'శ్రీరస్తు శుభమస్తు' రివ్యూ

Friday,August 05,2016 - 04:54 by Z_CLU

చిత్రం : శ్రీరస్తు శుభమస్తు
నటీ నటులు :అల్లు శిరీష్,లావణ్య త్రిపాఠి,ప్రకాష్ రాజ్, రావు రమేష్,సుమలత,తనికెళ్ళ భరణి తదితరులు
సినిమాటోగ్రఫీ : మణికందన్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
ఎడిటర్ :మార్తాండ్ కె.వెంకటేష్
కథ,మాటలు,దర్శకత్వం :పరశురామ్ బుజ్జి
నిర్మాణం :గీతా ఆర్ట్స్
నిర్మాత : అల్లు అరవింద్
విడుదల తేదీ : 05-08-2016

కథ :-
మధ్యతరగతి కుటుంబాలన్నీ డబ్బున్న కుటుంబాలతో సంబంధం ఏర్పరుచుకొని రాత్రికి రాత్రే డబ్బున్న వాళ్ళు అయిపోతారనే ఆలోచనతో ఉండే ఒక పెద్ద బిజినెస్ మన్ కొడుకు శిరీష్ ఒకానొక సందర్భం లో అను (లావణ్య త్రిపాఠి) అనే మధ్యతరగతి అమ్మాయి ను చూసి తన వ్యక్తిత్వానికి, అందానికి ఫిదా అయిపోయి ప్రేమిస్తాడు. అలా ప్రేమించిన శిరీష్ అను కు ఎలా దగ్గరయ్యాడు? తనను ఎలా ప్రేమలో పడేసాడు? తన తండ్రి ను ఎలా మార్చాడు? ఇంతకీ అను శిరీష్ ప్రేమ పెళ్లిగా మారిందా? లేదా అనేదే చిత్ర కధాంశం.

నటీ నటుల పనితీరు:-
అల్లు శిరీష్ తన నటనతో శిరీష్ పాత్రకు న్యాయం చేసాడు. ఇక లావణ్య తన అందం, నటనతో ఆకట్టుకొని సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. రావు రమేష్ మధ్యతరగతి తండ్రి పాత్రలో న్యాచురల్ నటనతో మరో సారి ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్ పాత్ర నామ మాత్రంగానే ఉంది. ఇలాంటి పాత్రల్లో ప్రకాష్ రాజ్ ను చాల సార్లు చూసేసాం అనే ఆలోచన వస్తుంది. అలీ, సుబ్బరాజు తమ కామెడీ తో అలరించారు. మొదటి భాగం లో స్వప్నిక, ప్రభాస్ శ్రీను కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. తనికెళ్ళ భరణి,సుమలత, రణధీర్,ప్రగతి తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :-
సినిమాకు తన సినిమాటోగ్రఫీ తో కల తీసుకొచ్చాడు కెమెరామెన్ మణికందన్. థమన్ అందించిన పాటల్లో ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్ సాంగ్ తో పాటు ‘అను అను’ పాట కూడా బాగుంది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మాటలు బాగా ఆకట్టుకున్నాయి. తన దైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు అలరించారు. ఎడిటింగ్ బాగుంది. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష:-

‘గౌరవం’ తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ‘కొత్త జంట’ తో ఓ మోస్తరుగా అలరించిన శిరీష్ ఈ చిత్రం తో నటుడిగా మరిన్ని మార్కులు అందుకున్నాడనే చెప్పాలి. ఒక ఎనర్జిటిక్ యువకుడి పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు అల్లు వారబ్బాయి. ఇక తన న్యాచురల్ నటన, డైలాగ్ డెలివరీ తో సినిమాకు హైలైట్ గా నిలిచి సినిమాకు ప్లస్ అయ్యాడు రావు రమేష్. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర రొటీన్ అయినా ఆ పాత్ర క్లైమాక్స్ కు ప్లస్ అయ్యిందనే చెప్పుకోవాలి. గతం లో ‘యువత’, ‘సోలో’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తో పాటు మంచి విజయాలు అందుకున్న పరశురామ్ బుజ్జి తన దైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో ఈ సినిమాను ఫ్యామిలీ , లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. మొదటి భాగం లో కొన్ని సన్నివేశాలు సిల్లీ గా అనిపించినా అవి సినిమాకు మైనస్ అని చెప్పలేం. అయితే తొలి భాగం కాస్త రొమాంటిక్, కామెడీ సన్నివేశాలతో సాదా సీదా గా సినిమాను నడిపించిన దర్శకుడు రెండో భాగం లో మాత్రం కామెడీ, ఎమోషన్ సన్నివేశాలతో కథ లో స్పీడు పెంచాడనే చెప్పాలి . ఇక సినిమా అంతా ఒకెత్తయితే క్లైమాక్స్ ఒకెత్తనే చెప్పాలి. మనసుకు హత్తు కొనే సంభాషణలతో కూడిన క్లైమాక్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ‘శ్రీరస్తు శుభమస్తు ‘ చూడదగ్గ కుటుంబ ప్రేమకథా చిత్రం.