జీ స్పెషల్: 'ఆదిత్య 369' కి 29 ఏళ్లు

Saturday,July 18,2020 - 05:39 by Z_CLU

పరిగెడుతున్న కాలం మళ్ళీ వెనక్కి వెళ్తే..? చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తులను చూసే అవకాశం వస్తే ..? మాములుగా ఉంటుందా ? మహానందం కలగక మానదు కదా.. కానీ ఇదంతా జరిగే పనేనా..? అస్సలు కాదు… కలలో కూడా నిజం కాని ఈ పాయింట్ తో ఇరవై తొమ్మిదేళ్ళ క్రితం ఓ సినిమా తెరకెక్కి విజయ కేతనం ఎగరవేయడమే కాకుండా ఆ టైంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు గొప్ప ప్రేరణగా గా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆ అద్భుత దృశ్య కావ్యమే ‘ఆదిత్య 369’. 29 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (జులై 18)న విడుదలై క్లాసిక్ సినిమా తెరవెనుక విశేషాలను టైం మిషన్ ఎక్కి తెలుసుకుందాం పదండి.

కాలేజీ డేస్ లో హెచ్.జి.వెల్స్ రాసిన ‘ది టైం మిషన్’ అనే పుస్తకం చదివిన సింగీతం శ్రీనివాసరావు దాన్ని మైండ్ లో పెట్టుకున్నారు. 1988 లో పుష్పక విమానం అనే ప్రయోగం చేసిన ఆయన 1991 లో మళ్ళీ అలాంటి ప్రయోగాత్మక కథతో సినిమా తీయలనుకున్నారు. అప్పుడు కాలేజీ డేస్ లో చదివిన టైం మిషన్ గురించి ఓ ఐడియా వచ్చింది. అలాగే 1985 లో రాబర్ట్ జెమకీస్ డైరెక్ట్ చేసిన ‘బ్యాక్ టు ఫ్యూచర్’ అనే సినిమాను ఆదర్శంగా తీసుకొని ఆయన తరహాలో ఓ కథను సిద్దం చేసుకున్నారు. ఓ సందర్భంలో ఎస్.పి.బాలసుబ్రమణ్యం తో కలిసి విమానంలో ప్రయాణం చేస్తుండగా ‘ఆదిత్య 369’ కథను బాలు చెవిలో వేసారు సింగీతం. కథ బాగా నచ్చడంతో వెంటనే తన బంధువు శివలెంక కృష్ణ ప్రసాద్ కి చెప్పారు బాలు. కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో బాలు సమర్పణలో సింగీతం గారితో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

అయితే సినిమాలో కథ పరంగా కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి… అందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రను ఎంచుకొని ఆ సమయంలో సన్నివేశాలు రాసుకున్నారు సింగీతం. ఆ పాత్రను చేయాలంటే ఒక్క నందమూరి బాలకృష్ణ వల్లే అవుతుందని భావించారు. వెంటనే బాలయ్య ను సంప్రదించి కథ వినిపించారు. తనకి ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయులు వంటి ఛాలెంజింగ్ పాత్ర దొరకడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. సినిమాలో హీరో కృష్ణ కుమార్ పాత్రకు కమల్ హాసన్ ను అనుకున్నారు. కమల్ , బాలయ్య కాంబో అదుర్స్ సినిమా మీద మాములు క్రేజ్ రాదని ఊహించారు. కానీ కమల్ అప్పటికీ కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటంతో బాలయ్యతోనే ఆ పాత్రను కూడా చేయించాలని ఫిక్సయ్యారు. ఇక హీరోయిన్ గా విజయశాంతిను అనుకున్నప్పటికీ అడిగినన్ని కాల్షీట్లు అందించే కొత్తమ్మాయిను తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో మోహిని ను తీసుకున్నారు. సినిమాలో కీ రోల్ పోషించే సైంటిస్ట్ గా టిన్ను ఆనంద్ ను ఫైనల్ చేసారు. పురాతన వస్తువులు సేకరించే రాజా రవి వర్మ పాత్రకు అమ్రేష్ పూరి ను తీసుకున్నారు. కిషోర్ అనే చైల్డ్ క్యారెక్టర్ కి స్క్రీన్ టెస్ట్ చేసి మాస్టర్ తరుణ్ ను ఎంపిక చేసారు. బాలయ్య అమ్మ పాత్రకు అన్నపూర్ణమ్మ, కామెడీ పండించే కానిస్టేబుల్ క్యారెక్టర్ కి సుత్తివేలు, శ్రీ కృష్ణ దేవరాయులు సంస్థానంలో ఉండే తిమ్మరుసు గా సోమయాజులు, తెనాలి రామకృష్ణ గా చంద్ర మోహన్ , స్పేస్ టైం క్యారెక్టర్స్ కి శుభలేక సుధాకర్, బ్రహ్మానందంను ఓకె చేసారు . క్యాస్టింగ్ ఓవర్. ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే సన్నివేశాలకు అద్భుతమైన మాటలు అందించే బాధ్యతను జంధ్యాల కు అప్పగించారు. సినిమాటోగ్రాఫర్ గా పీ.సి.శ్రీరామ్ ను ,ఆర్ట్ డైరెక్టర్ గా పేకేటి రంగ , తీసిన సినిమాను కత్తిరించే పనిను (ఎడిటర్) గౌతం రాజు ఇలా అందరినీ ఫైనల్ చేసారు. ఇక సినిమాకు ఆయువుపట్టులాంటి సంగీత బాధ్యతను ఇళయరాజా గారి చేతిలో పెట్టారు.

