Interview - తిరువీర్ (మసూద)

Thursday,November 17,2022 - 08:00 by Z_CLU

‘మళ్ళీ రావా’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మూడవ చిత్రంగా ‘మసూద’ అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ జీ సినిమాలు తో ఎక్స్ కూసివ్ గా మాట్లాడాడు. ఆ విశేషాలు తిరువీర్ మాటల్లోనే..

జీ తెలుగు తో మొదలు 

సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివే రోజుల్లో అప్పుడప్పుడు కాలేజ్ లో షూటింగ్స్ జరిగేవి. ఒక షాట్ లో నడుచుకుంటూ రమ్మని ఎదురుగా మైక్ లో చెప్పారు. అసలు నన్నెందుకు ఫ్రేం లోకి రమ్మంటున్నారు అనిపించింది. తర్వాత BSC బయో టెక్నాలజీ పూర్తి చేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిల్లో జాబ్ మాత్రం చేయకూడదని డిసైడ్ అయ్యాను. సరిగ్గా అప్పుడు నా ఫ్రెండ్ థియేటర్ ప్లే లో కోర్స్ చేయమని చెప్పాడు. అలా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో థియేటర్ ప్లే కోర్స్ లో జాయిన్ అయ్యి డ్రామాలు వేయడం మొదలు పెట్టాను. మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాను. జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్ షో కి పిల్లలతో థియేటర్ ప్లే చేయించాలని చేస్తారా ? అని అడిగారు. వచ్చిన , నచ్చిన పనే కాబట్టి డబ్బుల కోసం వెంటనే ఓకె చేసేసి టివీ రంగంలో అడుగుపెట్టాను. ఆ షో నాకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తున్న నాకు ‘జార్జ్ రెడ్డి’ తో నటుడిగా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ‘పలాస’ , ‘టక్ జగదీశ్’ వంటి సినిమాలు నటుడిగా ఇంకా పేరు తీసుకొచ్చాయి.  జీ తెలుగుతో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు మసూద వరకు వచ్చింది.

సీరియస్ హారర్ 

ఈ మధ్య హారర్ సినిమాలు రావడం లేదు. అడపాదడపా వచ్చినా అందులో అన్నీ హారర్ కామెడీ లే. మసూద తో సీరియస్ హారర్ సినిమా చూపించే ప్రయత్నం చేశాం. ఇందులో కామెడీ ఉన్నా హారర్ ఎలిమెంట్స్ తో కథ నడుస్తుంది.

సంగీత … అక్కలా 

సంగీత గారిని ఒక అక్కలా  భావిస్తాను. ఆమె నుండి నటుడిగా ఎన్నో విషయలు నేర్చుకున్నాను. ఒక్కో సారి ఆమె నటించిన శివ పుత్రుడు , ఖడ్గం సినిమాలు గుర్తుచేసుకుంటూ ఆ సంగీత గారితోనేనా ? నేను నటించేది అనుకునే వాడిని. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుంది. ఆమె కోవిడ్ టైంలో నాకు ఇచ్చిన భరోసా చెప్పిన మంచి విషయాలు ఎప్పటికీ మర్చిపోలేను.

ఈ బేనర్ లో మూడో సినిమా అనుకోలేదు 

యూ ట్యూబ్ లో నేను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూసి మా డైరెక్టర్ , నిర్మాత రాహుల్ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. కథ -పాత్ర నచ్చడంతో వెంటనే ఓకె చెప్పేశాను. రెండు సూపర్ హిట్స్ తీసిన బేనర్ లో నాది మూడో సినిమా అవుతుందని అనుకోలేదు. రాహుల్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన్ని అన్నా అని పిలుస్తుంటాను.

యాప్ట్ టైటిల్ అంటారు 

అరబిక్ లో మసూద అనే పేరు బాగా పాపులర్. ఎక్కువ మంది ఈ పేరు పెట్టుకుంటారు. రిలీజ్ తర్వాత సినిమాకు ఇది యాప్ట్ టైటిల్ అని ప్రేక్షకులు కచిటంగా అనుకుంటారు.

సౌండ్ తో చూస్తే అదిరిపోయింది 

డబ్బింగ్ చెప్పేటప్పుడు పలు సార్లు సినిమా చూశాను. కానీ తర్వాత ప్రశాంత్ వర్మ వచ్చిన స్కోర్ తో సినిమా చూస్తే సౌండింగ్ అదిరిపోయింది. తనకి కూడా ఇదొక చాలెంజింగ్ సినిమా. హారర్ నేపథ్యంలో ప్రశాంత్ సినిమా చేయలేదు. తన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటారు.

నాని , విజయ్ సపోర్ట్ మర్చిపోలేను 

ఈ సినిమాకు సంబంధించి నాని గారు , విజయ్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. విజయ్ నాకు కొన్నేళ్ళ క్రితం నుండి తెలుసు. ఇద్దరం థియేటర్ ప్లే నుండి వచ్చిన వాళ్ళమే కానీ పరిచయం లేదు. ఇండస్ట్రీ కి వచ్చాకే విజయ్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటించాం. నాని గారితో టక్ జగదీశ్ నుండి పరిచయం ఏర్పడింది. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. విజయ్ మంచి ఫ్రెండ్ ఎప్పుడు కలిసినా యోగ క్షేమాలు అడుగుతాడు. స్ట్రగ్లింగ్ డేస్ లో కొన్ని ఆఫీస్ అడ్రెస్ లు పంపించి రిఫర్ చేస్తా వెళ్ళు అని చెప్పేవాడు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ గా తన గ్రోత్ చూస్తే సంతోషంగా ఉంది.

ఇలాంటి సినిమాలను చూడాలి

కొత్తవాళ్ళతో రాహుల్ గారు ఇలాంటి సినిమా తీయడం గొప్ప విషయం. మా డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా చూసి నచ్చితే ఎక్కువ మందికి చెప్తే రాహుల్ గారు ఆయన బేనర్ లో ఇలాంటి ఎన్నో సినిమాలు తీస్తారు నాలాంటి వారికి ఓ మంచి అవకాశం దొరుకుతుంది.