Movie Review - 'రైటర్ పద్మభూషణ్'

Friday,February 03,2023 - 01:05 by Z_CLU

Suhas’s ‘Writer Padmabhushan’ Review

నటీ నటులు : సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ , ప్రవీణ్ కఠారి తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్

డీవోపీ : వెంకట్ ఆర్ శాకమూరి

నిర్మాణం: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

సమర్పణ: మనోహర్ గోవింద్ స్వామి

నిర్మాతలు: అనురాగ్, శరత్, చంద్రు మనోహర్

రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్

నిడివి : 123 నిమిషాలు

రిలీజ్ : 3 ఫిబ్రవరి 2023

రిలీజ్ కి ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సందడి చేసిన ‘రైటర్ పద్మ భూషణ్‘ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిన్న పెద్ద విజయం అందుకుందా ? కొత్త దర్శకుడు కంటెంట్ మెప్పించగలిగాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ : 

విజయవాడలో ఉండే పద్మభూషణ్ (సుహాస్) లైబ్రరీలో పనిచేస్తుంటాడు. చిన్నతనం నుండి రైటర్ అవ్వాలనే  ఆశయంతో ఉంటాడు.  రైటర్ గా ‘తొలి అడుగు’ అనే పుస్తకం రాసి మార్కెట్ లోకి తీసుకొస్తాడు. కానీ ఆ పుస్తకం క్లిక్ అవ్వకపోవడంతో నిరాశతో ఉంటాడు. ఎప్పటికైనా మంచి పుస్తకం రాసి రైటర్ గా గుర్తింపుతో పాటు, అభినందనలు అందుకోవాలని చూసే పద్మభూషణ్ పేరుతో మరో పుస్తకం మార్కెట్ లోకి వచ్చి భారీ కాపీలు అమ్ముడుపోతాయి.

ఆ పుస్తకం చూసి మాటలకు దూరమైన మావయ్య(గోపరాజు) తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్) ను పెళ్లి చేసుకోవాలని కోరుతూ పద్మభూషణ్ తో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేస్తాడు. అప్పటి వరకు తన కొడుకు రైటర్ అని తెలియని తల్లి దండ్రులు(రోహిణీ -ఆశిష్ విద్యార్థి) షాక్ అవుతారు. ఈ క్రమంలో తన పేరుతో పుస్తకం రాశి అలాగే బ్లాగ్ లో కంటెంట్ పెట్టె వ్యక్తి ఎవరో తెల్సుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడు పద్మభూషణ్.

మరి ఫెయిల్యూర్ రైటర్ గా ఉన్న పద్మభూషణ్ ను సక్సెస్ ఫుల్ రైటర్ గా జనాలకి పరిచయం చేయాలనుకున్నది ఎవరు ? ఫైనల్ గా రైటర్ గా  పద్మభూషణ్ సక్సెస్ అయ్యడా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

సుహాస్ మంచి నటుడు. తన నేచురల్ యాక్టింగ్ తో కేరెక్టర్ కి బెస్ట్ ఇస్తాడు. పద్మభూషణ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. రైటర్ గా సక్సెస్ అవ్వాలనుకునే విజయవాడ కుర్రాడిగా మెప్పించాడు. టీనా శిల్పరాజ్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ గా శ్రీ గౌరీ ప్రియ మంచి మార్కులు అందుకుంది.

రోహిణీ సరస్వతి పాత్రలో ఒదిగిపోయి నటించింది. తన నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకుంది. ఆశిష్ విధ్యార్థి కొత్త పాత్రలో కనిపించి సర్ ప్రయిజ్ చేశాడు. మధ్యతరగతి తండ్రిగా మంచి నటన కనబరిచాడు. గోపరాజు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.  ఫ్రెండ్ కేరెక్టర్ లో నటించిన ప్రవీణ్ కి కథలో మంచి ఇంపార్టెన్స్ దక్కింది. మిగతా నటీ నటులంతా వారి పాత్రలతో అలరించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

ఏ సినిమాకయినా ఆ ఫీల్ తీసుకొచ్చే మ్యూజిక్ చాలా ముఖ్యం. చిన్న సినిమాలకు మరీ ముఖ్యం. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన “కన్నుల్లో నీ రూపమే” సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మిగతా పాటలు కూడా బాగున్నాయి. కళ్యాణ్ నాయక్ కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్ లో ప్రేక్షకుడికి ఎమోషనల్ ఫీల్ కలిగించడంలో నేపథ్య సంగీతం ముఖ్య భూమిక పోషించింది.

