'తిప్పరా మీసం' మూవీ రివ్యూ

Friday,November 08,2019 - 01:45 by Z_CLU

న‌టీన‌టులు : శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి, నవీన్ నేని త‌దిత‌రులు

సంగీతం : సురేశ్ బొబ్బిలి

కెమెరా : సిద్‌

నిర్మాణం : రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా

కో ప్రొడ్యూస‌ర్స్‌: ఖుషీ, అచ్యుత్ రామారావు

నిర్మాత : రిజ్వాన్

రచన -దర్శకత్వం : కృష్ణ విజ‌య్‌.ఎల్‌

సెన్సార్ : U/A

విడుదల తేది : 8 నవంబర్ 2019

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా ఒక రెస్పెక్ట్ తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ‘తిప్పరా మీసం’ అంటూ థియేటర్స్ లోకొచ్చాడు. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీ విష్ణు మీసం తిప్పి హిట్టు కొట్టాడా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

చిన్నతనం నుండే చెడు అలవాట్లు చేసుకొన్న మణిశంకర్ (శ్రీ విష్ణు) పెద్దయ్యాక తల్లికి కుటుంబానికి దూరంగా ఉంటూ ఒక డీజేగా పనిచేస్తుంటాడు. జీవితమనేది జస్ట్ ఎంజాయ్ చేయడానికే అన్నట్టుగా భావించే మణి, డబ్బు కోసం అప్పుడప్పుడు కొన్ని బెట్టింగ్స్ కడుతుంటాడు. ఓ బెట్టింగ్ లో ఇరవై లక్షలు గెలిచి కాళి(జేమ్స్) అనే రౌడీ వల్ల గెలిచిన డబ్బు పొందలేకపోతాడు.

అదే సందర్భంలో తనకి బెట్టింగ్ లో అప్పు ఉన్న ముప్పై లక్షలు కట్టాలంటూ మణి మీద ఒత్తిడి తెస్తాడు జోసెఫ్. ఈ క్రమంలో తల్లి(రోహిణి)ని ఇబ్బంది పెట్టి ఆమె నుండి ఒక చెక్ తీసుకొంటాడు. ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో కన్నతల్లిపై కేసు వేస్తాడు. కేసు ఇంకా కోర్టులో ఉండగానే కాళి మర్డర్ కేసులో ఐదేళ్ళు జైలుకి వెళ్తాడు మణి. మరోవైపు జైలు నుండి రాగానే తన తమ్ముడ్ని చంపిన కారణం చేత మణిని చంపేందుకు కాసుకొని కూర్చుంటాడు దుర్గా(ఇర్ఫాన్). అయితే కాళికి దుర్గాకి సంబంధం ఏమిటి..? అసలు కాళిని చంపింది మణియేనా? చివరికి మణి తన తల్లి బాధను అర్థం చేసుకొని మంచివాడిగా మారాడా లేదా అన్నదే ‘తిప్పరా మీసం’ కథ.

 

నటీనటుల పనితీరు :

ఇప్పటికే హీరోగా తన టాలెంట్ ఏంటో రుజువుచేసుకున్న శ్రీవిష్ణు మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఒకరకంగా సినిమాకి శ్రీ విష్ణు నటనే హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని సందర్భంలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేసాడు. హీరోయిన్ గా నిక్కి తంబోలి నటనతో పరవాలేదనిపించుకుంది. రోహిణి ఎప్పటిలాగే అమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన ప్రేక్షకులకి కన్నీరు తెప్పిస్తుంది. మావయ్య పాత్రలో బెనర్జీ పర్ఫెక్ట్ అనిపించాడు.

హీరో చెల్లి పాత్రలో డా.పల్లవి బాగా నటించింది. ఫ్రెండ్ పాత్రలో చలాకీతనంతో నవీన్ నేని ఆకట్టుకున్నాడు. ఇక రవివర్మ, వెన్నెల రామారావు , ప్రవీణ్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు ఉన్నంతలో టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ అందించారు. ముఖ్యంగా సిద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా సన్నివేశాలను షూట్ చేసాడు. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సన్నివేశాలు అతని ప్రతిభ తెలియజేసేలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అలాగే ‘తిప్పరా మీసం’ అంటూ వచ్చే పాటతో పాటు ‘దేత్తడి’, ‘మౌన హృదయం’ పాటలు ఆకట్టుకున్నాయి. ధ‌ర్మేంద్ర కాక‌రాల‌ ఎడిటింగ్ సినిమాకు మైనస్ గా నిలిచింది. అవసరమైన సన్నివేశాలు తీసేసి అనవసరమైన సన్నివేశాలు ఉంచినట్టుగా అనిపించింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ నిడివి ఇంకా తగ్గిస్తే బాగుండేది.

