'ఉప్పెన' మూవీ రివ్యూ

Friday,February 12,2021 - 02:58 by Z_CLU

న‌టీన‌టులు : వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి, సాయి చంద్, జయకృష్ణ త‌దిత‌రులు

కెమెరా : శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌ : న‌వీన్ నూలి

ఆర్ట్‌ : మోనిక రామ‌కృష్ణ

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్

నిర్మాణం : మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సాన‌

నిడివి : 147 నిమిషాలు

విడుదల తేది : 12 ఫిబ్రవరి 2021

మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’ ఈరోజే ప్రేక్షకుల మునుకొచ్చింది. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. మరి డెబ్యూ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి విజయం అందుకున్నాడు ? ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన బుచ్చి బాబు ప్రేక్షకులను మెప్పించి అంచనాలను అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

సముద్ర తీరాన్న ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుండే బెబమ్మ(కృతి శెట్టి) మీద ఇష్టం పెంచుకున్న ఆశీర్వాదం(వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాదిస్తూ ప్రేమిస్తుంటాడు. బెబమ్మ కాలేజీ లో చేరే సరికి తన మనసులో ప్రేమను ఆమెకి చెప్తాడు. జాలరి కుర్రాడైనప్పటికీ ఆశీ స్వచ్చమైన ప్రేమకు బెబమ్మ ఫీదా అయి అతని ప్రేమలో పడుతుంది.

ఊరికి పెద్దగా ఉండే రాయనం(విజయ్ సేతుపతి) తన కూతురు బెబమ్మ ఓ జాలరి కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకొని చివరికి ఆశీని ఊహించని విధంగా హింసకు గురిచేస్తాడు. ఇంతకీ ఆశీ -బెబమ్మ ప్రేమకథలో ట్విస్ట్ ఏమిటి ? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు :

మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న హీరోలా నటించాడు. పల్లెటూరి కుర్రాడు ఆశీర్వాదం పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా కొన్ని లవ్ , ఎమోషనల్ సన్నివేశాల్లో ఉత్తమ నటన కనబరిచి మంచి మార్కులు అందుకున్నాడు. బెబమ్మ పాత్రతో కృతి శెట్టి సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ గా మెప్పించి యూత్ ని ఎట్రాక్ట్ చేసింది.

పవర్ ఫుల్ క్యారెక్టర్ రాయనం గా విజయ్ సేతుపతి తన విలనిజంతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. కొన్ని సన్నివేశాలకు తన సెటిల్డ్ నటనతో బలం చేకూర్చాడు. తండ్రి పాత్రలో సాయి చంద్ ఆకట్టుకున్నాడు. ఓ సన్నివేశంలో తన నటనతో విజయ్ సేతుపతిని కూడా డామినేట్ చేశాడు. తాళింపు పాత్రలో జయకృష్ణ బాగా నటించాడు. ఈ సినిమా తర్వాత ఆ అబ్బాయికి మరిన్ని మంచి పాత్రలొస్తాయి.  రామరాజు, ప్రియ, క్రాంతి మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ బిగ్ ఎస్సెట్. తన మ్యూజిక్ తో మేజిక్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పిన దేవి సాంగ్స్ తో అదరగొట్టాడు. ఆల్బంలోప్రతీ పాట వినసొంపుగా ఉండటంతో పాటు చూడ ముచ్చటగా అనిపించింది. అలాగే దేవి అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. శ్రీమణి , చంద్ర బోస్ సాహిత్యం పాటలకు ప్రాణం పోసింది. దేవి మ్యూజిక్ తర్వాత మస్ట్ గా చెప్పుకోవాల్సింది శ్యాం దత్ సినిమాటోగ్రఫీ గురించే. తన కెమెరా పనితనంతో సినిమాకు మంచి విజువల్స్ అందించాడు శ్యామ్.

నవీన్ నూలి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. మోనికా రామకృష్ణ ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను అలరించాయి. హీరో హీరోయిన్ కి ప్రసన్న దంతులూరి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ బాగున్నాయి.

బుచ్చి బాబు ఎంచుకున్న కథ రొటీనే అయినా స్క్రీన్ ప్లే -డైలాగ్స్ కథకి బలం చేకూర్చాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. నిర్మాతలు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రొడక్షన్ వాల్యూస్ రూపంలో సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది.

