'బొమ్మరిల్లు' కు పదేళ్లు

Tuesday,August 09,2016 - 11:19 by Z_CLU

లవ్ కథకు, ఫ్యామిలీ యాంగిల్ జోడిస్తే సినిమా సూపర్ హిట్. ఈ విషయాన్ని బొమ్మరిల్లు మరోసారి రుజువు చేసింది. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే  రోజున విడుదలైన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. అటు యూత్ తో  పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఈ సినిమాతో జెనీలియా జాతకమే కాదు.. ఆమె పేరు కూడా మారిపోయింది. అప్పటివరకు అందరికీ ఆమె జెనీలియా మాత్రమే. కానీ బొమ్మరిల్లు సంచలనం తర్వాత హ..హ..హాసినిగా మారిపోయింది జెనీలియా. ఇప్పటికీ ఈమె పేరు చెబితే హాసిని క్యారెక్టరే గుర్తుకొస్తుంది.

ఇక సిద్ధార్థ్ కెరీర్ లో కూడా ది బెస్ట్ మూవీ బొమ్మరిల్లే. సినిమా విడుదలై పదేళ్లయినా తెలుగులో ఇప్పటికీ సిద్ధూకు ఇదే అతిపెద్ద విజయం. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయాడంటే… అతడికి ఈ సినిమా ఏ రేంజ్ లో కలిసొచ్చిందో అర్థంచేసుకోవచ్చు. వీళ్లే కాకుండా… రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కెరీర్ లో కూడా బొమ్మరిల్లు సినిమా ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి.

బొమ్మరిల్లు సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రీమేక్ అయిన ప్రతిభాషలోనూ ఈ సినిమా హిట్ అయింది. తమిళ్ లో సంతోష్ సుబ్రమణ్యమ్, బెంగాల్ లో భాలోభాసా భోలోభాసా, హిందీలో ఇట్స్ మై లైఫ్, ఒరియాలో డ్రీమ్ గాళ్ పేరిట విడుదలైన ఈ సినిమా… అన్ని భాషల్లో హిట్ అవ్వడం విశేషం. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ ఇప్పటికీ పాపులరే. వీలైతే నాలుగు మాటలు…కుదిరితే కప్పు కాఫీ, ఇప్పటికీ నా జీవితం మీ చేతిలోనే ఉంది నాన్నా… మొత్తం మీరే చేశారు లాంటి డైలాగులు సూపర్ హిట్టయ్యాయి. ఈ డైలాగ్స్ పై వచ్చినన్ని పేరడీలో తెలుగులో మరే డైలాగ్ పై రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.