'టాక్సీవాలా' మూవీ రివ్యూ

Saturday,November 17,2018 - 03:01 by Z_CLU

నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, సిజ్జు, మధునందన్, రవి ప్రకాష్, రవివర్మ, ఉత్తేజ్, విష్ణు
మ్యూజిక్: జేక్స్ బిజాయ్
సినిమాటోగ్రాఫర్:  సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: సాయి కుమార్ రెడ్డి
నిర్మాణం: జీఏ 2 మరియు యువి పిక్చర్స్ (GA2 & UV PICTURES)
నిర్మాత: ఎస్ కె ఎన్ (SKN)
కథ, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
నిడివి: 130 నిమిషాలు
విడుదల తేదీ: 17 నవంబర్ 2018

విజయ్ దేవరకొండకు మినిమం గ్యారెంటీ ఉంది. అతడి సినిమాల్లో కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కొత్తగా ఉంటుందని, మరీ ముఖ్యంగా యాక్టింగ్ విషయంలో దేవరకొండ డిసప్పాయింట్ చేయడమే ఇమేజ్ ఉంది. ఇలాంటి హీరో నుంచి ఈరోజు థియేటర్లలోకొచ్చింది టాక్సీవాలా. మరి ఈ సినిమా కొత్తగా ఉందా..? ప్రేక్షకులకు దేవరకొండ భరోసా ఇచ్చాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ:
అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.

కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన  అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.

నటీనటుల పనితీరు:
టాక్సీవాలా సినిమాలో అందరి కళ్లు విజయ్ దేవరకొండపైనే. యూత్ ఐకాన్ గా మారిన ఈ హీరో టాక్సీవాలాగా అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. శివ అనే క్యారెక్టర్ లో చించేశాడు. నటనలో ఆ ఈజ్ దేవరకొండకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎలాంటి కథ, క్యారెక్టర్ అయినా ఇమిడిపోతాడు. ఈ జోనర్ కొత్త అయినప్పటికీ అలాంటి ఫీలింగ్ రానివ్వకుండా నటించాడు. ముఖ్యంగా భయపడే సీన్స్ లో విజయ్ నటన అలరిస్తుంది.

ఈ సినిమాతో  హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియాంక పరవాలేదనిపించుకుంది. శిశిర అనే క్యారెక్టర్ కి మాళవిక వందశాతం న్యాయంచేసింది. సిజ్జు మరోసారి నెగిటీవ్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. మధునందన్, చమ్మక్ చంద్ర, విష్ణు తమ కామెడితో అలరించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హాలీవుడ్ క్యారెక్టర్ లో విష్ణు చేసిన కామెడి సినిమాకే హైలైట్.. కల్యాణి, రవి ప్రకాష్, కిరీటి తదితరులు తమ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్స్ కి సూటబుల్ అనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు:
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సినిమాకు పర్ఫెక్ట్ ఆర్.ఆర్ అందించాడు జేక్స్ బిజోయ్. చాలా సందర్భాల్లో సౌండింగ్ విజువల్స్ ను ఎలివేట్ చేసింది. ఇక పాటల విషయానికొస్తే మాటే వినదుగా సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటకి కృష్ణకాంత్ అందించిన లిరిక్స్, సిద్ శ్రీరాం వాయిస్ ప్లస్ అయ్యాయి.

సుజిత్ సారంగ్ విజువల్స్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. చాలా సందర్భాల్లో అతని హార్డ్ వర్క్ కనిపించింది. కలర్ స్క్రీమింగ్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాయి కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయాలంటే పేపర్ వర్క్ బాగా చేయాలి. ఇల్లు కడుతున్నట్టు ఒక్కో సీన్ ను జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లాలి. దర్శకుడు రాహుల్ చేసిన ఆ హోం వర్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. తను రాసుకున్న స్క్రిప్ట్ ని బ్రహ్మాండంగా డీల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష:
టాక్సీవాలా.. ప్రమోషన్లతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఒకరేమో హారర్ అంటారు. కాదుకాదు సైన్స్ ఫిక్సన్ అంటాడు దర్శకుడు. ఇలా యూనిట్ లో సభ్యులే తలో రకంగా స్పందించడంతో ఆడియన్స్ కూడా అయోమయానికి గురయ్యారు. ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత వాళ్లు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో అర్థం అవుతుంది. టాక్సీవాలా అనేది హారర్ కోటింగ్ తో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా. హారర్ జానర్ లో ఇదో కొత్త ప్రయోగం.

ఏడాదిలో వచ్చే వందల సినిమాల్లో ఓ 3-4 కొత్త కథలు కనిపిస్తాయి. టాక్సీవాలా ఆ 3-4 సినిమాల్లో ఒకటి. ఇందులో పాయింట్ తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త. హారర్ సినిమాలంటే భయపడే ప్రేక్షకులంతా కచ్చితంగా చూడాల్సిన సినిమా. అంత బాగుంటుంది ఇందులో స్టోరీ. మరీ ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం తాపత్రయ పడకుండా నిజాయితీగా కథను కథలా చెప్పడం టాక్సీవాలాకు పెద్ద ప్లస్ పాయింట్.

ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన యాటిట్యూడ్ తో పాటు తన టేస్ట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అతడి నుంచి సగటు ప్రేక్షకుడు వంద శాతం కొత్తదనం ఆశించొచ్చు. రొటీన్ స్టఫ్ ను ఈ హీరో ఎంకరేజ్ చేయడు. దానికి టాక్సీవాలా బెస్ట్ ఎగ్జాంపుల్.

కొన్ని సినిమాలకు టెక్నీషియన్స్ కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. టాక్సీవాలా ఆ కోవకు చెందుతుంది. లైటింగ్ నుంచి డైరక్షన్ వరకు అన్ని విభాగాల్లో ఈ సినిమా మెప్పిస్తుంది. అంతా కలిసికట్టుగా పనిచేసిన సినిమా ఇది. అందుకే మంచి అవుట్ పుట్ వచ్చింది.

లవ్ ట్రాక్ సరిగా పండక పోవడం, సోసోగా ఉన్న హీరోయిన్ అప్పీయన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాగదీత వంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. ఊహించని ట్విస్ట్ తో క్లైమాక్స్ ముగించేసరికి ఈ మైనస్సులన్నీ ప్లస్సులు అయిపోయాయి. ఓవరాల్ గా ఈ టాక్సీవాలా కుర్రాళ్ల నుంచి ఫ్యామిలీస్ వరకు ఏ ఒక్కర్నీ డిసప్పాయింట్ చేయడు.

బాటమ్ లైన్ : జాలీ రైడ్
రేటింగ్ : 3/5