Uppena-emotional-song-on-the-way-dsp-chandrabose
జీ సినిమాలు సమీక్ష :

ఏ ప్రేమకథకైనా హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అలాగే వర్కౌట్ అయ్యే లవ్ స్సీన్స్ , స్ట్రాంగ్ విలన్ ముఖ్యం. వీటితో పాటు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ‘ఉప్పెన’ లో ఇవన్నీ ఉండేలా చూసుకున్నాడు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్ , కృతి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. మొదటి భాగంలో వచ్చే ప్రేమ ట్రాక్ , సన్నివేశాలు బాగున్నాయి. విజయ్ సేతుపతి విలనిజం కథకి బలాన్నిచ్చింది. సినిమాలో ఉన్న మెయిన్ ఎమోషన్ క్యారీ అయ్యింది. కాకపోతే అక్కడక్కడా బోర్ కొట్టించింది. నిజానికి ఇలాంటి పాయింట్ తో రసవత్తరంగా సాగే ప్రేమకథను తెరకెక్కించడం కత్తి మీద సాములాంటి వ్యవహారం. దానికి చాలా అనుభవం కావాలి. దర్శకుడు బుచ్చిబాబుకి ఇదే తొలి సినిమా కావడంతో మొదట భాగాన్ని లవ్ స్టోరీతో బాగానే నడిపించాడు కానీ రెండో భాగంలో అక్కడక్కడా  తడబడ్డాడు. అందువల్ల సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళయినప్పటికీ వారి నుండి మంచి నటన రాబట్టాడు దర్శకుడు. క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే విజయ్ సేతుపతి , సాయి చంద్ వంటి గొప్ప నటులను తీసుకోవడం సినిమాకి కలిసొచ్చింది. విజయ్ సేతుపతి రెండో భాగాన్ని కొంత వరకు తన నటనతో నిలబెట్టాడు. కాకపోతే విజయ్ సేతుపతికి రవిశంకర్ డబ్బింగ్ మొదట్లో కొంచెం ఎబెట్టుగా అనిపించినప్పటికీ పోను పోను అలవాటైపోయింది. అలాగే క్లైమాక్స్ లో కృతి మంచి నటి అనిపించుకుంది. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా మంచి మార్కులే అందుకున్నాడు.

కథ పరంగా ‘ఉప్పెన’ చాలా ప్రేమకథలను గుర్తుచేస్తుంది. మన తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమాలు కూడా అక్కడక్కడా గుర్తొస్తాయి. కాకపోతే కథనం మాత్రం  కొత్తగా అనిపిస్తుంది. ప్రేమకథ జరిగే నేపథ్యం , కథలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ కొత్తగా అనిపిస్తాయి. కాకపోతే ఆ మెయిన్ ఎలిమెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే లీక్ అవ్వడం వల్ల అది అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అది తెలియకుండా ఉంటే ఎమోషన్ ఇంకా బాగా పండి ఉండేది. తన కూతురు ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన సంగతి ఊరి జనాలకి తెలియకుండా తన పరువు కాపాడుకుంటూ బెబమ్మ ఇంట్లోనే ఉందంటూ చెప్పే రాయనం సన్నివేశంతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత కొన్ని నెలల క్రితం అంటూ హీరో , హీరోయిన్ ఎంట్రీ వారిద్దరి మధ్య ప్రేమకథను ఎలివేట్ చేస్తూ వచ్చే సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆల్బంలో క్లిక్ అయిన నాలుగు పాటలు మొదటి భాగంలోనే పెట్టేసి ఫస్ట్ హాఫ్ కి మరింత బలం చేకూర్చాడు. కాకపోతే రెండో భాగంలో వచ్చే సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి కొత్తగా ట్రీట్ మెంట్ ఇచ్చి కథను మరింత వేగంగా నడిపించి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలు , ‘ఈశ్వరా – పరమేశ్వరా’ పాట , ఎమోషనల్ డైలాగ్స్ తో రెండో భాగాన్ని  గట్టెక్కించాడు బుచ్చి బాబు.

సినిమాలో ఉన్న మెయిన్ సోల్ ని గీతా భాస్కర్ , విజయ్ సేతుపతి క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ ద్వారా ముందే చెప్పేశాడు బుచ్చిబాబు. ఆ రెండు డైలాగులు మళ్ళీ క్లైమాక్స్ లో రిపీట్ చేస్తూ ఈ కథ ద్వారా తను చెప్పాలనుకున్నది ఎక్కడ అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్  నిజాయితిగా చెప్పాడు. చివరిలో శివుడి విగ్రహం ముందు ఓ వృద్దుడు చెప్పే డైలాగ్ , ఎండింగ్ టైటిల్స్ లో సుకుమార్ వాయిస్ ఓవర్ ద్వారా దాన్ని ఇంకాస్త పొయెటిక్ గా కన్వే చేశారు. ఫైనల్ గా భారీ అంచనాలతో థియేటర్స్ కొచ్చిన ప్రేక్షకులను ఈ ప్రేమకథ నిరాశ పరచదు.

రేటింగ్ : 3 /5