'విజిల్' మూవీ రివ్యూ

Friday,October 25,2019 - 02:26 by Z_CLU

నటీ నటులు : విజయ్ , నాయన తార, వివేక్ , జాకీ షరాఫ్, ఆనంద్ రాజ్, యోగిబాబు తదితరులు

సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్

ఛాయాగ్రహణం : జీ.కే.విష్ణు

నిర్మాణం : ఏ.జీ.ఎస్. ఎంటర్టైన్ మెంట్స్

రిలీజ్ : మహేష్ కోనేరు (ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్)

రచన -దర్శకత్వం : అట్లి

సెన్సార్ : U/A

నిడివి : 178 నిమిషాలు

విడుదల : 25 అక్టోబర్ 2019

‘అదిరింది’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు ‘విజిల్’ అనే సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. మరి అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ మరోసారి తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

ప్రజలకి ఏదైనా సమస్య వస్తే వారికి అండగా నిలబడి రౌడీలకు సైతం ఎదురెళ్ళే రాజప్ప( విజయ్) మరణం తర్వాత ఆ స్థానంలో నిలబడి ప్రజలతోనే ఉంటాడు రాజప్ప తనయుడు మైకెల్ (విజయ్). అయితే అనుకోకుండా మైకెల్ పై జరిగిన ఎటాక్ లో అతని స్నేహితుడు ఫుట్ బాల్ కోచ్ కిరణ్ దారుణంగా గాయపడతాడు.

తమ కోచ్ ను నమ్ముకొని నేషనల్స్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యేందుకు వచ్చిన మహిళా టీం కిరణ్ గాయపడటంతో డీలా పడుతుంది. ఆ సందర్భంలో డిల్లీలో జరిగే ఫైనల్స్ లో తన టీం కచ్చితంగా ఆడాలని అందుకు బిగిల్ ను కోచ్ గా ఒప్పించాలని ఫుట్ బాల్ అధికారిని కోరతాడు కిరణ్. ఇక కిరణ్ చెప్పిన బిగిల్ అలియాస్ మైకెల్ తన మిత్రుడి కోసం మళ్ళీ ఫుట్ బాల్ పట్టి మహిళా టీంకు కోచ్ గా మారి ఫైనల్స్ లో ముందుండి నడిపిస్తాడు. ఇక గతంలో జరిగిన గొడవ కారణంగా బిగిల్ అండ్ టీంను ఫైనల్స్ కి వెళ్ళకుండా అడ్డు తగులుతాడు జేకె శర్మ. చివరికి బిగిల్ సపోర్ట్ తో కిరణ్ టీం కప్ గెలిచారా..లేదా అనేది విజిల్ కథాంశం.

నటీ నటుల పనితీరు :

హీరో విజయ్ రాజప్ప , మైకెల్ అనే రెండు పాత్రలతో నటుడిగా మెప్పించాడు. ముఖ్యంగా రాజప్ప గా మంచి నటన కనబరిచాడు. ఫుట్ బాల్ కోచ్ గా కూడా ఆకట్టుకున్నాడు. నయనతార తన నటనతో ఎట్రాక్ట్ చేసింది. మొదటి భాగంలో పెద్దగా స్కోప్ లేకపోయినా రెండో భాగంలో తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్సయింది. ఇక జాకీ షరాఫ్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. అర్జన్ బజ్వా కూడా తన పాత్రకు న్యాయం చేసాడు.

ఫుట్ బాల్ ప్లేయర్స్ గా వర్ష బొల్లమ్మ , ఇందుజ , మీనన్ , రేబ మౌనిక ,అమ్రిత అయ్యర్,ఇంద్రజ , గాయత్రీ రెడ్డి బాగా నటించి మంచి మార్కులు అందుకున్నారు. కమెడియన్ వివేక్ కామెడీ పండలేదు. కామెడీకి స్కోప్ లేకపోవడంతో యోగిబాబు జస్ట్ పరవాలేదనిపించాడు. తన విలనిజంతో విలన్ గా డేనియల్ బాలాజీ ఆకట్టుకున్నాడు.

