'తెనాలి రామకృష్ణ BABL' మూవీ రివ్యూ

Friday,November 15,2019 - 01:31 by Z_CLU

న‌టీన‌టులు : సందీప్ కిష‌న్‌,హ‌న్సిక‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, అయ్యప్ప ,ముర‌ళీ శ‌ర్మ‌,వెన్నెల‌కిశోర్‌,ప్ర‌భాస్ శ్రీను ,ర‌ఘుబాబు,స‌ప్త‌గిరి,ర‌జిత‌,కిన్నెర‌,అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య‌, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు

సంగీతం : సాయికార్తీక్‌

ఛాయాగ్రహణం : సాయిశ్రీరాం

స‌మ‌ర్ప‌ణ‌: జువ్వాజి రామాంజ‌నేయులు

నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ , ఇందుమూరి శ్రీనివాసులు

క‌థ‌: టి.రాజ‌సింహ

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర రెడ్డి

నిడివి : 2 గంటల 8 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 15 నవంబర్ 2019

 

ఇటివలే ‘నిను వీడను నీడను నేనే’ అంటూ హారర్ థ్రిల్లర్ తో సందడి చేసిన సందీప్ కిషన్ ఇప్పుడు ‘తెనాలి రామకృష్ణ BABL’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సందీప్ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

బి.ఏ.బి.ఎల్ చదువుకొని కర్నూల్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) తనకి కేసులు రాకపోవడంతో కోర్టు దగ్గరికి వచ్చిన చిన్న కేసుల్ని కంప్రమైజ్ చేసుకుంటాడు. అదే కర్నూలులో ప్రజలకు మంచి చేస్తూ లీడర్ గా ఎదుగుతున్న వ్యాపారవేత్త వరలక్ష్మిని లాయర్ చక్రవర్తి(మురళి శర్మ) సహాయంతో జర్నలిస్ట్ భూపాల్(భూపాల్) మర్డర్ కేసులో ఇరికిస్తాడు కర్నూల్ రౌడీ సింహాద్రి నాయుడు(అయ్యప్ప).

మరోవైపు లాయర్ చక్రవర్తి కూతురు రుక్మిణి (హన్సిక)- రామకృష్ణ ప్రేమలో పడతారు. ఓ సందర్భంలో లాయర్ చక్రవర్తి తో కలిసి సింహాద్రి నాయుడు వరలక్ష్మి ను జైలు పంపాలని చూస్తున్నాడని తెలుసుకున్న రామకృష్ణ వరలక్ష్మి కేసుని టేకప్ చేసి లాయర్ గా రంగంలోకి దిగుతాడు. ఇంతకీ జర్నలిస్ట్ భూపాల్ ను చంపిందెవరు ? చివరికి లాయర్ గా రామకృష్ణ ఆ మర్డర్ చేసిన వ్యక్తికి శిక్ష వేయించాడా లేదా అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

సందీప్ కిషన్ ఎప్పటిలాగే పరవాలేదనిపించుకున్నాడు. కాకపోతే నటనలో కామెడీ టైమింగ్ మిస్సవ్వడంతో కొన్ని సన్నివేశాల్లో కామెడీ పండలేదు. హన్సిక కి నటించేందుకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో జస్ట్ గ్లామర్ షోకే పరిమితమైంది. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పటికే తమిళ్ లో చేసేసిన క్యారెక్టర్ కావడంతో చాలా ఈజ్ తో నటించింది. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేనందువల్ల అయ్యప్ప విలనిజంతో ఆకట్టుకోలేకపోయాడు.

మురళి శర్మ క్రిమినల్ లాయర్ గా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సప్తగిరి  కామెడీ ఎప్పటిలాగే ఓవర్ అనిపించింది.  ఇక రెండో భాగంలో సత్య కృష్ణ సాంగ్ కామెడీ ప్రేక్షకులను నవ్వించింది. వెన్నెల కిశోర్- చమ్మక్ చంద్ర – ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ పండలేదు. అన్నపూర్ణమ్మ , వై.విజయ, రఘు బాబు,కిన్నెర, ప్రదీప్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి తన మ్యూజిక్ తో హైలైట్ నిలిచాడు సాయి కార్తీక్. అలాగే సాయి శ్రీరాం తన కెమెరా విజువల్స్ తో సినిమాను కలర్ ఫుల్ గా మార్చాడు. ఎడిటింగ్ మాత్రం మైనస్. తక్కువ నిడివే ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి. అవి ట్రిమ్ చేస్తే బాగుండేది. కిర‌ణ్ ఆర్ట్ వర్క్ పరవాలేదు. వెంక‌ట్‌ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసాయి.

