సూపర్ హిట్ తర్వాత వరుసగా 12 ఫ్లాపులు

Tuesday,May 31,2022 - 06:45 by Z_CLU

After the huge success Superstar Krishna faced 12 flops in his career

ఒక సూపర్ హిట్ తర్వాత ఫ్లాప్ వస్తేనే హీరోలు కిందా మీదా అవుతుంటారు. అలాంటిది ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వరుసగా పన్నెండు ఫ్లాపులు అంటే ఆ హీరో ఎలా తట్టుకున్నాడు ? మళ్ళీ పదమూడో సినిమాతో ఎలాంటి విజయం అందుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అది 1974 సూపర్ స్టార్ కృష్ణ గారు నటించి, నిర్మించిన ‘అల్లూరి సీత రామరాజు‘ విడుదలైంది. సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కథానాయకుడిగా , నిర్మాతగా కృష్ణ పై ప్రశంసల జల్లు కురుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు అందుకుంటుంది. ఆ సమయంలో అగ్ర నిర్మాత చక్రపాణి గారు ‘అల్లూరి సీతారామరాజు’ ప్రింట్ పంపించు సినిమా చూస్తాను అని కృష్ణని అడిగారు. ప్రింట్ పంపడమే ఆలస్యం సినిమా చూసి కృష్ణకి కబురు పంపారు. ఇప్పుడెంత మంది నీతో సినిమాలు చేస్తున్నారు ? అని చక్రపాణి గారు అడిగిన ప్రశ్నకి సమాదానంగా ఏడెనిమిది ఉన్నారు. ఇంకో ఏడెనిమిది మంది వెయిటింగ్ లో ఉన్నారండి అంటూ కృష్ణ చెప్పగానే “అంతా పోయారు” అనేశారు. చక్రపాణి గారు తన అప్ కమింగ్ నిర్మాతల గురించి అల అనేసరికి కృష్ణకి ఏమి అర్థం కాలేదు. అదేంటి ? సినిమా బాలేదా ? అని అడిగారు కృష్ణ. దానికి బదులుగా చక్రపాణి బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా తర్వాత నువ్వు ఎంతటి సినిమా చేసినా ఎంత బాగా నటించినా సక్సెస్అందుకోవడం కష్టమే, ఈ సినిమా నుండి బయటపడి నీకు మళ్ళీ హిట్ రావడానికి ఇంకో ఏడాది లేదా రెండేళ్ళు పడుతుంది అంటూ చక్రపాణి గారు జ్యోశ్యం చెప్తుంటే కృష్ణ ఆలోచనలో పడ్డారు.

ఆ తర్వాత కృష్ణ వరుసపెట్టి సినిమాలు చేసినప్పటికీ చక్రపాణి గారు అన్నదే నిజమైంది. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తర్వాత ఊహించని విధంగా కృష్ణ దాదాపు పన్నెండు సినిమాలు అపజయం పొందాయి. కానీ ఏనాడు కృష్ణ కుంగిపోలేదు. కష్టపడుతూ ప్రయాణిస్తే విజయం అదే వస్తుందంటూ ముందుగు సాగారు. ఆ టైంలో నిర్మాతలు తనతో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవడంతో తనే మళ్ళీ నిర్మాతగా మారి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘పాడి పంటలు’ తీశారు. 1976 లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘పాడి పంటలు’ ఘన విజయం అందుకుంది. కుటుంబాలను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్లు రాబట్టి, కృష్ణ పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ సంస్థకు ఎనలేని లాభాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా విజయం తర్వాత కృష్ణ మళ్ళీ వెనక్కి చూడకుండా హీరోగా దిగ్విజయంగా కొనసాగారు.

అన్ని అపజయాలు ఎదురైనప్పుడు ఏ హీరో అయిన ఇక మన పని అయిపొయిందనుకుంటూ కుంగిపోతాడు. మెల్లగా కనుమరుగవుతాడు. కానీ కృష్ణ దైర్య సాహసాలతో సినిమాలు చేస్తూ ముందుకు కొనసాగారు. ‘పాడిపంటలు’ తో మళ్ళీ విజయం ఆయన్ను వరించి నటుడిగా మరింత బిజీ చేసింది. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిన సూపర్ స్టార్ కృష్ణ గారి దైర్య సాహసాలకు ఇదొక చక్కటి ఉదహరణ.

ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ హీరోగా అశేష అభిమానులను సంపాదించుకొని ఎన్నో ఏళ్ళు సూపర్ స్టార్ గా కొనసాగిన నటశేఖర , సూపర్ స్టార్ , పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

 

-రాజేష్ మన్నె 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress
    Photos and Special topics