Movie Review - 'రంగ రంగ వైభవంగా'

Friday,September 02,2022 - 03:06 by Z_CLU

నటీ నటులు : వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ ,  నవీన్ చంద్ర , సుబ్బరాజు, నరేష్ , ప్రభు, ప్రగతి , తులసి  తదితరులు

కెమెరా : శ్యాం దత్

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

ఆర్ట్ : అవినాష్ కొల్లా

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

నిర్మాత : BVSN ప్రసాద్

రచన -దర్శకత్వం : గిరీశాయ

నిడివి : 143 నిమిషాలు

విడుదల తేది : 2 సెప్టెంబర్ 2022

 

వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

వైజాగ్ లో పక్క పక్క ఇంట్లో ఉండే రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) ఒకే రోజు పుడతారు. వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది. స్కూల్ డేస్ లో చిన్న గొడవ కారణంగా రిషి , రాధా మధ్య మాటలు ఉండవు. వీరిద్దరి మధ్య చిన్న తనం నుండి ఇగో క్లాష్ ఉంటుంది. కాలేజ్ డేస్ వరకూ అది కొనసాగుతుంది.

ఒకే కాలేజీలో Mbbs చదువుతూ ఒకరికితో ఒకరు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా లోలోపల ప్రేమించుకునే రిషి , రాధా లు ఓ సందర్భంలో ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని తెలుసుకొని ప్రేమలో పడతారు. అదే సమయంలో ఓ సంఘటన వల్ల వీళ్ళ రెండు కుటుంబాలు విడిపోతాయి. మరి రిషి , రాధా తమ కుటుంబాలను మళ్ళీ ఎలా కలిపారు ? చివరికి ఇద్దరూ తమ విషయాన్ని వారి కుటుంబాలకు చెప్పి ఎలా పెళ్లి వరకూ వెళ్లారనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

హీరోగా వైష్ణవ్ తేజ్ మెప్పించాడు. రిషి పాత్రలో ఆకట్టుకున్నాడు. కానీ వైష్ణవ్ నటుడిగా పరిణితి చెందాల్సి ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చే సన్నివేశాల్లో పూర్తిగా మెప్పించలేక దొరికిపోయాడు. కానీ లవ్ సీన్స్ లో కొన్ని సన్నివేశాల్లో బాగానే నటించాడు.  హీరోయిన్ కేతిక శర్మ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో మంచి మార్కులు అందుకుంది. అలాగే నవీన్ చంద్ర తో ఉండే ఓ సన్నివేశంలో బాగా నటించింది.

కథలో కీలక పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర తన కేరెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సుబ్బరాజు రెండు మూడు సన్నివేశాలకే పరిమితం అయ్యాడు. పేరెంట్స్ కేరెక్టర్స్ లో నరేష్ -ప్రగతి , ప్రభు -తులసి మెప్పించారు. వారి అనుభవంతో ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలను ఆకట్టుకునేలా చేశారు. హీరో అన్నయ్య పాత్రలో నటించిన యాక్టర్ , హీరోయిన్ అక్క పాత్రలో కనిపించిన యాక్ట్రెస్ బాగా నటించారు.

కమెడియన్ సత్య కామెడీ ట్రాక్ పండలేదు. రఘు బాబు -ఝాన్సి కామెడీ సీన్ కూడా రొటీన్ గానే ఉంది. హీరో ఫ్రెండ్ పాత్రలో రాజ్ కుమార్ అలరించాడు. నాగబాబు , సూర్య , ఆలి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

లవ్ స్టోరీస్ కి మంచి మ్యూజిక్ పడటం చాలా ముఖ్యం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మంచి సాంగ్స్ తో పాటు సన్నివేశాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం ఇచ్చాడు. ముఖ్యంగా  “తెలుసా తెలుసా” , “సిరిసిరి మువ్వల్లోన” , “రంగ రంగ వైభవంగా” టైటిల్ సాంగ్ బాగున్నాయి. కొత్తగా లేదేంటి సాంగ్ విజువల్ గా బాగుంది. శ్రీమణి , రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. శ్యాం దత్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలు  విజువల్ గా ఎట్రాక్ట్ చేశాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బోర్ కొట్టకుండా చేసింది.

గిరీశాయ కథ రొటీన్ అనిపించినప్పటికీ కథనం ఆకట్టుకుంది. డైరెక్టర్ గా లవ్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

జీ సినిమాలు సమీక్ష :

రెండు కుటుంబాలు పక్క పక్కనే కలిసి మెలిసి ఉండటం , వారి కుటుంబాల్లో చిన్నప్పటి నుండి ఒకబ్బాయి ఒకమ్మాయి స్నేహంగా మెలగడం, ఒకరికొకరు చెప్పుకోకుండా లోలోపల ప్రేమించుకోవడం, చివరికి ఒకటవ్వడం ఈ పాయింట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘రంగరంగ వైభవంగా’ కోసం దర్శకుడు గిరిశాయ కూడా అదే పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే ట్రీట్ మెంట్ కొత్తగా ప్లాన్ చేసుకొని మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా రెండు కుటుంబాలు విడిపోవడానికి ఓ మంచి టర్న్ రాసుకున్నాడు. ఆ సాఫ్ట్ ట్విస్ట్ తో కథను టర్న్ చేసి మెప్పించాడు.

చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు రిషి -రాధల పెళ్లి వేడుకతో కథకి ముగింపు పలికాడు. చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లో “తెలుసా తెలుసా” అనే సాంగ్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. దేవి కంపోజ్ చేసిన ఆ సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ చూపించే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే లవ్ సీన్స్ కూడా యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. కాకపోతే  సెకండాఫ్ కొచ్చే సరికి దర్శకుడు కాస్త తడబడ్డాడు. సత్య పాత్రతో రొటీన్ కామెడీ గానే ఉంది కానీ మందు సీన్ నవ్విస్తుంది.  ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఫరవాలేదనిపిస్తాయి. సెకండాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తో పాటు ఓ పాపులర్ సీరియల్ ని ఇన్వాల్వ్ చేసి రాసుకున్న సన్నివేశం ఎంటర్టైన్ చేసింది.

ఏ ప్రేమకథకైనా హీరో -హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంటే లవ్ ట్రాక్ హిట్ అయినట్టే. ఈ సినిమాలో వైష్ణవ్ -కేతిక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. దాంతో స్క్రీన్ పై ఈ పెయిర్ ఎట్రాక్ట్ చేసి ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో  రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు కూడా మెప్పించాయి.  ఫ్యామిలీ డ్రామా , వైష్ణవ్ తేజ్ -కేతిక మధ్య వచ్చే  లవ్ సీన్స్ , దేవి సాంగ్స్ ,  కామెడీ కోసం ‘రంగ రంగ వైభవంగా’ ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5 /5