ష‌ర్మిల ఎలిశెట్టి ఆర్ట్ వర్క్ బాగుంది. సన్నివేశాలకు తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో షర్మిల సక్సెస్ అయింది. అలాగే కమర్షియల్ సినిమాకు మహిళా కళా దర్శకురాలు కూడా పనిచేయగలదని నిరూపించుకుంది. రామ‌కృష్ణ‌, రియ‌ల్ స‌తీశ్‌ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో హీరో వాయిస్ ఓవర్ తో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు విజయ్ తను అనుకున్న కథతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో సన్నివేశాలకంటే హీరో క్యారెక్టర్ మీదే ఫోకస్ చేసి తడబడ్డాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు, హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఇటివలే ‘బ్రోచేవారెవరురా’ తో అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు కమర్షియల్ సినిమాతో మీసం తిప్పి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక నిరాశ పరిచాడు. ఓస్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ తో కథను సిద్దం చేసుకొని దానికి పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకున్న దర్శకుడు కొన్ని పొరపాట్ల వల్ల మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా తక్కువ సమయానికి కుదించి సన్నివేశాలను రాసుకోవడంలో విఫలం అయ్యాడు. అందువల్ల సినిమా మొదటి భాగం ముగిసేసరికే రెండు సినిమాలు చూసామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. పైగా మొదటి భాగంలో క్లాస్ తో పాటు మాస్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేకపోవడంతో జస్ట్ సాదా సీదాగానే అనిపిస్తుంది.

ఇక రెండో భాగంలో కథను ముందుకు నడిపించే సన్నివేశాలు కూడా నత్తనడకన సాగడంతో ఏదో పెద్ద నిడివి ఉన్న సినిమా చూసినట్టు ఫీలవుతుంటాం. అవన్నీ పక్కన పెడితే దర్శకుడు ఓ కమర్షియల్ మాస్ సినిమాలో మదర్ సెంటిమెంట్ పెట్టి దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక అవస్థలు పడ్డాడు. క్లైమాక్స్ లో మాత్రమే సెంటిమెంట్ పండించి ప్రేక్షకుడి కళ్ళల్లో నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేసాడు. నిజానికి అమ్మ పాత్రలో రోహిణీ కాకుండా మరో నటి అయితే ఆ మాత్రం సెంటిమెంట్ కూడా పండేది కాదేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో హీరో తన తల్లి కాళ్ళను పట్టుకోకుండా క్షమించమని దణ్ణం పెట్టుకునే షాట్ బాగుంది. అక్కడ దర్శకుడి ఆలోచన విధానం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. కాకపోతే ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యే అంశాలు లేకుండానే మొదటి భాగాన్ని, కథలో స్పీడ్ పెంచాల్సిన సమయంలో బోర్ కొట్టించే సన్నివేశాలతో నెమ్మదిగా రెండో భాగాన్ని నడిపించి దర్శకుడు బోల్తా కొట్టాడు.

నిజానికి ప్రేక్షకులు ఒక చిన్న సినిమా కోసం ఓ రెండున్నర గంటలు కేటాయించి థియేటర్ కి వచ్చినప్పుడు డబ్బులు పెట్టినప్పుడు వారు ఏం కోరుకుంటారు లేదా ఏం చెప్తే వారిని ఆకర్షించొచ్చు అనేది దర్శకుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం. అది వదిలేసి హీరో క్యారెక్టరైజేషన్ మీద ప్రేమ పెంచుకొని సన్నివేశాలు రాసుకున్నట్టుగా దర్శకుడి తీరు కనిపించింది. పైగా హీరో ఇంటెన్స్ క్యారెక్టర్ ఇప్పటికే చూసేసిన కొన్ని క్యారెక్టర్స్ ను గుర్తుచేస్తాయి. కాకపోతే శ్రీ విష్ణు చేయడం వల్ల కాస్త కొత్తగా అనిపిస్తుందంతే. ఇక “ఇప్పటి వరకూ నా గెలుపు కోసమే మీసం తిప్పాను ఇక నుండి మంచిని గెలిపించడానికి మీసం తిప్పుతా” అంటూ హీరో డైలాగ్స్ తో సినిమాను ఎండ్ చేసి టైటిల్ కి క్లారిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు.

ఓవరాల్ గా ‘తిప్పరా మీసం’లో కొన్ని అంశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి. మిగతావి బోర్ కొట్టిస్తాయి.

రేటింగ్ : 2 .5/5