 

సాంకేతికవర్గం పనితీరు :

ఏ సినిమాకైనా సన్నివేశాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం కీలకం. అలాంటి అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించి సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు రెహ్మాన్. అక్కడక్కడా ‘అదిరింది’ సినిమాకు అందించిన మ్యూజిక్ రిపీట్ అయిందనిపించినా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. రెండో భాగంలో వచ్చే సివంగి అంటూ వచ్చే పాట మినహా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రెహ్మాన్ తర్వాత మాట్లాడుకోవాల్సిన మరో టెక్నీషియన్ జి.కె.విష్ణు. తన సినిమాటోగ్రఫీతో సినిమాను మరింత గొప్పగా చూపించాడు. ఎడిటింగ్ సినిమాకు మైనస్. కొన్ని అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది.

యాక్షన్స్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను అలరించేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో వచ్చే డబ్బింగ్ డైలాగ్స్ సన్నివేశాలకు సింక్ లేకుండా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ పడలేదు. అట్లీ మరోసారి దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే సన్నివేశాలను బాగా హ్యాండిల్ చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

విజయ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా విడుదలైనప్పటికీ అందులో ‘తుపాకీ’,అదిరింది’, ‘సర్కార్’ మాత్రమే అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడా లిస్టులో ‘విజిల్’ కూడా చేరింది. రొటీన్ కథే అయినా దర్శకుడు అట్లీ మాస్ ను ఆకట్టుకునే సన్నివేశాలు, స్పోర్ట్స్ సన్నివేశాలతో మోస్తరుగా మెప్పించాడు. మెడికల్ మాఫియా మీద ‘అదిరింది’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ ఈసారి ‘బిగిల్’ లో క్రీడల్లో జరిగే అక్రమాలను చూపించే ప్రయత్నం చేసాడు. కాకపోతే కొందరు దర్శకులు ఇప్పటికే ఆ పాయింట్ ను టచ్ చేయడంతో ‘విజిల్’ లో అది రొటీన్ అనిపిస్తుంది.

ఇక తమిళ్ లో విజయ్ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్. అందుకే అతను సినిమాలో చేయి కదిపినా, కాలు మెదిపినా ఆ సన్నివేశాలను తమిళ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ తెలుగులో విజయ్ నటించిన అలాంటి సన్నివేశాలు చూడాలంటే తెలుగు ప్రేక్షకులు ఓపిక కావాలి. హీరో ఇంట్రడక్షన్ సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకూ ఎక్కువగా విజయ్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసే సన్నివేశాలతోనే నడిపించాడు దర్శకుడు. అక్కడక్కడా మాస్ ను ఆకట్టుకునే ఫైట్స్ మొదటి భాగాన్ని కొంత వరకూ గట్టెక్కించాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విజయ్ , నయన లవ్ ట్రాక్ మరీ వీక్ గా ఉంది.

ఇక మొదటి భాగాన్ని ‘అదిరింది’ ,’కాలా’ తరహాలో మాస్ అంశాలతో తెరకెక్కించిన అట్లీ రెండో భాగాన్ని మాత్రం కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామాగా నడిపించాడు. రెండో భాగంలో వచ్చే స్పోర్ట్స్ సన్నివేశాలు, విజయ్ టీంకి కోచింగ్ ఇచ్చే సన్నివేశాలు గతంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలను గుర్తుచేసినప్పటికీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీంలో మిస్సయిన ఇద్దరు మహిళలను విజయ్ తిరిగి మళ్ళీ టీంలోకి చేర్చి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయి సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు బలం చేకూర్చాయి. ఆ సన్నివేశాలకు రెహ్మాన్ నేపథ్య సంగీతంతో ప్రాణం పోసాడు. చాలా వరకూ బలం లేని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలాన్నిచ్చింది. ఓవరాల్ గా క్రీడా రంగంలో మహిళలు మరింత ముందుకెళ్ళాలని వారికి కుటుంబం కూడా సహకరించాలని కొంచెం మాస్ కంటెంట్ తో సందేశమిచ్చాడు అట్లీ. మరి ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ కలెక్షన్స్ సాదించి ఎలాంటి విజయం సాదిస్తుందొ చూడాలి.

రేటింగ్ : 2.75/5