షూటింగ్ మొదలు పెట్టారు. మొదటి షెడ్యుల్ లో అన్నపూర్ణమ్మ, బాలయ్య, మోహిని, తరుణ్ లపై కొన్ని సన్నివేశాలు తీసారు. ఇంతలో కెమెరామెన్ పీ.సి.శ్రీరామ్ అనారోగ్యానికి గురయ్యాడు. తను మళ్ళీ మామూలు స్థితికి రావడానికి సమయం పట్టనుందని గమనించి వి. ఎస్.ఆర్.స్వామి ను అలాగే కబీర్ లాల్ లను తీసుకున్నారు. శ్రీ కృష్ణదేవరాయ కాలం నాటి సన్నివేశాలను స్వామి చిత్రీకరించారు. బాలకృష్ణ ను ఆంద్ర భోజగా చూపించడంలో స్వామీ గారి పాత్ర ముఖ్యమైనది. అలాగే ఇద్దరు బాలకృష్ణలు ఒకటే ఫ్రేములో చూపించిన నేర్పరితనం కూడా మెచ్చుకోవాలి. అలాగే ఫ్యూచర్ లో ఉండే స్పేస్ టైం సీన్స్ లో కబీర్ లాల్ గారి కెమెరా పనితనం తెలుస్తుంది. ఆ సన్నివేశాలకు సంబంధించి ఆర్ట్ వర్క్ కన్నా కబీర్ గారి కెమెరా జిమ్మిక్కులే ఎక్కువ. అలా ఊహించని విధంగా సినిమాకు ముగ్గురు కెమెరా మెన్లు పనిచేసారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో నాలుగు ఫ్లోర్లలో వేసిన సెట్స్ చూడటానికి సినీ ప్రముఖులు కూడా వస్తుండేవారు. ఇక భారీ సెట్టింగులతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా అని తెలుసుకున్న డిస్ట్రిబ్యూటర్లుఎక్కువ రేటుకే సినిమాను కొన్నారు. అలా రిలీజ్ కి ముందే మంచి డిమాండ్ తో సినిమా సేల్ అయింది. ఇక ఓ మోస్తరు అంచనాలతో 1991లో జులై 18 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిత్య 369’ సినిమా ఎవరూ ఊహించని విధంగా మంచి విజయం అందుకొని సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రేరణగా నిలిచింది. ఇక కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఫైనల్ గా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కోటిన్నర బడ్జెట్ తో తీసిన ఈ సినిమ 9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

