ఆదిత్య-369: వెరీ స్పెషల్ మూవీ

Wednesday,July 18,2018 - 01:31 by Z_CLU

రొమాంటిక్, హారర్ సినిమాలకు కామెడీ టచ్ ఇస్తున్నారు. యాక్షన్ సినిమాలకు రొమాన్స్ మిక్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ కథలకు యాక్షన్ కలుపుతున్నారు. కానీ ఇలాంటి మాస్-మాసాలా కాన్సెప్ట్ కు చరిత్రను లింక్ చేస్తే ఎలా ఉంటుంది..? మధ్యలో ఓ ఫిక్షన్ ను జోడిస్తే ఎలా ఉంటుంది..? సరిగ్గా ఇలాంటి ఆలోచన నుంచే పుట్టింది ఆదిత్య-369.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 27 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు (జులై 18) విడుదలైంది. అప్పటికే ఇంగ్లిష్ లో వచ్చిన బ్యాక్ టు ఫ్యూచర్, టైమ్ మెషీన్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు అద్భుతంగా మార్పులు చేయడంలో సింగీతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.

కృష్ణమోహన్ అనే కుర్రాడిగా, సేమ్ టైం శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ ఇందులో నటించారు. బాలయ్య నటనను ఎన్టీఆర్ మెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా పెద్ద ఎన్టీఆర్ మెచ్చుకున్న చిత్రంగా ఆదిత్య-369 నిలిచింది.

సెట్స్ లో అప్పటికే దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న పేకేటి రంగ, ఈ సినిమాతో మరోసారి పాపులర్ అయ్యారు. ఈ సినిమాకు వేసిన టైమ్ మెషీన్ సెట్, కృష్ణదేవరాయలు సెట్స్ ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఈ సెట్స్ స్టిల్స్ పత్రికల్లో చూసి… సినిమా నిర్మాణంలో సహకారం అందించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు.

ఇప్పటికీ ఈ సినిమా కథ అంటే సింగీతానికి చాలా ఇష్టం. బాలయ్యతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని రెండేళ్ల కిందటే ప్రకటించారన. మరోవైపు నందమూరి అభిమానులు మాత్రం ఆదిత్య-369 సీక్వెల్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటిస్తే చూడాలనుకుంటున్నారు.