'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ రివ్యూ

Friday,February 14,2020 - 01:49 by Z_CLU

న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజబెల్లి, శత్రు, అనీల్ త‌దిత‌రులు

సంగీతం: గోపీసుంద‌ర్‌

కెమెరా: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి

ఆర్ట్‌: సాహి సురేశ్‌

స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావు

నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌

రచన – ద‌ర్శ‌క‌త్వం : క్రాంతి మాధ‌వ్‌

సెన్సార్ : U/A

నిడివి : 155 నిమిషాలు

విడుదల తేది : 14 ఫిబ్రవరి 2020

 

వరల్డ్ ఫేమస్ లవర్‘ లో విజయ్ దేవరకొండ ఎన్ని పాత్రల్లో నటించాడు ?… అసలు నాలుగు ప్రేమకథలు ఒకే వ్యక్తికి సంబందించినవేనా..? లేదా వేర్వేరు ప్రేమకథలా ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేసింది. భారీ అంచనాల నడుమ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈప్రేమకథలతో విజయ్ మరో హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

గౌతం(విజయ్ దేవరకొండ) యామిని(రాశి ఖన్నా) ఇద్దరూ కాలేజ్ డేస్ లో ప్రేమించుకుంటారు. పరిచయమైన కొన్ని నెలలకే పెళ్లి చేసుకోసుకొని దంపతులుగా మారతారు. పెళ్ళయ్యాక చేస్తున్న ఉద్యోగం మానేసి రైటర్ గా మారాలనుకుంటాడు గౌతం. కానీ దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా బద్దకస్తుడిగా మారడంతో తమ రిలేషన్ షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి గౌతం నుండి విడిపోతుంది యామిని.

తను ఎంతగానో ప్రేమించిన యామిని తనను వదిలేసి వెళ్ళిపోవడంతో రచయితగా మారి తన భాదల నుండి పుట్టిన ప్రేమకథలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు గౌతం. పుస్తకం చివర్లో ఉండగా ఊహించని గొడవతో రెండేళ్ళు జైలుకి వెళ్తాడు. జైలు నుండి తిరిగొచ్చాక గౌతం -యామిని లు మళ్ళీ ఒకటయ్యారా లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

‘అర్జున్ రెడ్డి’ లో చేసిన ఇంటెన్స్ క్యారెక్టర్ కావడంతో గౌతం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు విజయ్. గౌతం క్యారెక్టర్ రొటీన్ అనిపించినా సినిమాలో మరో క్యారెక్టర్ సింగరేణి కార్మికుడు సీనయ్య మాత్రం ఫ్రెష్ గా అనిపించింది. ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేశాడు. తెలంగాణా యాసతో డిఫరెంట్ మేనరిజమ్స్ తో ఆ క్యారెక్టర్ కి అందం తీసుకొచ్చాడు. రాశీ ఖన్నా రోల్ గతంలో చూసినట్టే అనిపిస్తుంది. అందువల్ల ఆమె పాత్రలో కానీ నటనతో కొత్తదనం కనిపించలేదు. సువర్ణ పాత్రకు ఐశ్వర్య రాజేష్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు అందుకున్న ఐశ్వర్య రాజేష్ కు ఈ సినిమా రూపంలో మరో మంచి పాత్ర దొరికింది.

ఇజబెల్లి తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్ తో కూడా మెప్పించింది. కేథరిన్ తనకు ఇచ్చిన పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసిని. కానీ ఆమె సన్నివేశాలు తక్కువే ఉండటంతో ఆ పాత్రతో హైలైట్ అవ్వలేకపోయింది. మాజీ యూనియన్ లీడర్ పాత్రలో శత్రు బాగానే నటించాడు. అనిల్ తన డైలాగ్ కామెడీతో నవ్వించి నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు.ఈ రోల్ కమెడియన్ గా అతనికి మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టే చాన్స్ ఉంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరీ కయినా అదిరిపోయే సాంగ్స్ పడాల్సిందే. అవి రిలీజ్ కి ముందే జనాలు పాడుకుంటే సినిమాకు ప్లస్ అవుతాయి. ఎందుకో వరల్డ్ ఫేమస్ లవర్ కి అలాంటి అదిరిపోయే సాంగ్స్ పడలేదనే చెప్పాలి. ‘బొగ్గు గనిలో’ మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బొగ్గు గనిలో పాటకు రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా బాగా కుదిరింది. కొన్ని సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగుంది. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ప్రతీ షాట్ లో అతని పనితనం కనిపించింది. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఇంకాస్త స్పీడ్ చేసి ట్రిమ్ చేస్తే బాగుండేది.

