'తోలు బొమ్మలాట' మూవీ రివ్యూ

Friday,November 22,2019 - 11:30 by Z_CLU

నటీనటులు: డా.రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ సంగీత, కల్పన, ధన్‌రాజ్‌ తదితరులు

ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల

సంగీతం: సురేష్ బొబ్బిలి

నిర్మాత : దుర్గాప్రసాద్‌ మాగంటి

రచన -దర్శకత్వం : విశ్వనాథ్ మాగంటి

సెన్సార్ : U

నిమిషాలు : 140 నిమిషాలు

విడుదల తేది : 22 నవంబర్ 2019

 

ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలతో అలరించి ఆకట్టుకున్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి ఓ మంచి పాత్రతో ‘తోలు బొమ్మలాట’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసాడు. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఓ పల్లెటూరిలో రైస్ మిల్ నడుపుతూ ఊరికి పెద్దలా ఒంటరిగా  సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు సోమరాజు అలియాస్ సోడాల రాజు(రాజేంద్ర ప్రసాద్). అయితే అనుకోకుండా సిటీ నుండి సోమరాజు దగ్గరికి వచ్చి తామిద్దరం ప్రేమించుకున్నామని తాతగా తమ పెళ్లి ఎలాగైనా మీరే చేయాలని రిక్వెస్ట్ చేస్తారు రిషి(విశ్వంత్‌), వర్ష(హర్షిత చౌదరి). అయితే మనవడు మనవరాలు ఇష్టపడుతుండటంతో తమ పిల్లలని ఒప్పించి వారిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు సోమరాజు.

ఈ విషయం తన పిల్లలిద్దరికీ చెప్పి మనవడు-మనవరాలి పెళ్లి చూసే లోపే హఠాత్తుగా మరణిస్తాడు సోమరాజు. అలా హఠాన్మరణం చెందిన సోమరాజుకి ఆ పెళ్లి చివరి కోరికగా మిగిలిపోతుంది. రక్తం పంచుకు పుట్టినప్పటికీ సోమరాజు కొడుకు కూతురు పెళ్లి తర్వాత  దూరమవుతారు. ఈ క్రమంలో మరణం తర్వాత సోమరాజు ఏం చేశాడు…? చనిపోయిన రోజు నుండి పెద్ద కర్మ వరకూ ఆత్మ రూపంలో ఆయన ఎలాంటి వేదన అనుభవించాడు..? చివరికి దూరం పెరిగిన రెండు కుటుంబాలను ఒక్కటి చేసి రిషి-వర్షాల పెళ్లి చేయించి ఆత్మ సంతృప్తి పొందాడా లేదా అనేది ‘తోలు బొమ్మలాట’ కథాంశం.

 

నటీనటుల పనితీరు :

రాజేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇప్పటికే వృద్దాప్య పాత్రలతో నటుడిగా మెప్పించిన ఆయన మరోసారి సోమరాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఊరి పెద్దగా, కాసింత చలాకీతనంతో ఎమోషనల్ టచ్ ఉండే పాత్రతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి ఇద్దరూ పరవాలేదనిపించుకున్నారు. కానీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పండలేదు. దేవీప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే కాస్త బరువైన పాత్రలు కావడంతో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

కొన్ని సందర్భాల్లో వెన్నెల కిశోర్ తన కామెడీతో ఎంటర్టైన్ చేశాడు. ‘తాగుబోతు’ రమేష్‌ కామెడీ పండలేదు. శిరీష సౌగంద్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ‘బస్టాప్‌’ కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాకు సినిమాటోగ్రఫీ, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సతీష్‌ ముత్యాల పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరాతో బాగా చూపించగలిగాడు. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలకు మంచి నేపథ్య సంగీతం పడింది. అలాగే ‘గొప్పది రా మనిషి పుట్టుక’ పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ పాటకు చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ పరవాలేదు. మోహన్‌.కె.తాళ్లూరి ఆర్ట్ వర్క్ బాగుంది.

విశ్వనాథ్ మాగంటి తను అనుకున్న పాయింట్ తో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. మాటలు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో సినిమా చేసేటప్పుడు అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కథలో ఉండే ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. ఇక ‘తోలు బొమ్మలాట’లో మనసుని కదిలించే అలాంటి బలమైన సన్నివేశాలు పడలేదు. క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా ప్రేక్షకుడికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు.

వృద్దాప్యంలో ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే పెద్ద కర్మలోపు అతని ఆత్మకు శాంతి చేకూరేలా , ముఖ్యంగా అతని చివరి కోరికను తీర్చాలని అప్పుడే ఆత్మ శాంతించి పిండం తింటుందనే విషయాన్ని సినిమా ద్వారా చెప్పాలని చూసిన దర్శకుడి ఆలోచన బాగుంది. కానీ సోడాల రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాను మొదలుపెట్టి దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకూ ఎంటర్టైన్ మెంట్ నే నమ్ముకొని సన్నివేశాలు రాసుకోవడమే తేడా కొట్టింది. అందువల్ల మరణించిన ఆత్మ ఆవేదన ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ పాత్రలో బాధను తెలియజేసేలా ఇంకా ఎమోషనల్ సన్నివేశాలు రాసుకోవాల్సింది. కథ రొటీన్ అనిపించడం , స్క్రీన్ ప్లే ఆసక్తిగా లేకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కూడా సినిమాను మోయలేకపోయాడు.

ఓ వ్యక్తి హఠాన్మరణం ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఆ సందర్భంలో వారి కుటుంబం నడుచుకునే తీరు, వాటిని చూస్తూ బాధ పడే ఆత్మ.. ఈ కాన్సెప్ట్ తో రాజేంద్ర ప్రసాద్ ఇదివరకే ‘ఆ నలుగురు’ అనే సినిమా చేసేశాడు కాబట్టి ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఆ సినిమాను మళ్ళీ గుర్తుచేస్తాయి. అదే లైన్ ను దర్శకుడు కాస్త అటు ఇటుగా మార్చి స్క్రీన్ ప్లే రాసుకున్నాడే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆత్మ చివరి కోరికగా భావించే మనవడి-మనవరాలి ప్రేమ పెళ్లికి కనెక్ట్ అయ్యేలా లవ్ ట్రాక్ ను రాసుకోలేకపోయాడు దర్శకుడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు మంచి సంభాషణలు పడలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అది సినిమాకు మరో మైనస్. రెండో భాగంలో వచ్చే లవ్ ట్రాక్ , కామెడీ ట్రాక్ ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. ఫైనల్ గా కొంత కామెడీ , కొంత ఎమోషన్ తో ‘తోలు బొమ్మలాట’ కొంత వరకూ మాత్రమే ఆకట్టుకుంది.

రేటింగ్ : 2.25/5