కమర్షియల్ సినిమా తీస్తే ప్రయోగాలు చేయలేం అంటారు. ప్రయోగాలు చేస్తే అందులో కమర్షియల్ హంగులు మిస్సవుతాయంటారు. ఈ రెండు మిక్స్ చేసి స్టార్ హీరోతో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అదే అరవింద సమేత.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ కలిసి చేసిన ఈ సినిమా ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి చేసుకుంది.
అసలు ఈ సినిమా ఎత్తుగడలోనే పెద్ద ప్రయోగం ఉంది. క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ తో ఏ సినిమా అయినా ముగుస్తుంది. మరి అదే క్లైమాక్స్ ను ముందే చూపిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే ప్రయోగాన్ని AravindhaSametha లో చేసి చూపించారు. ఓ కమర్షియల్ సినిమాను కళాత్మకంగా ప్రజెంట్ చేయడం ఎలాగో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.
యుద్ధంతో కథ ముగుస్తుంది. ఆ యుద్ధం తర్వాత వ్యథ ఎవ్వరికీ పట్టదు. ఈ పాయింట్ నే అరవింద సమేతలో చూపించారు. వీరరాఘవరెడ్డిగా ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరవింద సమేత.
గట్టిగా అరిస్తే లేదా తొడకొట్టి వార్నింగ్ ఇస్తే మాస్ అనుకుంటాం. కూల్ గా కుర్చీలో కూర్చొని చెప్పే బలమైన డైలాగ్ కూడా మాస్ అప్పీల్ ఇస్తుంది. అలాంటి మాస్ డైలాగ్స్ ఇందులో లెక్కలేనన్ని ఉన్నాయి. త్రివిక్రమ్ పెన్ను పదును తెలియాలంటే అరవిందసమేత చూడాలి.
ఎన్టీఆర్ యాక్టింగ్, త్రివిక్రమ్ పెన్ను, తమన్ వాయిద్యం, జగపతిబాబు విలనిజం, పూజాహెగ్డే క్యూట్ నెస్, నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్.. ఇలా అన్నీ ఈ సినిమాకు అతికినట్టు సరిపోయాయి. అందుకే బాక్సాఫీస్ బరిలో సూపర్ సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది అరవింద సమేత.
హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మించిన ఈ సినిమా తారక్ అభిమానులకు ఎప్పుడూ స్పెషల్ మూవీనే.