క్రాంతి మాధవ్ రాసుకున్న ప్రేమకథలో వచ్చిన ప్రేమకథలు బాగున్నాయి. వాటికి స్క్రీన్ ప్లే కూడా చక్కగా కుదిరింది. డైరెక్షన్ బాగుంది. ఆర్టిస్టుల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడు. క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఏ లవ్ స్టోరీ అయినా బోర్ కొట్టకుండా షార్ట్ గా చెప్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. మధ్యలో ఏ మాత్రం బోర్ కొట్టినా డిస్కనెక్ట్ అయిపోతారు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అదే జరిగింది. హీరో పుస్తకం కోసం రాసుకున్న ప్రేమకథలతో మెప్పించిన దర్శకుడు అసలు ప్రేమకథను రొటీన్ ఫార్మాట్ లో చూపించి బోర్ కొట్టించాడు. అందువల్ల ఇల్లందులో వచ్చే సీనయ్య-సువర్ణ ప్రేమకథతో పాటు పారిస్ లో వచ్చే గౌతమ్, ఇజ ప్రేమకథలకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడు అసలు ప్రేమకథకి వచ్చేసరికి డిస్కనెక్ట్ అవుతాడు. పైగా ఆ ట్రాక్ అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుచేసేలా ఉండటంతో అసలు కథ తేడా కొట్టింది.

విజయ్ లో మంచి నటుడున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బోర్ కొట్టించే చాలా సన్నివేశాల్లో కూడా ప్రేక్షకుడికి తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా సీనయ్య క్యారెక్టర్ తో మేజిక్ చేసాడు. ఆ మేజిక్ కి ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ లవ్ ట్రాక్ ప్రేక్షకులకు ఓ కొత్త కథ చూసిన ఫీలింగ్ కలిగించింది. ఆ ట్రాక్ అయిపోయాక మళ్ళీ గౌతం-యామిని కథలోకి ప్రేక్షకుడిని తీసుకొచ్చి మెప్పించడానికి దర్శకుడు చాలానే కష్టపడ్డాడు. సినిమాలో హీరో ఓ గొప్ప రైటర్ అవ్వాలనుకుంటాడు. అందుకోసం తను ఎప్పటి నుండో తప్పక చేస్తున్న ఉద్యోగం మానేస్తాడు. కానీ తను రైటర్ ఎందుకు అవ్వాలనుకుంటాడు అనే పాయింట్ ను ప్రాపర్ గా చూపించలేకపోయాడు డైరెక్టర్. అక్కడ క్రాంతిమాధవ్ ఫెయిల్ అయ్యాడు. కేవలం నంబర్స్ అర్థం కానీ వారి కోసం పదాలతో చెప్తూ ఉన్న కంటెంట్ నే తను మళ్ళీ రాసి ఓ పుస్తకం వేయడం అనేది కూడా సిల్లీగా ఉంది. ఇక తన ప్రేమకథతో పాటు మరో రెండు ప్రేమకథలు పుస్తకంగా రాయడం అనేది బాగుంది కానీ చివరి పేజీ రాయకుండా అది పాపులర్ బుక్ అవ్వడం ఆ బుక్ తో గౌతమ్ స్టార్ రైటర్ అయ్యాడని చూపించడం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ప్రేమకథను తెరకెక్కించి తన టాలెంట్ ను స్క్రీన్ పై చూపించి మేజిక్ చేసిన క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ తో మళ్ళీ ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయాడు. అసలు ప్రేమకథలో ఎఫెక్టివ్ గా లేకపోవడం సినిమా లవర్స్ ను వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. ఫైనల్ గా విజయ్ కోసం, ఇల్లందు ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5