'యూ టర్న్' మూవీ రివ్యూ

Friday,September 14,2018 - 06:38 by Z_CLU

నటీ నటులు : సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు..

సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి

ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మి

నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు

నిర్మాణ సంస్థలు : శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్

రచన -దర్శకత్వం: పవన్ కుమార్

విడుదల తేది : 13 సెప్టెంబర్ 2018

 

కన్నడలో  “యూ టర్న్” అనే సినిమాకి సంబంధించి ట్రైలర్  చూసిన సమంత అక్కడ విడుదలకి ముందే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకుంది… మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది.. అసలు సమంతను అంతలా ఇంప్రెస్ చేసిన కథేంటి..?  ఫైనల్ గా ఈ సినిమా సమంత నమ్మకాన్ని నిలబెట్టిందా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .


కథ :

ఓ మీడియా సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తూ ఉంటుంది రచన (సమంత).. ఆ సంస్థలో ఉద్యోగం సంపాదించడం కోసం ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ స్పెషల్ స్టోరీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ వెహికిల్స్ కి సంబంధించి నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది. అలా తన స్టోరీ కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రక్రియలో సుందరం అనే వ్యక్తి హత్య కేసులో ఇరుక్కుంటుంది రచన. సుందరాన్ని హత్య చేసింది రచనే అని భావించిన పోలీసులు ఆమెను అనుమానించి ఎంక్వేరి మొదలుపెడతారు. ఈ కేసులో రచన ని ఎంక్వైరీ చేసే ఎస్ ఐ నాయక్ (ఆది) ఆ కేసుకు సంబంధించి ఊహించని నిజాలు తెలుస్తాయి.

ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులు ఎవరు…  యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరూ ఎలా చనిపోయారు .. అసలు ఈ కేసుతో రచనకు సంబంధం ఏమిటి .. చివరకి నాయక్ సహాయంతో రచన యూ టర్న్ మిస్టరీని ఎలా ఛేదించింది.. అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

నటిగా ఆచితూచి అడుగులేస్తూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఎంచుకుంటున్న సమంత మరో సారి అలాంటి పాత్రే ఎంచుకుంది. సినిమాలో కథను నడిపించే ప్రధాన పాత్ర పోషించిన సమంత తన నటనతో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది… ముఖ్యంగా భయం, ప్రేమ ,సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ పండించి నటిగా మరోసారి బెస్ట్ అనిపించుకుంది. అంతా బాగానే ఉన్న సమంత సొంత డబ్బింగ్ మాత్రం తేడా కొట్టింది.. డబ్బింగ్ పై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. రచనకు సహాయ పడే పోలీస్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి పరవాలేదనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. ఇక కనిపించింది కాసేపే అయినప్పటికీ భూమిక తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక నటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. రాహుల్ రవీంద్రన్ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. మిగతా నటీ నటులు తమ రోల్స్ కి న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. సురేష్ ఎడిటింగ్ బాగుంది. ఏ.ఎస్.ప్రకాష్ తన ఆర్ట్ వర్క్ తో కథకు తగిన వాతవరణాన్ని క్రియేట్ చేసాడు. దర్శకుడు పవన్ కథ – స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

తెలుగులో ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్ సినిమాలొచ్చినా ఈ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం మరో థ్రిల్లర్ సినిమా వస్తుందంటే థియేటర్స్ కి క్యూ కడతారు.. అందుకే స్టార్ హీరోస్ , స్టార్ హీరోయిన్స్ కెరీర్ లో ఒక్కసారైనా థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటారు. అదీ థ్రిల్లర్ సినిమాకి ఉండే వేల్యూ.. సో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే చేసింది.. ఇందుకోసం కన్నడలో సూపర్ హిట్టైన ‘యూ టర్న్’ అనే సినిమాను ఎంచుకొని తెలుగులో చేసింది.. నిజానికి ఈ సినిమా చేస్తున్న టైంలో సమంతకి ఈ టైంలో థ్రిల్లర్ సినిమా అవసరమా..అనుకున్న వాళ్ళందరినీ రచన క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేసింది..

కన్నడ సినిమా దర్శకుడే ఈ రీమేక్ ని హ్యాండిల్ చేయడంతో ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ డీల్ చేసాడు. నిజానికి ఇలాంటి కథలకు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. తన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తి కరంగా నడిపించాడు దర్శకుడు పవన్. కథ -కథనం కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. కన్నడలో ఇప్పటికే తన టాలెంట్ నిరుపించుకున్న దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించగలిగాడు. ఇక సమంత లాంటి స్టార్డం ఉన్న హీరోయిన్ ఈ సినిమా చేయడం సినిమాకు బాగా కలిసొచ్చింది. మిగతా క్యారెక్టర్స్ కి కూడా తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటీ నటులని తీసుకోవడం పర్ఫెక్ట్ ఛాయస్ అనిపిస్తుంది… ముఖ్యంగా భూమిక , ఆది పినిశెట్టి క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇలాంటి కథలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయగలగడం కొంచెం కష్టమే.. కానీ తనకున్న అనుభవంతో ఎమోషనల్ సీన్స్ , థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో సినిమాను ప్రేక్షుకుడికి బాగా కనెక్ట్ చేయగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడి లాంటివి ఇరికించకుండా కేవలం ఓ థ్రిల్లర్ సినిమాలా మాత్రమే తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.

సమంత పెర్ఫార్మెన్స్ , ఎమోషనల్ సీన్స్ , క్యారెక్టర్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ నిలిచాయి. ఇక మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు , అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం మైనస్ అనిపిస్తాయి. ఫైనల్ గా  ‘యూ టర్న్’  థ్రిల్ చేస్తూ చక్కని సందేశంతో ఆలోచింపజేస్తుంది.

రేటింగ్ : 3/5