వేడుకగా నటి అర్చన సంగీత్

Tuesday,November 12,2019 - 12:13 by Z_CLU

తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు.

ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. గతంలో వేద పేరుతో సినిమాల్లో నటించింది అర్చన. తర్వాత తన అసలు పేరునే సినిమాల్లో కూడా కొనసాగించింది.