'అల్లరి నరేష్' ఇంటర్వ్యూ

Wednesday,February 17,2021 - 05:31 by Z_CLU

జనవరిలో ‘బంగారు బుల్లోడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ మరో రెండు రోజుల్లో ‘నాంది’ తో థియేటర్స్ లోకి రానున్నాడు. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఓ సీరియస్ ఫిలింతో రాబోతున్న నరేష్ ‘నాంది’ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. ఆ వివరాలు నరేష్ మాటల్లోనే…

కొత్త కాన్సెప్ట్ సినిమాలకు ‘నాంది’

ఈ సినిమా నుండి నటుడిగా ఇలాంటి కథలతో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక నుండి నేను చేయబోయే కొత్త కాన్సెప్ట్ సినిమాలకు ‘నాంది’ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నటుడిగా ఇలాంటి సినిమాలు చేస్తేనే గుర్తింపు ఉంటుంది. నేను చేసిన ‘నేను’,’శంభో శివ శంభో’,’గమ్యం’ సినిమాలు నాకు అలాంటి గుర్తింపునే అందించాయి.

అందుకే ఈ ప్రయత్నం చేశాను

నా రెగ్యులర్ కామెడీ జోనర్ నుండి పక్కకి వచ్చి కొత్తగా చేసిన సినిమా ‘నాంది’. మీ కామెడీ మొనాటనీ అవుతోంది. రొటీన్ సినిమాలు చేయకండి కొత్తగా చేయండి అని కొంత మంది చెప్పారు. అలాగే ఈ లాక్ డౌన్ లో చాలా మంది మలయాళం సినిమాలు చూస్తూ నేచురాలిటీ కంటెంట్ తో ఉండే ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావు అనుకున్నారు. వీటన్నిటికి నా సమాధానం ‘నాంది’.


విజయమే అవార్డ్

సినిమా విషయంలో బాగా ఆడి మంచి విజయం సాధిస్తే అది నాకు పెద్ద అవార్డుతో సమానం. నాతో పాటు ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. అందరి కష్టం రేపు స్క్రీన్ పై కనిపించి అది ఆడియన్స్ కి నచ్చితే హ్యాపీ. ఇలాంటి సినిమాలు ఆడితే మరిన్ని కొత్త కథలు చేయాలని దర్శక- నిర్మాతలు ముందుకొస్తారు.

‘గమ్యం’ తర్వాత

గమ్యం సినిమా తర్వాత అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవేవి నచ్చలేదు. మహర్షి లో రవి పాత్రలో డెప్త్ బాగా నచ్చింది. అలాంటి రోల్స్ వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధమే.

ఒక సెక్షన్ గురించి

సినిమాలో ఎవరికీ తెలియని ఒక సెక్షన్ గురించి డిస్కస్ చేశాము. ఆ విషయం గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. తను చాలా మంది లాయర్స్ ని కలిసి ఎక్కడా మిస్టేక్ లేకుండా పక్కగా ఉండేలా కథను సిద్దం చేసుకున్నాడు. ఆ సెక్షన్ గురించి సినిమా చూసాక అందరు గూగుల్ చేస్తారు. అదేంటనేది 19న తెలుస్తుంది.

అది ఫిక్సయ్యాం

ఈ సినిమా మొదలు పెట్టె ముందు చాలా రియలిస్టిక్ గా నేచురాలిటీకి దగ్గరగా ఉండాలని ఫిక్సయ్యాం. అందుకే లోకేషన్స్ తో పాటు మిగతా విషయాలపై కూడా చాలా కేర్ తీసుకున్నాం. సినిమా చూసిన ఆడియన్ కి ఎక్కడా సినిమాటిక్ ఫీల్ రాకూడదని కథకి కనెక్ట్ అవ్వాలని మా టార్గెట్. అందుకే అందరం ఎక్కువగా కష్టపడి ఈ సినిమా చేశాం.


ఇబ్బంది ఉండదు

సినిమాలో నగ్నంగా కనిపించే సన్నివేశం ఉంటుంది. బట్టలు లేకుండా చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించినా క్యారెక్టర్ లో ఇంపాక్ట్ కోసమే డైరెక్టర్ ఆ సీన్ డిజైన్ చేశాడు. అది చూసే ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉండదు.

ఫిజికల్ గా ఎక్కువ కష్టం

లడ్డు బాబు తర్వాత ఈ సినిమాకి ఫిజికల్ గా ఎక్కువగా కష్టపడ్డాను. సినిమాలో కాళ్ళు చేతులు కట్టేసి ఉల్టా యాంగిల్ లో చాలా సేపు ఉండాల్సి వస్తుంది.ఆ సీన్స్ చేసే టప్పుడు కన్వినియంట్ ఉండదు. ఆ పొజిషన్ లో కెమెరామెన్ ఒకటి చెప్తాడు. డైరెక్టర్ వచ్చి ఇంకొకటి చెప్తుంటాడు. టెక్నికల్ గా 360 డిగ్రీస్ షాట్ ఒకటి తీశారు. ఆ షాట్స్ కి ఐదారు గంటలు పట్టింది. అలాంటివి ఛాలెంజింగ్ గా అనిపించాయి.

ఆ వేరియేషణ్ కోసమే

సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు వేరియేషణ్ కోసం కొంచెం వెనక్కి కూర్చొని చెప్పాను. నా డైలాగ్స్ లో ఆ వేరియేషణ్ తెలుస్తుంది.

అది కొత్తగా ఉంటుంది

ఇప్పటికే తెలుగులో కోర్ట్ డ్రామా , జైలు నేపథ్యం సినిమాలు చాలా వచ్చాయి. కానీ అండర్ ట్రయిల్ ఖైదీ గురించి ఇప్పటి వరకు రాలేదు. కచ్చితంగా నాందిలో అది కొత్తగా అనిపిస్తుంది.