'టచ్ చేసి చూడు' మూవీ రివ్యూ

Friday,February 02,2018 - 03:22 by Z_CLU

నటీనటులు : రవి తేజ, రాశి ఖన్నా, శీరత్ కపూర్, మురళి శర్మ, జి.పి,వెన్నెల కిషోర్ తదితరులు

ఫోటోగ్ర‌ఫీ: రిచర్డ్ ప్రసాద్, ఛోటా కే నాయుడు

సంగీతం : జామ్8

నిర్మాతలు : న‌ల్ల‌మ‌లుపు బుజ్జి – వ‌ల్ల‌భ‌నేని వంశీ

క‌థ‌: వ‌క్కంతం వంశీ

స్క్రీన్‌ప్లే: దీప‌క్ రాజ్‌

మాట‌లు : శ‌్రీనివాస‌రెడ్డి

అడిష‌న‌ల్ డైలాగ్స్: ర‌విరెడ్డి మ‌ల్లు

దర్శకత్వం :విక్ర‌మ్ సిరికొండ

రిలీజ్ డేట్ : 2 ఫిబ్రవరి 2018

లేటెస్ట్ గా ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ ‘టచ్ చేసి చూడు’ అంటూ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమాతో రవితేజ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశాడో…తెలుసుకుందాం.


కథ :

పాండిచ్చేరిలో కార్తికేయ ఇండస్ట్రీస్ ఓనర్ అయిన కార్తికేయ(రవితేజ) పెద్ద బిజినెస్ మెన్ గా కుటుంబంతో జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాడు. ఒక సందర్భంలో తన కుటుంబం పెట్టే ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో పెళ్ళిచూపుల్లోనే పుష్ప(రాశి ఖన్నా) ని చూసి ఇష్టపడతాడు. పుష్ప కూడా కార్తికేయని ఇష్టపడటంతో ఇద్దరికీ పెళ్లి కుదురుస్తారు. అంతా ఓకే అనుకుంటున్న టైంలో కార్తికేయ తన చెల్లెలి ద్వారా తన శత్రువు ఇర్ఫాన్(ఫ్రెడ్డి థారావాలే) బ్రతికే ఉన్నాడని తెలుసుకుంటాడు. అయితే ఇంతకీ కార్తికేయ ఎవరు… తన ఫ్యామిలీతో పాండిచ్చేరి ఎందుకు వెళ్ళిపోయాడు. అసలు ఇర్ఫాన్ కి కార్తికేయకి సంబంధం ఏమిటి..? చివరికి కార్తికేయ ఇర్ఫాన్ ని ఎలా అంతమొందించాడు.. అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు:

ఇప్పటికే ఎన్నో మాస్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్న రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశాడు. కథతో పాటు  క్యారెక్టర్ లో కొత్తదనం లేకపోవడంతో రవితేజ ఇందులో కొత్తగా చేసిందేం లేదు. కానీ ఈ సినిమాకు కాస్తో కూస్తో ప్లస్ రవితేజ  మాత్రమే. రాశి ఖన్నా తన పెర్ఫార్మెన్స్ తో ఎప్పట్లానే ఎంటర్టైన్ చేసింది. సీరత్ కపూర్ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి క్యారెక్టర్ కి పరవాలేదనిపించుకుంది. ఇక స్టైలిష్ విలన్ గా ఫ్రెడ్డి పరవాలేదనిపించాడు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, గుండు సుదర్శన్ తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక మురళి శర్మ, జయప్రకాశ్, అన్నపూర్ణమ్మ, సాయాజీ షిండే,జీవ, చేతన్,సత్య,ఫిష్ వెంకట్,జబర్దస్త్ శ్రీను తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

తన మార్క్ బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు మణిశర్మ. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మణిశర్మ అందించిన బాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. జామ్-8 కంపోజ్ చేసిన పాటల్లో ‘పుష్ప’, ‘రాయే రాయే’,’టచ్ చేసి చూడు’  సాంగ్స్ పరవాలేదనిపించాయి. ఎడిటింగ్ బాగుంది. ఫైట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వక్కంతం వంశీ అందించిన కథ రొటీన్ గానే ఉంది. దర్శకుడు విక్రం సిరికొండ మేకింగ్ పరంగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

మాస్ మహారాజ్ నుండి ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొనడం సహజమే.. అదీ ‘టచ్ చేసి చూడు’ అంటూ ఓ పవర్ ఫుల్ టైటిల్ తో రవితేజ సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

గతంలో వినాయక్ తో పాటు మరికొందరు దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విక్రం సిరి దర్శకుడిగా పరవాలేదనిపించుకున్నాడు. కాని ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. వక్కంతం అందించిన కథ రొటీన్ అయినప్పటికీ కనీసం స్క్రీన్ ప్లేలో అయినా కొత్తదనం చూపించాల్సింది. ఇక ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సీన్స్ కూడా వేళ్ల మీద చెప్పేయొచ్చు. వక్కంతం అందించిన కథను తీసుకొని దీపక్ రాజ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందించిన విక్రం.. సినిమాలో బెస్ట్ సీన్స్ పై ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండేది. సీఎం ర్యాలీ జరుగుతున్న సమయంలో ఆ సభను ఎదుర్కోవడానికి చూసే వాళ్ళని రవితేజ అడ్డుకునే సీన్, కిడ్నాప్ అయిన ఓ అమ్మాయిని కాపాడే సీన్స్ అక్కడ వచ్చే ఫైట్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి.

రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ‘పుష్ప’ , ‘రాయే రాయే’ సాంగ్స్ , ఫైట్స్ , సెకండ్ హాఫ్ లో రవితేజ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ వచ్చే సీన్స్ , రాశి ఖన్నా – సుదర్శన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్, రవి తేజ -రాశి ఖన్నా మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్, సీరత్ కపూర్ గ్లామర్, కొన్ని డైలాగ్స్, పోలీస్ సిన్సియారిటీ డ్యూటీ గురించి వచ్చే సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన కథ, రొటీన్ అనిపించే సీన్స్, కామెడి పెద్దగా పండకపోవడం, ఫైట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు మైనస్.

ఫైనల్ గా ‘టచ్ చేసి చూడు’ జస్ట్ పరవాలేదనిపిస్తుందంతే.

రేటింగ్ : 2.5 / 5