50 ఏళ్ల రెబల్‌ స్టార్‌

Saturday,January 20,2018 - 11:01 by Z_CLU

రౌద్రపూరిత నటనకు ప్రతిరూపమై…రెబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. 1966లో చిలకా గోరింకా చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం….దిగ్విజయంగా 50 ఏళ్లకు చేరుకుంది. ఇవాళ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో ముచ్చటించారు.

అప్పుడే ఆత్మవిశ్వాసం వచ్చింది
చిలకా గోరింకా చిత్రంలో ఎస్వీ రంగారావు గారితో కలిసి నటించిన సన్నివేశం నా నటనకు తొలి అడుగు. అభినయంలో ఆయన శిఖర సమానుడు. ఎస్వీఆర్‌ అంత నటించానని నేను చెప్పుకుంటే అబద్ధమే అవుతుంది. కానీ ఆయనను అందుకునేందుకు ప్రయత్నించాను. ఆ శిఖరానికి సగం చేరుకున్నాను. చిలకా గోరింకాలో నటించాకే నాలో నటుడు ఉన్నాడనే ఆత్మవిశ్వాసం కలిగింది.

విలన్ పాత్రలతోనే గుర్తింపు
మనం నటుడిగా ప్రయత్నించవచ్చు అని అనుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం అవకాశాలు రాలేదు. నేనంటే నేనే చిత్రంలో స్టైలిష్‌ విలన్‌గా నటించాను. ఆ చిత్రానికి పేరు రావడంతో ప్రతినాయకుడిగా పదికి పైగా సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒకటీ రెండు చిత్రాలు మాత్రమే ఎంచుకున్నాను. వాటిలోనూ నటనకు అవకాశం ఉండీ…ప్రత్యేకంగా ఉండే వాటికే ప్రాధాన్యమిచ్చాను.

పరిశ్రమ అభివృద్ధి ముఖ్యం
కొందరు తమకోసం సినిమాలు చేసుకున్న వాళ్లున్నారు. మరికొందరు తమ కోసం సినిమాలు చేస్తూ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డారు. మరికొందరు కేవలం చిత్ర పరిశ్రమ కోసమే సినిమాలు చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి వాళ్లు తమ కోసం సినిమా చేసుకునేవాళ్లు. ఎంఎస్‌ రాజు లాంటి నిర్మాతలు కేవలం ఇండస్ట్రీ కోసం సినిమాలు రూపొందించారు. మా గోపీకృష్ణ పతాకంపై పరిశ్రమ అభివృద్ధి కోసం ఆలోచిస్తూనే, మా వంతు ప్రయత్నాలు చేశాం.

50 ఏళ్ల పండగ చేస్తా
నా పుట్టిన రోజుతో పాటు 50 ఏళ్ల పండగను కూడా జరపాలని అనుకుంటున్నాం. అందుకే ఈ పుట్టిన రోజుకు అభిమానులను కలవడం లేదు. స్వర్ణోత్సవం సందర్భంలో అందరినీ కలుస్తాను. 30 – 40 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. వాళ్లకు స్వర్ణోత్సవ వేడుకల్లో సన్మానం చేయాలని అనుకుంటున్నా. మరో రెండు మూడు నెలల్లో ఆ వేడుకను నిర్వహిస్తాము. ఆ సందర్భంలో చిత్ర పరిశ్రమ సన్నిహితులతో ప్రత్యేకంగా సమావేశమవుతాను.

మరిన్ని బాహుబలులు రావాలి
బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఎల్లలు లేనంతగా ఎదిగింది. హాలీవుడ్‌ చిత్రాలకు పోటీగా విదేశాల్లో వసూళ్లు సాధించింది. బాహుబలి స్ఫూర్తిగా ఎవరైనా సినిమాలు చేయొచ్చు. ఆ సినిమాను చూసి వీళ్లు సినిమా చేస్తారట అని ఎవరూ నిందించవద్దు. గొప్ప చిత్రంతో పోల్చుకుని ప్రయత్నించినప్పుడు అంతా ప్రశంసించాలి, ప్రోత్సహించాలి గానీ నిరుత్సాహపరచవద్దు. అంత చేరువ కాకున్నా… అంత పేరు తెచ్చుకునే అవకాశం ఇతర చిత్రాలకూ లేకపోలేదు. బాహుబలి లాంటి సినిమాలు చేయాలనుకునే వాళ్లకు సాంకేతికంగా సహకరించేందుకు ఓ సంస్థను ప్రారంభించబోతున్నాం. ఇందులో బాలీవుడ్‌లో పేరున్న దర్శకుల నుంచి సాంకేతిక నిపుణులు, పేరున్న సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ప్రతిష్ఠాత్మక చిత్రాలు చేయాలనుకునేవాళ్లకు సలహాలు, సూచనలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.

నన్ను సహజంగా చూపించే పాత్రలు కావాలి
రాబోయే ఎన్నికల కోసం నన్ను కర్నాటకతో సహా మరికొన్ని రాష్ట్రాలకు ప్రచార బాధ్యతలు ఇవ్వబోతున్నారు. వాటి గురించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈ సమయంలో సినిమాలకు కొద్ది సమయమే కేటాయించగలను. అయితే నటనకు అవకాశమున్న మంచి పాత్రలు వస్తేనే ఒప్పుకుంటాను. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో చిన్న పాత్ర నాది. కేవలం నాలుగైదు సన్నివేశాలుంటాయి. ఈ చిన్న పాత్రకు నేనెందుకయ్యా అని దర్శకుడిని అడిగితే…సార్‌ పాత్ర చిన్నదే కానీ మీరు నటిస్తే ఆ పాత్రతో కథ మరో స్థాయికి వెళుతుంది అన్నారు. దర్శకుడి మాటలు నచ్చాయి. చేస్తానన్నాను. అలా నన్ను సహజంగా చూపించే పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తాను.

ప్రభాస్ మెత్తబడ్డాడు
గతంలో పెళ్లి మాటెత్తితేనే వద్దనేవాడు ప్రభాస్‌. ఇటీవల కాస్త మెత్తబడుతున్నాడు. బాహుబలి తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు సాహో అంటున్నాడు. ఏమైనా పెళ్లి విషయంలో అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రభాస్‌ సాహో తదుపరి సినిమా మా సంస్థలో ఉంటుంది.