విడుదల తర్వాత మేకర్స్ ఊహించిందే జరిగింది శ్రీ కృష్ణ దేవరాయులు పాత్రకు బాలకృష్ణ అద్భుతంగా న్యాయం చేసారని చూసిన ప్రేక్షకులు ఫీడ్ బ్యాక్ ఇచ్చి బాలయ్య పై ప్రశంసలు కురిపించారు. నిజంగా ఆ పాత్రలో బాలయ్య గొప్ప నటన ప్రదర్శించి తెరపై కృష్ణదేవరాయులుగా మెప్పించాడు. ఇక కృష్ణ కుమార్ పాత్రలో కూడా డీసెంట్ నటనతో అలరించాడు. మొదటి సినిమా యినప్పటికీ మోహిని నటనతో ఆకట్టుకొని మంచి మార్కులు అందుకుంది. ఇళయరాజా బాణీలకు వేటూరి సాహిత్యం చక్కగా కుదిరి శ్రోతలకు మంచి ఆల్బం అందింది. ముఖ్యంగా జాణవులే నేర జాణవులే పాటను ఇప్పటికీ వింటూ మురిసిపోయే మ్యూజిక్ లవర్స్ ఎందఱో. జంధ్యాల మాటలు సన్నివేశాలకు మరింత అందం తీసుకొచ్చాయి. పేకేటి రంగ ఆర్ట్ వర్క్ , గౌతం రాజు ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఎవరికీ వారు బెస్ట్ ఇచ్చి ఫైనల్ గా ఓ మంచి అవుట్ పుట్ తీసుకొచ్చి ప్రేక్షకుల హర్షద్వానాలు అందుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావు గారి ఆలోచనకి అన్ని చక్కగా కుదిరి చివరికి ‘ఆదిత్య 369’ ఓ అద్భుతమైంది. నిజానికి ఆ టైంలో టైం మిషన్ కాన్సెప్ట్ కథను రాసుకొని దానికి చరిత్రను జోడించి కొనసాగింపుగా భవిష్యత్తును చూపించి గొప్ప సినిమాగా మార్చిన దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారిని ఎన్ని సార్లు మెచ్చుకున్న సరిపోదు.దర్శకుడిగా ఆయన చేసిన ఈ ప్రయోగం ఇప్పటి దర్శకులకు కూడా గొప్ప ఆదర్శం అని చెప్పొచ్చు. ఇన్నేళ్ళ తర్వాత తెలుగు ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకునే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. త్వరలోనే ఆదిత్య 999 టైటిల్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.

మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు

*ముందుగా సినిమాకు ‘యుగపురుషుడు’ టైటిల్ అనుకున్నారు. నాన్న గారి టైటిల్ కాకుండా మరేదైనా టైటిల్ ఉంటే బాగుంటుందని బాలయ్య సజిస్ట్ చేయడంతో చివరికి అన్ని విధాలుగా ఆలోచించి ‘ఆదిత్య 369’ టైటిల్ ఫైనల్ చేసారు.

*సినిమా గ్రాండియర్ లో సెట్స్ భాగం 25 శాతమే… ఎక్కువ భాగం కెమెరా వర్క్ తో చేసిన జిమ్మిక్కులే.

*బాలయ్య శ్రీ కృష్ణ దేవరాయ గెటప్ కి కాస్ట్యూమ్ , నగలకి పది లక్షలు అయింది.

*సినిమాకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం సమర్పకుడిగా ఉంటూ ప్రొఫెసర్ రామదాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.

* ఓ స్టార్ హోటల్ లో జరిగిన శతదినోత్సవ వేడుకలకు విజయశాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్ కు షీల్డులు అందించారు

*హీరోయిన్ పాత్రకు SP శైలజ డబ్బింగ్ చెప్పారు.

* సినిమాలో తరుణ్ తో కలిసి రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కొన్నేళ్ళకి బాలయ్యతో కలిసి కృష్ణబాబు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

*రాజు సుందరం కొరియోగ్రఫీ చేసిన ఈ సినిమాకు వారి తనయులు ప్రభుదేవా , రాజు సుందరం కూడా పనిచేసారు.

*’సెంచరీలు కొట్టే వయస్సు మాది’ అనే లైను వేటూరి గారి తనయుడు రవి రాసిచ్చాడు. దానికి కొనసాగింపుగా వేటూరి పాటకు పూర్తి సాహిత్యం అందించారు.

*సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్ వేసాక రీ రీ రికార్డింగ్ ఇచ్చారు ఇళయరాజా. సౌండ్ ఎఫెక్ట్ బాగా కుదిరిన సన్నివేశాలకు ఆర్ ఆర్ ఇవ్వకుండా వదిలేసారు.

‘ఆదిత్య 369’ విడుదల తర్వాత సినిమా చూసి మెగా స్టార్ చిరంజీవి సినిమాను మెచ్చుకుంటూ అందరూ చూడాలని వీడియో ఆడియో ద్వారా ప్రచారం చేసారు.

* సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ , బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో రెండు నంది అవార్డులు వచ్చాయి.

*తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాను తమిళ్ లో ‘అపూర్వ శక్తి 369’ గా హిందీలో ‘మిషన్ 369’ గా అనువదించారు.

-రాజేష్ మన్నె