'ఉంగరాల రాంబాబు' రివ్యూ

Friday,September 15,2017 - 04:00 by Z_CLU

నటీనటులు : సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ : జిబ్రాన్

నిర్మాణం : యునైటెడ్ మూవీస్ లిమిటెడ్

నిర్మాత : పరుచూరి కిరీటి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకుడు : క్రాంతి మాధవ్

రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 15 , 2017

సునీల్ అంటే కామెడీ ఎంటర్ టైనర్లకు పెట్టింది పేరు. దర్శకుడు క్రాంతి మాధవ్ అంటే ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడనే ఇమేజ్ ఉంది. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆ సినిమాలో కామెడీ ఉంటుందా.. క్రాంతి మాధవ్ స్టయిల్ లో సెన్సిబుల్ సందేశం ఉంటుందా. ఉంగరాల రాంబాబు మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ:

చిన్నప్పుడే అమ్మానాన్నలను చనిపోవడంతో తన తాత రామానుజం(విజయ్ కుమార్) దగ్గర పెరిగి పెద్దైన రాంబాబు(సునీల్) ఉన్నపళంగా తాత కూడా చనిపోవడంతో ఒంటరివాడిగా మిగిలిపోతాడు. తాత చనిపోయాక తన కంపెనీ నష్టాల్లో ఉందన్న సంగతి తెలుసుకున్న రాంబాబు.. ఆస్తి అమ్మి 200 కోట్లు నష్టపరిహారం చెల్లిస్తాడు.. అలా ఉన్న ఆస్తిను పోగొట్టుకున్న రాంబాబు బాదం బాబా (పోసాని కృష్ణ మురళి) అనే బోగస్ స్వామిజీని కలిసి ఆయన ద్వారా అనుకోకుండా రూ.200 కోట్లు పొందుతాడు. అప్పటి నుంచి రంగు రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటూ బిజినెస్ మేన్ గా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఆ క్రమంలో అనుకోకుండా పరిచయం అయి తన మేనేజర్ గా పనిచేసే సావిత్రి (మియా జార్జ్) ను బాదం బాబా చెప్పిన జాతకం వల్ల పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సావిత్రి కూడా రాంబాబు ను ప్రేమిస్తుండడంతో కేరళలో గ్రామ పెద్దగా ఉంటూ అభ్యుదయ భావాలు కలిగిన తండ్రి రంగ నాయర్ (ప్రకాష్ రాజ్) కు రాంబాబును పరిచయం చేస్తుంది. అయితే కమ్యూనిస్ట్ భావాలతో దేశాన్ని అమితంగా ప్రేమిస్తూ విదేశీ వస్తువులను ద్వేషించే రంగ నాయర్.. రాంబాబును తన అల్లుడిగా స్వీకరించాడా…అసలు ఆ గ్రామంలో రంగ నాయర్ ను తమ పెళ్ళికి ఒప్పించడానికి రాంబాబు ఏం చేశాడు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

‘ఉంగరాల రాంబాబు’ గా సునీల్ ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ కి తగ్గట్టుగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన మియా జార్జ్.. తన నటనతో పరవాలేదనిపించుకుంది. అభ్యుదయ భావాలున్న గ్రామ పెద్దగా ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నాడు. పోసాని, వెన్నెల కిశోర్ నవ్వించలేకపోయారు. ఇక విజయ్ కుమార్, మధు నందం, వేణు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్,విద్యు రామన్ తదితరులు తమ క్యారెక్టర్ న్యాయం చేసి పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

సినిమాకు జిబ్రాన్ అందించిన మ్యూజిక్ మైనస్. ‘అల్లరి పిల్లగాడా’ పాట పరవాలేదనిపించగా మిగతా పాటలేవి ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సందర్భాలలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. సునీల్ ఎంట్రీ సాంగ్ కి కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని కామెడీ పంచ్ డైలాగులు ఎంటర్టైన్ చేశాయి. స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

గతంలో ‘ఓనమాలు’,’మళ్ళీ మళ్ళీ ఇది రాని’ వంటి ఎమోషనల్ ఫీల్ గుడ్ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్.. ఉంగరాల రాంబాబు సినిమాతో నిరాశపరిచాడు. సెన్సిబుల్ మూవీస్ చేసేవాళ్లు కమర్షియల్ ఫార్మాట్ లో ఇమడలేరనే రెగ్యులర్ సెంటిమెంట్ ను మరోసారి నిజం చేశాడు క్రాంతిమాధవ్.
ప్రభుత్వం ఓ గ్రామంలో భూసేకరణ చేసి అక్కడ అభివృద్ధి చేయాలనునుకోవడం, అభ్యుదయ భావాలున్న గ్రామ పెద్ద అడ్డుపడడం, గ్రామాన్ని గ్రామంగా ఉంచాలని శాంతితో పోరాటం చేయడం అనే పాయింట్ బాగానే ఉన్నా ఈ పాయింట్ కు ఎక్స్ ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇందులో కామెడీ కూడా మిక్స్ చేయాలనుకోవడం దర్శకుడు చేసిన పెద్ద తప్పు. ఇక ఉంగరాల రాంబాబు అనే టైటిల్ పెట్టి సునీల్ క్యారెక్టర్ తో దర్శకుడు ఎంటర్టైన్ మెంట్ పండిస్తాడనుకుంటే ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఓవరాల్ గా సినిమా స్టార్టింగ్ లో తనదైన స్క్రీన్ ప్లేతో ఆసక్తి కలిగించిన దర్శకుడు ఆ తర్వాత తడబడ్డాడు. ఒక్కోసారి ఇది క్రాంతి మాధవ్ తీసిన సినిమానేనా? అనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. అందుకు రీజన్ ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా క్రాంతి స్టైల్ లో లేకపోవడమే. ఫైనల్ గా చెప్పాలంటే.. అటు సునీల్ కామెడీ ఆశించి వచ్చిన ప్రేక్షకులకు, ఇటు క్రాంతి మాధవ్ స్టయిల్ కోరుకుని వచ్చే ఆడియన్స్ కు కూడా ఉంగరాల రాంబాబు నచ్చడు.

 

రేటింగ్ : 2/5