వెంకట్ ఆర్ శాకమూరి విజువల్స్ నేచురల్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కోదాటి, సిద్ధార్థ్ తాతోలు ఎడిటింగ్ బాగుంది. ఎక్కువ డ్రాగ్ చేయకుండా మూవీని క్రిస్ప్ గా కట్ చేయడం కలిసొచ్చింది. షణ్ముఖ ప్రశాంత్ తీసుకున్న కథ, దాని చుట్టూ అల్లిన కథనం బాగుంది. రైటర్ గా అలాగే దర్శకుడిగా మొదటి సినిమాతోనే ప్రశాంత్ మంచి మార్కులు అందుకున్నాడు. డైలాగ్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే మాటలు మాత్రం ఆకట్టుకున్నాయి.  ప్రొడక్షన్ వెల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష : 

ఒక చిన్న సినిమాకు ప్రేక్షకులను తీసుకురావడం అంటే చాలా పెద్ద టాస్క్. కథ -కథనం ఎంత బాగున్నా చిన్న ఆర్టిస్టుల సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే తాము తీసిన ఓ మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ‘రైటర్ పద్మభూషణ్’ టీం రిస్క్ చేసి ప్రీమియర్స్ వేస్తూ వచ్చారు. ప్రీమియర్ పడిన ప్రతీ షోకి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక సమీక్షలోకి వెళ్తే , దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్  ఒక మంచి పాయింట్ తీసుకొని దానికి ఓ ట్విస్ట్ జత చేసి మెప్పించాడు. సుహాస్ కేరెక్టర్ తో మొదటి భాగాన్ని సరదాగా నడిపించేసిన దర్శకుడు రెండో భాగంలో కూడా అంతే సరదాగా నడిపించి క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశంతో ట్విస్ట్ పేల్చి సినిమా గ్రాఫ్ ను అమాంతంగా పెంచాడు.

రైటర్ అవ్వాలనుకునే పద్మభూషణ్ కేరెక్టర్ తో సినిమాను స్టార్ట్ చేసి అతన్ని ఓ లూసర్ గా చూపిస్తూ కొన్ని సన్నివేశాలతో అలరించాడు దర్శకుడు.  ఓ సింపుల్ లవ్ ట్రాక్ రాసుకొని అందులో మంచి కామెడీ సన్నివేశాలు డిజైన్ చేసుకున్నాడు.  థియేటర్ లో వచ్చే లవ్ సీన్ బాగా పేలింది. ఆ తర్వాత వచ్చే రెండు మూడు కామెడీ సీన్స్ కూడా నవ్విస్తాయి.

సరిగ్గా ఇంటర్వెల్ కి ముందు ఓ ట్విస్ట్ పెట్టి అక్కడి నుండి సినిమాపై ఆసక్తి పెంచే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే క్లైమాక్స్ ను బాగా డిజైన్ చేసుకొని సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకుడికి ఓ ఫీల్ గుడ్ మూవీ చూశామనే ఫీలింగ్ కలిగించాడు. తనకి ఉన్న బడ్జెట్ లిమిట్  పరిధిలో బాగానే తీసి మొదటి సినిమాతో మెప్పించాడు ప్రశాంత్. కథలో ముఖ్యమైన పాత్రలకు సీనియర్ యాక్టర్స్ ను ఎంచుకోవడం యువ దర్శకుడి మొదటి సక్సెస్ అనుకోవచ్చు. ముఖ్యంగా  తల్లి పాత్రకు సీనియర్ యాక్టర్ రోహిణీ ను ఎంచుకోవడం సినిమాకు బాగా కలిసొచ్చింది. క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాను నిలబెట్టింది.

సుహాస్ నటన , రోహిణి – ఆశిష్ విద్యార్థి కేరెక్టర్స్ ,  కామెడీ , ప్లీసెంట్ మ్యూజిక్ , ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ , క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్స్ కాగా , లో క్వాలిటీ అనిపించే మేకింగ్ , అక్కడక్కడా గ్రాఫ్ డౌన్ అవ్వడం , కొన్ని పేలవమైన సన్నివేశాలు మైనస్ అనిపిస్తాయి.

ఓవరాల్ గా ‘రైటర్ పద్మభూషణ్’ షార్ట్ అండ్ స్వీట్ మూవీగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో సరదాగా చూసే సినిమా అవుతుంది. క్లైమాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మనసును హత్తుకోవడం ఖాయం.

రేటింగ్ : 3 /5

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics