అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం

Monday,March 13,2017 - 10:46 by Z_CLU

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. ఈ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌ కొట్టాడు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ నా 53వ సినిమా ఇది. ఎప్పుడూ కామెడీ సినిమాలే చేస్తున్నావు. దానినుంచి బయటపడి కొత్తగా ఏమైనా చేయొచ్చు కదా? అని చాలా మంది అడుగుతున్నారు. గమ్యం, శంభో శివ శంభో తర్వాత అలాంటి విభిన్నమైన కథాంశాల కోసం చాలా రోజులు ఎదురుచూశాను. ఒరు వడక్కం సెల్ఫీ రూపంలో ఆ స్థాయి కథ దొరికింది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కెరీర్‌లో మొదటిసారి నేను థ్రిల్లర్ కథ చేస్తున్నాను. నా శైలి వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది అన్నారు.

ఈ నెల 16 నుంచి పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో ఈ సినిమా 2వందల రోజులు ఆడింది.