అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూత

Sunday,February 25,2018 - 07:32 by Z_CLU

అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. దుబాయ్ లో గుండెపోటుతో ఆమె మరణించారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె, అక్కడే తీవ్రమైన గుండెపోటు రావడంతో నిన్న అర్థరాత్రి కన్నుమూశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా సినీపరిశ్రమతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నంబర్ వన్ అనిపించుకున్నారు శ్రీదేవి.

1967లో బాలనటిగా తమిళ చిత్రసీమలో ప్రవేశించారు శ్రీదేవి. అప్పట్నుంచి ఆమెకు రెస్ట్ అన్నదే లేదు. బాలనటిగా ఎన్నో సినిమాలు చేస్తూనే, మరోవైపు చదువుకున్నారు. ఆ తర్వాత షార్ట్ గ్యాప్  లో… 16 ఏళ్లకే హీరోయిన్ అయ్యారు. ఇక అక్కడ్నుంచి ఆమె కెరీర్ లో గ్యాప్ అనే పదమే కనిపించలేదు. ఏకంగా 3 దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించారు. అందరితో అతిలోక సుందరి అనిపించుకున్నారు.

1975-85 మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన రికార్డు సృష్టించారు శ్రీదేవి. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ఏకంగా పదేళ్ల పాటు నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగారు. ఒకేసారి ఇలా 3 పరిశ్రమలో నంబర్ వన్ పొజిషన్ అంటే ఊహించుకోవడమే కష్టం. అలాంటి ఊహను నిజం చేసి చూపించారు శ్రీదేవి. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు రెస్ట్ లేకుండా పనిచేశారు.

2 తరాల నటులతో నటించిన ఘనత కూడా శ్రీదేవికే దక్కుతుంది. అక్కినేని నాగేశ్వరరావుతో ఆడిపాడిన శ్రీదేవి, అక్కినేని నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా చేశారు. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు వ్యక్తిగతంగా కూడా శ్రీదేవి చాలా హ్యాపీగా ఉండేవారు. అదే ఆమెను అందంగా ఉంచేదని అంతా చెబుతుంటేవారు. అయితే తనకు అన్నీతానై ఉన్న అమ్మ చనిపోవడంతో శ్రీదేవి కెరీర్ లో జోరు తగ్గింది. అదే టైమ్ లో బోనీకపూర్ ను పెళ్లి చేసుకొని సడెన్ గా సినిమాలు ఆపేశారు శ్రీదేవి. 1996లో పెళ్లి చేసుకున్న శ్రీదేవికి జాహ్నవి, ఖుషి పిల్లలు.

పెళ్లి తర్వాత పిల్లలకే పరిమితమైన శ్రీదేవి, వాళ్లు పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇంగ్లిష్-వింగ్లిష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత చేసిన మామ్ సినిమా కూడా ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరోవైపు కూతురు జాహ్నవిని పెద్ద హీరోయిన్ గా చూడాలనుకున్నారు శ్ర్దీదేవి. ఎన్నో కథలు తనే స్వయంగా విని ఫైనల్ గా ధడక్ సినిమాకు ఓకే చెప్పారు. మరాఠీలో పెద్ద హిట్ అయిన సైరాట్ కు రీమేక్ అది. కూతురు మొదటి సినిమా విడుదలకాకముందే శ్రీదేవి ఈ లోకాన్ని వీడారు.

తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు శ్రీదేవి. పద్మశ్రీతో పాటు 14 సార్లు ఫిలింఫేర్ కు నామినేట్ అయ్యారు. నాలుగుసార్లు ఉత్తమ నటిగా, 2సార్ల స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కింది.