'యాత్ర' మూవీ రివ్యూ

Friday,February 08,2019 - 01:58 by Z_CLU

నటీ నటులు : మమ్ముట్టి, రావ్ రమేష్, ఆశ్రిత జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్ తదితరులు

సినిమాటోగ్రాఫర్ : సత్యన్ సూర్యన్

మ్యూజిక్ : కె ( క్రిష్ణ కుమార్ )

సమర్పణ : శివ మేక

నిర్మాణం :  70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

రచన -దర్శకత్వం : మహి వి రాఘవ్

నిడివి : 126 నిమిషాలు

విడుదల తేది : 8 ఫిబ్రవరి 2019

 

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది.. ఇదే కరెక్ట్ టైం అని భావించి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాద యాత్ర ఎలిమెంట్స్ తో ‘యాత్ర’ అనే సినిమాను తెరకెక్కించాడు మహి వి రాఘవ్… అస‌లు ఈ చిత్రం ఇప్ప‌డు తీయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమిటి.. రెండు సినిమాల అనుభవం ఉన్న మహి ఈ సినిమాను ఎలా డీల్ చేసాడు…ఇంతకీ యాత్రలో వై ఎస్ ఆర్ గురించి ఎంత వరకూ చూపించారు… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేవెళ్ళ నుండి మొదలుపెట్టి దాదాపు 1400 కిలోమీటర్లు వరకూ చేసిన ప్రజా ప్రస్తాన పాదయాత్ర ఎలెమెంట్స్ తో బయోపిక్ గా తెరకెక్కింది యాత్ర. ప్రతిపక్ష నేతగా ఉంటూ ఎలక్షన్స్ ముందు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టీ) కి పాదయాత్ర ఆలోచన ఎలా వచ్చింది.. యాత్ర మొదలు పెట్టే ముందు అధిష్టానం నుండి ఆయన కి ఎదురైన అనుభవలేంటి..? ఆ సమయంలో ఆయన వెంట ఉంటూ సపోర్ట్ చేసిన వ్యక్తులెవరు… యాత్ర చేస్తున్నప్పుడు పేదల కష్టాలు తెలుసుకొని ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు… యాత్ర మొదలు పెట్టాక రాజశేఖర్ రెడ్డిలో ఎలాంటి మార్పు వచ్చింది ..? 2004  ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయంలో వై.ఎస్.ఆర్ చేసిన యాత్ర ఎలాంటి పాత్ర పోషించింది..? చివరికి తండ్రి రాజారెడ్డి(జగపతి బాబు) ఆశయాన్ని ఒక నాయకుడిగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎలా నెరవేర్చారు అనే అంశాలతో ‘యాత్ర’ ను తెరకెక్కించారు.

నటీ నటుల పనితీరు :

ఏ బయోపిక్ సినిమాకైనా ముందుగా ఆ వ్యక్తిని గుర్తుచేసే నటులు దొరకాలి… అప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. సరిగ్గా ఇక్కడే మమ్ముట్టీ రూపంలో యాత్ర కి వంద మార్కులు పడ్డాయి. సినిమా ఆరంభం నుండి చివరి వరకూ ఎక్కడా మమ్ముట్టి కనబడడు. సినిమా అంతా రాజశేఖర్ రెడ్డిలానే కనిపించాడు. అంతలా పాత్రలో ఒదిగిపోయాడు మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి. వై.ఎస్.రాజా రెడ్డి గా జగపతి బాబు.. వై.ఎస్.తండ్రిని తలపిస్తూ బాగా నటించాడు. కె.వి.పి పాత్రలో రావు రమేష్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. అనసూయ కేవలం రెండు సన్నివేశాలకే పరిమితమైన ఆ సన్నివేశాల్లో బాగా నటించింది.ఇక విజయమ్మ పాత్రలో అశ్రిత, సబిత ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, పార్టీ ఇంచార్జ్ గా సచిన్ ఖేడేకర్, వై.ఎస్.వెంటే ఉండే మనిషిగా దిల్ రమేష్ , రైతుగా చంద్ర శేఖర్, కూతురిని కాపాడుకునే అమ్మ పాత్రలో కళ్యాణి ఇలా ప్రతీ ఒక్కరు వారి పాత్రలో ఇమిడిపోయి నటించారు…అలాగే సినిమా ఆరంభంలో అనసూయ ని ఇంటికి సాగనంపే సన్నివేశంలో మహేష్ ఆచంట బాగా చేసాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు

సినిమాకు టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. చాలా సన్నివేశాల్లో అతని కెమెరా పనితనం చూపించారు. కె ( క్రిష్ణ కుమార్ ) అందించిన మ్యూజిక్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు. ముఖ్యంగా సినిమాలో హైలైట్ గా నిలిచిన హాస్పిటల్ సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. “మంది తో పాటుగా ముందుకే సాగనా” , “పల్లెల్లో కల ఉంది”,మరుగైనావ రాజన్న” పాటలు ఆకట్టుకున్నాయి. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పెంచాల్ దాస్ గానం బాగుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అందరినీ ఆకట్టుకున్నాయి.రామకృష్ణ, మోనిక సబ్బాని ఆర్ట్ వర్క్ బాగుంది. యాత్ర వాతావరణాన్ని బాగా క్రియేట్ చేసారు. శ్రీకర్ ప్రసాద్ సినిమాను పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసారు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా ” పార్టీకి విధేయుడ్ని కానీ.. బానిసను కాదు”, నమ్ముకున్న మనుషులకంటే పదవులేమి ఎక్కువ కాదని చెప్పు”,’ రైతుల కష్టం ముందు మనదెంత” ,”మాటిచ్చాను.. మాటిచ్చాక ఎంత కష్టమైన ముందు కెళ్ళాల్సిందే” లాంటి డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే మహి వీ రాఘవ్ బయోపిక్ ను బాగా డీల్ చేసాడు. 70 ఎం ఎం ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

యాత్ర అనే టైటిల్ తో వై.ఎస్.ఆర్ బయోపిక్ తెరకెక్కుతుందనగానే గట్టి చర్చే జరిగింది.. ఉన్నపళంగా ఇప్పుడీ సినిమా ఎందుకు తీస్తున్నారు.. ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక అదంతా పక్కన పెడితే వై.ఎస్.ఆర్ పథకాల మూలంగా లాభ పడ్డ జనాలు మాత్రం ఈ బయోపిక్ కోసం ఎదురుచూశారు.

సినిమా ఆరంభంలో వచ్చే టైటిల్స్ లోనే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాల్యం , చదువు, రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు ఫోటోల ద్వారా చూపించిన దర్శకుడు ఆయన ఎం.ఎల్.ఎ గా ఉన్నప్పటి నుండి సినిమాను స్టార్ట్ చేసాడు.. అసలు పాద యాత్ర ఎలా మొదలైంది.. ఆ ఆలోచన వై.ఎస్ కి ఎలా వచ్చింది.. అధిస్థానాన్ని దిక్కరించి ఆయన చేసిన పాద యాత్ర పార్టీ ని ఎలా గెలిపించింది అనే అంశాలను మాత్రమే తీసుకొని అక్కడక్కడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు మహి.

చేసింది రెండే సినిమాలే అయినా సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లను బాగా డైరెక్ట్ చేసాడు. సినిమా ఆరంభంలో వచ్చే సన్నివేశాలు , యాత్ర మొదలు పెట్టేముందు అధిష్టానం నుండి ఎదురైన అనుభవాలు తాలుకు సన్నివేశాలు , యాత్ర మొదలు పెట్టాక జనాల కష్టాలు స్వయంగా తెలుసుకొనే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. ఇవన్నీ ఒకేతైతే యాత్ర చేస్తూ వడ దెబ్బ తిన్న సందర్భంలో హాస్పిటల్ లో చేరి అక్కడ జనాల బాధను అర్థం చేసుకొని ఆరోగ్య శ్రీ పథకం పెట్టాలనే ఆలోచనతో కూడిన సన్నివేశం సినిమాకు మరింత బలంగా నిలిచింది. ఆ సన్నివేశం కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సన్నివేశాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

వై.ఎస్ పాదయాత్ర అనంతరం పార్టీ అధికారంలోకి రావడం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకూ చూపించి ఆ తర్వాత వై.ఎస్.కి మరణం తాలుకు ఒరిజినల్ క్లిప్స్ చూపించి ఎమోషనల్ క్లైమాక్స్ తో ఎండ్ ఇచ్చాడు దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో తీసిన కొన్ని వీడియో క్లిప్స్ ను సరిగ్గా వాడుకున్నారు.

ఇక ఒక్క సన్నివేశంలో కూడా మమ్ముట్టీ నటుడిగా కనిపించలేదు. సినిమా అంతా వై.ఎస్.ఆర్ గా కనిపిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా వై.ఎస్. క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి నటుడిగా హేట్సాఫ్ అనిపించుకున్నాడు. ఎం.ఎల్ఎ గా ఉంటూ పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి తీసుకురావాలని వై.ఎస్.ఎస్ చేసిన మంచి కార్యక్రమాలు, ప్రవేశ పెట్టిన పథకాలను యాత్రలో భాగంగా చూపిస్తూ తన డైరెక్షన్ మేజిక్ చేసాడు మహి. ఒక నాయకుడు ప్రజల మనిషిగా ఎదిగిన తీరుని రెండు గంటల్లో చూపించడం కాస్త కష్టమే.. కానీ మహి ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఓవర్ ఆల్ గా వై.ఎస్.ఆర్ జర్నీ తో తెరకెక్కిన యాత్ర ఆకట్టుకుంటుంది.

బాటమ్ లైన్ : వై.ఎస్.ఆర్ ఎమోషనల్ జర్నీ

 

రేటింగ్ : 3.25/5