, మరో కీలక పాత్రకు బేబీ సునయన, మిగతా పాత్రలకు బాబు మోహన్, కళ్ళు చిదంబరం ఇలా క్యాస్టింగ్ అంతా సెట్ అయింది.

హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇండియాకి తీసుకొచ్చి పని చేయించారు. తూర్పు గోదావరి జిల్లాలో అయినవిల్లి ప్రాంతంలో కొంత భాగాన్ని షూట్ చేసారు. ఓవరాల్ గా 70 రోజులు షూట్ చూసారు. జరిగిన షూట్ కి సంబంధించి రష్ చూసిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి కంటెంట్ నచ్చలేదు. అనుకున్న అవుట్ పుట్ రావట్లేదని గమనించారు. వెంటనే తమ సంస్థకి ఆస్థాన దర్శకుడిగా ఉన్న కోడి రామకృష్ణ గారిని పిలిపించి ఆయన చేతికి సినిమాను అందించారు. కోడి రామకృష్ణ సీన్ లోకొచ్చాక టేకింగ్ మారిపోయింది. విలన్ గా రామిరెడ్డి ను తీసుకున్నారు. తీసిన సన్నివేశాలతో పాటు , సాంగ్స్ ను కూడా మళ్ళీ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో రీ షూట్ చేశారు కోడి రామకృష్ణ. కొంత భాగం షూట్ పూర్తయ్యాక నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సినిమా చేయబోయే అద్భుతం కళ్ళ ముందు కనిపించింది. తమ బ్యానర్ లో గ్రాఫిక్స్ తో ఓ క్లాసిక్ సినిమా వస్తోందని ఆయనకి అర్థమైపోయింది. ఆ కాన్ఫిడెన్స్ తో తండ్రి ఎం.ఎస్.రెడ్డి మోరల్ సపోర్ట్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎక్కడా వెనకాడకుండా ‘అమ్మోరు’ ని భారీ వ్యయంతో నిర్మించారు. దాదాపు 400 రోజులకు పైగా షూటింగ్ చేసారు.

అమ్మోరు పాత్ర తాలూకు సన్నివేశాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి లండన్ వెళ్ళారు.  సినిమా టెక్నికల్ గా టాలీవుడ్ లో ఓ సంచలనం అవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయారు. అందుకే విజువల్ ఎఫెక్స్ట్ లో ఎంతో అనుభవం ఉన్న హాలీవుడ్ టెక్నీషియన్స్ తో C.G వర్క్ చేయించారు. ‘అమ్మోరు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉండగానే కోడి రామకృష్ణ -శ్యామ్ ప్రసాద్ రెడ్డిల కాంబోలో  అదిరిపోయే సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నారు. మొత్తంగా సినిమాకు కోటి ఎనబై లక్షలు ఖర్చయింది.

23 నవంబర్ 1995 లో ‘అమ్మోరు’ థియేటర్స్ లోకొచ్చింది. ఓ రెండు వారాల వరకు సినిమా ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకొని ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ కి కూడా పూనకం తెప్పించింది. థియేటర్ కౌంటర్ లో లెక్క చూస్తే రోజు రోజుకి పెరుగుతున్న ప్రేక్షకాదరణ తెలిసొచ్చేది. ముఖ్యంగా  మహిళల నుండి సినిమాకు మంచి ఆదరణ లభించింది. గ్రామీణ కథతో అద్భుతమైన విజువల్స్ తో సినిమాను తీర్చి దిద్దిన దర్శక -నిర్మాతలకు ‘అమ్మోరు’ గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది.  ‘అమ్మోరు’ టాలీవుడ్ లో మొదటి గ్రాఫిక్ సినిమాగా నిలిచింది. గ్రాఫిక్ తో సినిమా చేయాలంటే కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా అని అందరూ గట్టిగా  చెప్పుకున్నారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి గుర్తింపు అందించింది సినిమా. ముఖ్యంగా చెరువు లో నుండి చెయి లేచె సన్నివేశానికి ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆ సన్నివేశం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆ సీన్ తీసేందుకు టెక్నికల్ గా చాలా కష్టపడ్డారు.

సినిమాలో కథానాయికగా నటించిన సౌందర్య ఈ సినిమాతో మంచి గుర్తింపుతో పాటు మరిన్ని ఆఫర్లు అందుకుంది. తన నటనతో Yవిజయను తలపించి అమ్మవారి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకుంది రమ్య కృష్ణ. విలన్ గా నటించిన రామిరెడ్డిని బయట చూసి చిన్న పిల్లలు, ఆడాళ్ళు భయపడేవారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ పాత్ర.

* అమ్మోరు సినిమాకు సౌందర్య 180 రోజుల కాల్షీట్లు ఇచ్చారు. అందుకు గానూ ఆమె అందుకున్న రెమ్యునరేషన్ కేవాలం నలబై వేలు మాత్రమే. విడుదల తర్వాత నిర్మాత లక్ష ఇవ్వబోతే తీసుకోలేదట.

* సినిమాలో అమ్మోరు గా నటించిన రమ్య కృష్ణ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జ్యూరీ అవార్డు లభించింది.

* హిందీ , తమిళ్ , మలయాళ , ఒరియా , బెంగాలీ, భోజ్ పురీ భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా మంచి ఆదరణ అందుకుంది.