హీరో అఖిల్ ఇంటర్వ్యూ

Wednesday,December 27,2017 - 03:23 by Z_CLU

హలో హిట్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అఖిల్. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నానంటున్న అఖిల్.. హలోను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీడియా ముందుకొచ్చిన అఖిల్.. మూవీతో పాటు తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై మాట్లాడాడు.

ఫైట్స్ కోసం చాలా కష్టపడ్డా

సినిమాలో పార్కోర్ స్టంట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాని కోసం చాలా కష్టపడ్డాను. షూట్ కు 60 రోజుల ముందు నుంచే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ లాస్ ఏంజెల్స్ నుంచి తన టీమ్ తో పాటు వచ్చాడు. ఆ ట్రయినింగ్ తీసుకుంటే తప్ప ఆ స్టంట్స్ రావు. మూవీ స్టార్టింగ్ లోనే గ్రాఫిక్స్ వద్దని నిర్ణయించుకున్నాం. ఏదైనా రియల్ గా చేద్దామనే ఉద్దేశంతో ఫైట్స్ కోసం ఇంత కష్టపడ్డాను.

కథ కోసం స్టెప్పులు తగ్గించా

ఈ కథలో స్టెప్పులు వేయడానికి ఎక్కువ ఛాన్సులు లేవు. కానీ ఉన్నంతలో స్టెప్పులు వేశాను. సంగీత్ సాంగ్, టైటిల్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు చూస్తారు. కథ ప్రకారం సినిమా అంతా పరుగెడుతూనే ఉంటాను. అందుకే స్టెప్పులు తగ్గిపోయాయి.

సినిమా ఇంకా ఉంది

సినిమా నిడివి ఎక్కువైందని కొందరికి అనిపించింది. అది నిజమే. కానీ కథను పూర్తిగా నమ్మడం వల్ల నాకు మాత్రం అలా అనిపించలేదు. నిజానికి సినిమా ఇంకా ఉంది. మేం కావాలని కట్ చేశాం. ఈ సినిమాకు ఈ లెంగ్త్ అవసరమే. ఫస్ట్ డే కొంతమంది అమ్మాయిలు నా దగ్గరకొచ్చి సినిమా బాగుందని చెప్పారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పై ప్రశంసలు కురిపించారు.

ఫస్ట్ రిపోర్ట్ విని పడుకున్నాను

మామూలుగానే నాకు టెన్షన్ ఎక్కువ. రిలీజ్ ముందు రోజు అస్సలు నిద్రపట్టలేదు. దాదాపు ఉదయం 8 గంటల వరకు మేల్కొన్నాను. యూఎస్ నుంచి ఫస్ట్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిన తర్వాత కాసేపు నిద్రపోయాను. దాదాపు అన్ని రివ్యూస్ చూశాను. అందరూ 3కి పైగా రేటింగ్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది.

మంచి సినిమా చేశాను

నా యాక్టింగ్ బాగుందని చాలామంది అంటున్నారు. కానీ నాకు ఆనందాన్నిచ్చేది అది కాదు. ఓవరాల్ గా ఓ మంచి సినిమాలో నటించిన తృప్తి నాకు ఉంది. ఓవర్సీస్ లో ఫస్ట్ టైం నేను ఎక్స్ క్లూజివ్ గా సినిమాను ప్రమోట్ చేశాను. దాని కోసం చాలా కష్టపడ్డాను. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. నా రెండో సినిమాకే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతున్నాను. యూఎస్ మార్కెట్ కు ఈ సినిమా బాగా నచ్చుతుందని నేను నమ్మాను. అందుకే అక్కడ ఎక్స్ క్లూజివ్ గా ప్రమోషన్ చేశాను.

 

నాన్న లేకపోతే ‘హలో’ లేదు

నాన్న నాకే కాదు, ఈ సినిమాకే ఫాదర్ గా నిలిచారు. ప్రీ-ప్రొడక్షన్ నుంచి రిలీజ్ రోజు వరకు ప్రతి రోజు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. స్క్రిప్ట్, డైలాగ్స్, ఎడిటింగ్, ప్రొడక్షన్.. ఇలా ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. నాన్నతో మళ్లీ వర్క్ చేయాలని ఉంది. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.

నాగచైతన్య సలహాలు

నాగచైతన్యకు కూడా హలో  బాగా నచ్చింది. నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ఓ అన్నయ్యగా కాకుండా, ఓ నటుడిగా మంచి సలహాలు ఇచ్చాడు. ఇంకా చాలా డెలవప్ అవ్వాలని చెప్పాడు. ఫస్ట్ మూవీకి నటుడిగా నేను పెద్దగా చేయలేదు. ఈ సినిమాలో నటుడిగా కాస్త మెరుగయ్యాను.

ప్లీజ్.. నన్ను సింగర్ ను చేయొద్దు

ఈ సినిమాలో పాడడం అనేది అలా జరిగిపోయింది. అనూప్ తో చాలా ఎక్కువ సిట్టింగ్స్ జరిగాయి. అనూప్ మ్యూజిక్ ఎక్విప్ మెంట్ అంతా నా రూమ్ లోనే ఉంచేసేవాడు. దాదాపు 3 నెలలు కలిసున్నాం. ఓసారి హమ్మింగ్ చేస్తున్నప్పుడు అది విని పాడమని ప్రోత్సహించాడు. అయితే ఫైనల్ ఔట్ పుట్ లో నా వాయిస్ మార్చేస్తే ఒప్పుకోనని చెప్పాను. అనూప్ ఒప్పుకున్న తర్వాతే పాట పాడాను. నన్ను సింగర్ గా మార్చేందుకు అనూప్ దాదాపు వంద గంటలు కష్టపడ్డాడు.

నేచురల్ యాక్టింగ్ కు కారణం

హీరోయిన్ తో నేను నటించిన సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయంటున్నారు. దానికి కారణం నేను ముందురోజు సీన్ ఏంటని అడక్కపోవడమే. అప్పటికప్పుడు సెట్స్ పైకి వచ్చింది మనసులో అనుకున్నది చేసేవాడ్ని. అందుకే ఆ సీన్స్ చాలా నేచురల్ గా వచ్చాయి. బయట కూడా అమ్మాయిలతో నేను అలానే ఉంటాను.

చిరంజీవి నాకు సెంటిమెంట్

చిరంజీవి నాకు చాలా సెంటిమెంట్. నన్ను ఎప్పుడూ కొడుకులా చూసుకుంటారు. చరణ్ తో నేను ఎక్కువగా ఉంటాను. చాలా సందర్భాల్లో మా ఇద్దర్నీ ఒకేలా చూస్తారు. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవర్నయినా చిరంజీవి బాగా ప్రోత్సహిస్తారు. కాకపోతే నాపై ఆయనకు ఇంకాస్త ఎక్కువ అభిమానం.

చాలా నేర్చుకున్నాను

అఖిల్ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కోసం చూశాను. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నాను. హలో సినిమా నాకు పర్ ఫెక్ట్ అనిపించింది. ఈ సినిమాలో నేను నటించిన విషయాన్ని పక్కనపెడితే, సినిమాకు సంబంధించి నేను చాలా నేర్చుకున్నాను. పీఎస్ వినోద్, విక్రమ్ కుమార్, అనూప్, నాన్న నాగార్జున లాంటి టెక్నీషియన్ల నుంచి చాలా తెలుసుకున్నాను. వీళ్లు సినిమాను కేవలం పాట, ఫైట్ గా చూడరు.

ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదు

ప్రేమకథలు ఎన్ని చూసుకున్నా అందులో ఓ 7 కథలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా అబ్బాయి-అమ్మాయి ఫైనల్ గా కలవాలి. మధ్యలో సీన్లన్నీ చిన్నచిన్న కథల నుంచి పుట్టుకొచ్చినవే. కాకపోతే తీసే సన్నివేశాల్ని క్లాసికల్ గా తీయాలి. కాకపోతే ఫోన్ ఎలిమెంట్ అనేది లవ్ స్టోరీల్లో కాస్త కొత్తది. హలో కథ రొటీన్ లవ్ స్టోరీ అనిపించలేదు.

డెస్టినీ గురించి ఆలోచిస్తా

ఈ సినిమాలో డెస్టినీ గురించి చెప్పారు. ఈ మూవీకి ముందు నేను అలాంటివి నమ్మేవాడిని కాదు. ప్రాక్టికల్ గా ఉండడమే నాకు తెలుసు. కానీ హలో సినిమా హిట్ అయిన తర్వాత డెస్టినీపై నాక్కూడా నమ్మకం కుదిరింది. ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాను.

నా దృష్టిలో అన్నీ ఒకటే

సినిమాను మాస్, క్లాస్ అనే యాంగిల్ లో నేను చూడను. కేవలం కథను మాత్రమే చూస్తాను. కథ నా మనసుకు నచ్చితే చేసేస్తా. క్లాస్, మాస్ అనే కాలిక్యులేషన్లు పెట్టుకోను. కథ బాగుంటే చేసేస్తా.

రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం

ఈ సినిమాలో రమ్యకృష్ణను అమ్మా అని పిలిచే సీన్  అద్భుతంగా పండింది. అందరికీ అది బాగా నచ్చింది. నిజానికి ఈ సీన్ కోసం నేనేం చేయలేదు. ఆ సీన్ చేస్తున్నామని కూడా నాకు తెలీదు. ఆరోజు సెట్స్ పైకి వచ్చిన తర్వాత చెప్పారు. నాకు అనిపించింది నేను చేశాను. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. రమ్యకృష్ణ యాక్టింగ్ చూస్తే నాకు మతిపోతుంది.

ఫైట్స్ ఉన్నప్పటికీ వాళ్లకు నచ్చింది

ఈ సినిమా హిట్ అయిన తర్వాత మహిళలు, ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దాదాపు 40 నిమిషాలు యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ.. ప్యామిలీ ఆడియన్స్ కు ఇది నచ్చడం చాలా హ్యాపీ. అందరూ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

బాలీవుడ్ రీమేక్ రిజెక్ట్ చేశాను

హలో సినిమాకు ముందు యే జవానీ హే దీవానీ అనే హిందీ సినిమాను రీమేక్ చేయాలనుకున్న మాట వాస్తవం. అప్పట్లో ఆ సినిమా నచ్చింది. తెలుగులో చేసేద్దాం అనుకున్నాను. కానీ రెండో సినిమాకే రీమేక్ ఎందుకు అనిపించింది. అందుకే తప్పుకున్నాను. కానీ అలాంటి మోడ్రన్ కథలు చేయాలని నాక్కూడా ఉంది.

అమ్మ చాలా గర్వపడింది

క్లయిమాక్స్ లో నేను ఎలా చేస్తానో అనే భయం నాన్నలో ఉండేది. ఎందుకంటే ఈ సినిమాకు క్లయిమాక్స్ ప్రాణం. అలాంటి సీన్స్ లో నేను బాగా చేయకపోతే సినిమా పండదు. రిలీజ్ కు ముందు నాన్న ఈ సినిమాను చాలాసార్లు చూశారు. క్లయిమాక్స్ లో నా యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. అమ్మ కూడా సినిమా చూశారు. చాలా బాగుందన్నారు. ఓ నటుడిగా డెవలప్ అయినందుకు అమ్మకు చాలా గర్వంగా ఉంది.

నో బాలీవుడ్

నా పొజిషన్ ఏంటో నాకు తెలుసు. మీకు కూడా తెలుసు. తెలుగులోనే కనీసం 5 హిట్స్ ఇవ్వాలి. తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ఉంది కానీ అలాంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతానికి చేయను. బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా ఆలోచన ఇప్పట్లో లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే. తెలుగు దర్శకుడితోనే నెక్ట్స్ సినిమా చేస్తాను.

ఒకమ్మాయి నన్ను మెచ్చుకుంది

హలో సినిమాకు సంబంధించి ఓ అమ్మాయి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నాను. నా మనసు దోచుకున్నావ్ అంటూ మెసేజ్ పెట్టింది. ఈ సినిమాకు సంబంధించి నాకు నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే.

నా యాక్టింగ్ ను విశ్లేషించుకుంటా

హలో సినిమాలో దాదాపు ప్రతి సన్నివేశం నేచురల్ గానే వచ్చింది. ఈ సినిమాను నేను ఒకేసారి చూశాను. జనవరి 5 తర్వాత ఈ మూవీని కనీసం మరో 5సార్లు చూస్తాను. మూవీలో నేను ఇంకా ఎక్కడ బాగా చేస్తే బాగుంటుందో విశ్లేషించుకుంటాను.