'యుద్ధం శరణం' రివ్యూ

Friday,September 08,2017 - 03:38 by Z_CLU

నటీనటులు : నాగ చైతన్య , లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేష్, రేవతి, వినోద్ కుమార్, ప్రియదర్శి తదితరులు

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

కథ: డేవిడ్ ఆర్.నాథన్

మాటలు: అబ్బూరి రవి

స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ – అబ్బూరి రవి

నిర్మాణం: వారాహి చాలనచిత్రం

నిర్మాత: రజని కొర్రపాటి

దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్ తర్వాత అక్కినేని నాగచైతన్య తొలి సారిగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడనగానే ‘యుద్ధం శరణం’ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. చైతూ స్నేహితుడు కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ తో చైతూ ఏ మేరకూ థ్రిల్ చేశాడో చూద్దాం..

కథ :
తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ, వాళ్లే ప్రపంచంగా జీవించే అర్జున్(నాగ చైతన్య) ఓ సంఘటన వల్ల తన తల్లి సీత(రేవతి), తండ్రి మురళి (రావు రమేష్) చనిపోయారని తెలుసుకొని తన కుటుంబాన్ని చెల్లాచెదురు చేసిన నాయక్(శ్రీకాంత్) కు తెగింపుతో ఎదురెళ్తాడు. అసలు నాయక్ ఎవరు..? నాయక్ అర్జున్ కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు. చివరికి సాధారణమైన జీవితాన్ని గడిపే కుర్రాడిగా అర్జున్ నాయక్ ను ఎలా దెబ్బతీసి అంతమొందించాడు..? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

ఇప్పటివరకూ లవర్ బాయ్ గా మెస్మరైజ్ చేసి కొన్ని సినిమాలతో యాక్షన్ హీరోగా కూడా ఎంటర్టైన్ చేసిన నాగచైతన్య ఫస్ట్ టైం చేసిన యాక్షన్ థ్రిల్లర్ తో నటుడిగా ఆకట్టుకున్నాడు. తన పెర్ఫార్మెన్స్ తో అర్జున్ అనే క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. థ్రిల్లర్ జానర్ లో కథలు రాసుకునే దర్శకులు ఇకపై నాగచైతన్యను కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు.

లావణ్య త్రిపాఠి గ్లామరస్ రోల్ తో పరవాలేదనిపించుకుంది. కెరీర్ ఆరంభంలో సైడ్ విలన్ గా కనిపించి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ మెయిన్ విలన్ గా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. రావు రమేష్, రేవతి, వినోద్ కుమార్, మురళి శర్మ, ప్రియదర్శి తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :
సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. తన కెమెరా వర్క్ తో సినిమాకు కాస్త కలర్ అద్ది హైలైట్ గా నిలిచాడు నికేత్ బొమ్మి. ముఖ్యంగా అరకు లొకేషన్స్ ను తన కెమెరాతో మరింత అందంగా చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ రొటీన్ కి భిన్నంగా ఉంది. ‘నీ వలనే’, ‘ఎన్నో ఎన్నో భావాలే’ పాటలు బాగున్నాయి. డేవిడ్ ఆర్.నాథన్ అందించిన స్టోరీ రొటీన్ గా ఉంది. అబ్బూరి రవి అందించిన మాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. డేవిడ్ ఆర్.నాథన్ – అబ్బూరి రవి అందించిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :
ఒక్కో సినిమాకు ఒక్కో వేరియేషన్ కనిపించాలనే ఉద్దేశ్యంతో ఒక్కో జోనర్ టచ్ చేస్తూ నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి ఫామిలీ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఓ యాక్షన్ థ్రిల్లర్ ను సెలెక్ట్ చేసుకోవడం అభినందించాల్సిన విషయమే..అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాకు ఓ రొటీన్ రివేంజ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం చైతూ చేసిన మిస్టేక్.. సినిమా
ప్రారంభంలో ఫామిలీ లో జరిగే అనుబంధాలు , ఆనందాలు , ఆప్యాయతలతో సినిమాను ముందుకు నడిపించిన దర్శకుడు ఆ తర్వాత కథను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయిలో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించే విషయంలో తడబడ్డాడు.
నాగ చైతన్య పెర్ఫార్మెన్స్, చైతూ- లావణ్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ , రెండు పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్ , సినిమాకు హైలైట్స్ కాగా, రొటీన్ అనిపించే స్టోరీ , స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో వచ్చే బోరింగ్ సీన్స్, స్లో నేరేషన్ సినిమాకు మైనస్.
ఫైనల్ గా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.

రేటింగ్2.75/5