మీకు అప్పుడే చెప్పాను.. ఇప్పుడు చేసి చూపించాను

Monday,January 13,2020 - 03:57 by Z_CLU

అల వైకుంఠపురములో సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడాడు. ఏడాదిన్నర కిందట తను చేసిన ఓ ట్వీట్ తో స్పీచ్ స్టార్ట్ చేశాడు. తన నెక్ట్స్ సినిమా లేట్ అవుతుందని, కాస్త ఓపిగ్గా ఉండాలని, కచ్చితంగా బెస్ట్ మూవీ అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు అలవైకుంఠపురములో సినిమాతో అది నిజం చేసి చూపించానని అంటున్నాడు.

“ఈ సినిమా చేసేముందు ఒకటే అనుకున్నాను. త్రివిక్రమ్-నేను కలిస్తే చాలు, మంచి స్క్రిప్ట్ వస్తుందనుకున్నాను. మనం హ్యాపీగా ఉందాం, సరదాగా ఉందాం, ఓ సినిమా సరదాగా చేద్దాం, ఎక్కువ ఆలోచించకుండా చేద్దాం అన్నాను. అదే నమ్మి చేశాం. అలాగే స్క్రిప్ట్ వచ్చింది, అలాగే సినిమా రిజల్ట్ వచ్చింది. ఆ ఎంటర్ టైన్ మెంట్ వర్కవుట్ అయింది. త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కొట్టేశా.”

“నేను ఆల్రెడీ 20 సినిమాలు చేశాను. నా ముఖమే పాత. మళ్లీ హీరోయిన్ ను కూడా రిపీట్ చేస్తే ఇంకా పాతగా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ కొత్త హీరోయిన్ ను పెట్టుకుంటాను. అలా చేయడం వల్ల నేను కాస్త కొత్తగా కనిపిస్తానని ఫీలింగ్. కానీ పూజా హెగ్డే విషయంలో ఈ కండిషన్ పెట్టుకోలేదు. డీజే చేసినప్పుడే ఆమెతో మరో సినిమా చేయాలనుకున్నాను. ఇప్పుడు అల వైకుంఠపురములో చూసిన తర్వాత మరోసారి పూజాతో కలిసి నటించాలని ఉంది. కచ్చితంగా రిపీట్ చేస్తా.”