రేపే 2.0 ఆడియో రిలీజ్.. గ్రాండ్ గా ఏర్పాట్లు

Thursday,October 26,2017 - 01:17 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమాకు సంబంధించి రేపట్నుంచి సిసలైన హంగామా ప్రారంభంకానుంది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో రేపు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓ ఇండియన్ సినిమా ఆడియో వేడుకను బుర్జ్ ఖలీఫాలో నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం.

ఆడియో ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే స్టార్స్ అంతా దుబాయ్ చేరుకున్నారు. ప్రత్యేక అతిథిగా కమల్ హాసన్ కూడా దుబాయ్ చేరుకున్నారు. మరోవైపు బుర్జ్ ఖలీఫా పార్క్ లో వేడుక కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేశారు. రెహ్మాన్ లైవ్ షో కోసం పార్క్ లోనే ప్రత్యేకంగా మరో స్టేజ్ ను తయారుచేయడం విశేషం. 125 మంది సింఫనీ కళాకారులతో లైవ్ షో ఇవ్వబోతున్నాడు రెహ్మాన్.

ఆడియో ఫంక్షన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫా టవర్ తో పాటు దుబాయ్ లోని మెట్రో స్టేషన్స్, ఎయిర్ పోర్ట్స్ ను 2.0 పోస్టర్లతో నింపేశారు. దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ ఫంక్షన్ కోసం 12వేల పాసులు జారీచేశారు మేకర్స్.

ఈ ఒక్క ఈవెంట్ కోసమే 12 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఈ 12 కోట్లలో 2 కోట్ల రూపాయల్ని కేవలం ఎల్ఈడీల కోసమే కేటాయించింది. దుబాయ్ లోని షాపింగ్ మాల్స్, ప్రధాన కూడళ్ల వద్ద ఆడియో లైవ్ కోసం ఈ ఎల్ఈడీలు ఏర్పాటుచేశారు.

2.0 ఆడియో ఫంక్షన్ కు కమల్ హాసన్ తో పాటు దుబాయ్ రాజు మెహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశముంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్, ఎమీ జాక్సన్ లు నేరుగా హెలికాప్టర్ నుంచి వేదికపైకి దిగే ఏర్పాట్లు చేస్తున్నారు.