టి.రాజ‌సింహ అందించిన కథ రొటీన్ గానే ఉంది. ఇకపోతే స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేదు. అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ డైలాగ్స్ అలరించాయి. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి సన్నివేశాల్లో కామెడీ క్రియేట్ చేయలేక తడబడ్డాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒకానొక టైంలో కామెడీలో స్పెషలిస్ట్ అనిపించుకున్న దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ‘తెనాలి రామకృష్ణ BABL’తో మరోసారి నిరాశపరిచాడు. అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టి కేసుల్లేక ఓ పెద్ద కేసు కోసం ఎదురుచూస్తున్న హీరో , అదే సమయంలో తన లాయర్ ని నమ్మి మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్న పొలిటికల్ లీడర్, చివరికి ఆ కేసును టేకప్ చేసి న్యాయం చేసే హీరో. సింపుల్ గా చెప్పాలంటే ఇదే సినిమా లైన్. కాకపోతే ఈ సింపుల్ స్టోరీకి ఓ రొటీన్ ట్విస్టు పెట్టారంతే. ఆ ట్విస్టు కూడా ప్రేక్షకుడు ఊహించేలా ఉంది.

స్టోరీ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసి ఎంటర్టైన్ చేయగలిగితే ఏ దర్శకుడైనా సక్సెస్ అవుతాడు. కాని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మళ్ళీ అదే మిస్టేక్ చేసాడు. ఒకే రకమైన మూస కామెడీకి నాగేశ్వర్ రెడ్డి కట్టుబడటం వల్ల అందులో కొత్తదనం కనిపించక ప్రేక్షకులు నవ్వలేక చివరికి ఇదంతా అవసరం లేని ప్రహసనంలా అనిపించడం ఇందులో ప్రధాన బలహీనత. ఒకప్పుడు కామెడీ సినిమాలను హ్యాండిల్ చేసే విషయంలో నాగేశ్వర్ రెడ్డి నిర్మాతలకు బెస్ట్ ఛాయిస్. ‘సీమ శాస్త్రీ’ , ‘సీమ టపకాయ్’, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలే అందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు ఆయనలో ఆ కామెడీని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే స్కిల్స్ తగ్గిపోయాయి. దీనికి ‘ఆడాడుకుందాం రా’, ‘ఇంట్లో దెయ్యం-నాకేం భయం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలే ఉదాహరణ. ఇక నాగేశ్వర్ రెడ్డి సినిమాల్లో ఎప్పుడూ వినిపించే సెటైరికల్ డైలాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాకపోతే ఈసారి రాజకీయ పరంగా ఎక్కువ సెటైర్స్ వినబడ్డాయి.

కామెడీకి స్కోప్ ఉండే ఇలాంటి కథకు ఎవరైనా కామెడీ హీరోని తీసుకుని ట్రెండీ కామెడీతో సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది. అలా కాకుండా సందీప్ కిషన్ ని తీసుకోవడం, లవ్ ట్రాక్ మరీ పేలవంగా రాసుకోవడం , మూస కామెడీతో సినిమాను ఆద్యంతం నడిపించడం సినిమాకు మైనస్ అనిపించాయి. ఇక కమెడియన్స్ ని కూడా ఈసారి సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఆ విషయంలో ఒక్క సత్య కృష్ణ క్యారెక్టర్ తో మాత్రమే కొంత కామెడీ పండించగలిగాడు. మిగతా కమెడియన్స్ కామెడీ సన్నివేశాలు నవ్వించకపోగా విసుగు తెప్పిస్తాయి. కొన్ని సార్లు లాజిక్స్ ని గాలికొదిలేసాడు దర్శకుడు. కామెడీ పేలినప్పుడు అవి పట్టించుకోరు కానీ బోర్ కొట్టిస్తే అవన్నీ ప్రేక్షకుడి మైండ్ లో తిరుగుతుంటాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషణ్ కి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అతనికి కేసులు రాకపోవడానికి చూపించిన కారణం మరీ సిల్లీగా ఉంది. ఓ వైపు కామెడీ మరోవైపు సీరియస్ పొలిటికల్ డ్రామా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో విఫలం అయ్యాడు నాగేశ్వర్ రెడ్డి. సినిమాను ఇంకా సాగదీయకుండా ఉన్నంతలో రన్ టైం కాస్త ప్లస్ అయింది. ఓవరాల్ గా ‘తెనాలి రామకృష్ణ BABL’కొన్ని నవ్వులు మాత్రమే అందించి ఎక్కువ బోర్ కొట్టించాడు.

రేటింగ్ : 2/5