నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

Tuesday,September 08,2020 - 09:55 by Z_CLU

సీనియర్ ఆర్టిస్టు, రంగస్థల నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. గుంటూరులోని ఆయన కుమారుడి ఇంట్లో ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు జయప్రకాష్ రెడ్డి. తెలుగుతెరపై విలనిజంకు కొత్త అర్థం చెప్పిన నటుడు జయప్రకాష్ రెడ్డి.

కర్నూలు జిల్లాలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి.. బీఈడీ చదివి టీచర్ అయ్యారు. ఉదయం పాఠాలు చెప్పడం, సాయంత్రం నాటకాలు వేయడం ఆయనకు ఇష్టం. అయితే రోజులు గడిచేకొద్దీ పాఠాల కంటే, నటనపైనే ఆయనకు ఇష్టం పెరిగింది.

అలా రంగస్థలంపై నటిస్తూ, వెండితెరవైపు అడుగులువేశారు జేపీ. దాసరి నారాయణరావు చలవతో 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాతో ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగింది. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం సమరసింహారెడ్డి. అంతకంటే ముందు ప్రేమించుకుందాం రా మూవీ వచ్చినప్పటికీ.. సమరసింహారెడ్డితో జేపీ బాగా పాపులర్ అయ్యారు.

ఓవైపు విలన్ గా నటిస్తూనే మరోవైపు ఊహించని విధంగా కమెడియన్ మారిపోయారు జేపీ. ఈవీవీ సత్యనారాయణ ఈ విలన్ ను కమెడియన్ గా మార్చేశారు. ఇక అప్పట్నుంచి జేపీ కెరీరే మారిపోయింది. ఎవడిగోల వాడిది, ఢీ, కిక్, కబడ్డీ కబడ్డీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సిద్ధు ఫ్రం శీకాకుళం లాంటి సినిమాల్లో జేపీ కామెడీ ఎవర్ గ్రీన్.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు జేపీ. గతేడాది వచ్చిన క్రేజీ క్రేజీ ఫిలింగ్ తర్వాత ఆయన హైదరాబాద్ వదిలి గుంటూరులో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లిపోయారు. అయితే దర్శకుడు అనీల్ రావిపూడి పట్టుబట్టి ఆయన్ను మరోసారి ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ పాత్ర ఇచ్చాడు.

కూజాలు చెంబులౌతాయ్ అంటూ సరిలేరు నీకెవ్వరులో జేపీ చెప్పిన డైలాగ్ ను ఎవ్వరూ మరిచిపోలేరు. అలా తను చేసిన ఆఖరి సినిమాతో కూడా నవ్వులు పూయించిన జేపీ.. ఎన్నో మంచి పాత్రల్ని మనకు అందించి, ఈ లోకాన్ని వీడివెళ్లారు.