ఈ వీకెండ్ 5 సినిమాలు

Wednesday,November 08,2017 - 10:06 by Z_CLU

టాలీవుడ్ లో ఈ వీకెండ్ ఒకేసారి 5 సినిమాలు విడుదలకాబోతున్నాయి. వీటిలో 3 డబ్బింగ్ సినిమాలైతే, 2 స్ట్రయిట్ మూవీస్. డబ్బింగ్ మూవీస్ తో విజయ్, సిద్దార్థ్, విశాల్ తెలుగుతెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని విజయ్ చూస్తుంటే.. మరోసారి క్లిక్ అవ్వాలని సిద్దార్థ్ పరితపిస్తున్నాడు. అటు విశాల్ ఓ మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల ప్రివ్యూ..

సిద్దార్థ్ నటించిన కంప్లీట్ హారర్ మూవీ అవల్. తమిళనాట ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే మూవీ గృహం పేరిట తెలుగుతెరపైకి వస్తోంది. కోలీవుడ్ లో హిట్ అవ్వడంతో  పాటు తెలుగు వెర్షన్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ప్రాజెక్టుపై క్రేజ్ క్రియేట్ అయింది. టాలీవుడ్ లో గృహం మూవీని సిద్దార్థ్ కమ్ బ్యాక్ మూవీగా వ్యవహరిస్తున్నారు.

గృహంతో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో డబ్బింగ్ మూవీ ‘అదిరింది’. నిజానికి తమిళ వెర్షన్ మెర్సల్ తో పాటు దీన్ని కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేద్దామని విశ్వప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. సెన్సార్ కారణంగా లేట్ అయిన ఈ సినిమా రేపు (నవంబర్ 9) విడుదలకు సిద్ధమైంది. విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు రెహ్మాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి, విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

గృహం, అదిరింది సినిమాలతో పాటు ఈ వీకెండ్ మరో డబ్బింగ్ మూవీ కూడా రెడీ అయింది. దాని పేరు డిటెక్టివ్. ఇది కూడా తమిళనాట విడుదలై సూపర్ హిట్ అయింది. హీరో విశాల్ నటించిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తే, విలన్ పాత్రలో ఆండ్రియా కనిపించనుంది. తమిళ్ లో తుప్పరివాలన్ పేరిట తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డిటెక్టివ్ పేరుతో ఈ వీకెండ్ విడుదల చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ఆన్ లైన్ లో అఫీషియల్ గా ఉంది. తెలుగులో ఏ మేరకు క్లిక్ అవుతుందనేది చూడాలి.

 

ఇక ఈవారం థియేటర్లలోకి వస్తున్న స్ట్రయిట్ సినిమాల విషయానికొస్తే.. మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు రిలీజ్ కు రెడీగా ఉంది. మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్. నారా రోహిత్ వాయిస్ఓవర్, సముద్రంలో తీసిన విజువల్స్, క్లయిమాక్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్ అని చెబుతున్నారు.

ఒక్కడు మిగిలాడుతో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో స్ట్రయిట్ మూవీ కేరాఫ్ సూర్య. హీరో సందీప్ కిషన్ ఈ సినిమాతో లక్ చెక్ చేసుకోబోతున్నాడు. వరుస హిట్స్ తో ఊపుమీదున్న మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్. ఆమె గోల్డెన్ టచ్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందని సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు మేకర్స్. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడంతో పాటు ట్రయిలర్ ఇప్పటికే హిట్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.