రూ.200 కోట్లు.. కామన్ అయిపోయిందా?

Monday,February 11,2019 - 11:26 by Z_CLU

ఒకప్పుడు సినిమాకు 50 కోట్లు బడ్జెట్ పెడితే ముక్కున వేలేసుకునేవారు. ఆ తర్వాత అది కామన్ అయిపోయింది. దాదాపు పెద్ద హీరోల సినిమాలన్నింటికీ 70-80 కోట్ల బడ్జెట్ సర్వసాధారణం అయింది. కానీ
బాహుబలి వచ్చిన తర్వాత ఈ లెక్క వంద కోట్లను దాటింది. బాహుబలి-2 సక్సెస్ తర్వాత 200 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు వెనకాడ్డం లేదు.

సాహో
బాహుబలి-2 సక్సెస్ తర్వాత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ముందుగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. తర్వాత అది 150 కోట్లకు, ఆ తర్వాత 200 కోట్లకు చేరింది. ఇదేదో బడ్జెట్ చేజారినట్టు భావించాల్సిన అవసరం లేదు. నిర్మాతలే తమ ఇష్టంతో పెంచుకున్న బడ్జెట్ ఇది.


సైరా
ఇది కూడా 200 కోట్ల రూపాయల సినిమానే. తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే చిరస్మరణీయ చిత్రంగా సైరాను నిలపాలనే ఉద్దేశంతో మెగా తనయుడు రామ్ చరణ్ ఇలా కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఒక్క సీన్ కాదు
కదా, ఒక్క ఫ్రేమ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు. విడుదల టైమ్ కు మరో 20 కోట్లు ఎక్స్ ట్రా అవుతుందని స్వయంగా రామ్ చరణే చెబుతున్నాడంటే, సైరాను ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో
అర్థమౌతోంది

ఆర్-ఆర్-ఆర్
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా. రాజమౌళి లాంటి దర్శకుడు తీస్తున్న సినిమా. 200 కోట్లు బడ్జెట్ దాటకుండా ఉంటుందా? అవును.. ఆర్-ఆర్-ఆర్ కూడా 200 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమానే. కాకపోతే ఇది ప్రాధమికంగా అనుకున్న ఎమౌంట్ మాత్రమే. ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ మాత్రమే నడుస్తోంది. ఇంకా ఏడాది షూటింగ్ ఉంది. కాబట్టి మరో 50 కోట్లు అదనంగా ఖర్చవుతుందని నిర్మాత దానయ్య మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాడు.

ప్రభాస్-రాధాకృష్ణ మూవీ
200 కోట్ల సినిమాల లిస్ట్ లోకి ఇది కూడా చేరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం కూడా నిర్మాతలు 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. కథ ప్రకారం ఆమాత్రం బడ్జెట్ అవసరమౌతుందని భావిస్తున్నారట.

ఇలా తెలుగులో 200 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో మంచి కాంబినేషన్లు కుదిరితే మహేష్ కూడా ఈ బడ్జెట్ లో ఓ సినిమా చేయడం గ్యారెంటీ.