'శ్రీనివాస కళ్యాణం' మూవీ రివ్యూ

Thursday,August 09,2018 - 03:11 by Z_CLU

నటీనటులు : నితిన్, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ : స‌మీర్ రెడ్డి

సంగీతం : మిక్కి జె.మేయ‌ర్‌

నిర్మాణం : శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం : స‌తీశ్ వేగేశ్న‌

సెన్సార్ : క్లీన్ U

విడుదల తేదీ : 9 ఆగస్ట్ 2018

 

నితిన్ పెళ్లిపై చాలా పుకార్లు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో పూర్తిగా పెళ్లి కాన్సెప్ట్ తో సినిమా చేశాడు నితిన్. ఈరోజు రిలీజైన శ్రీనివాసకళ్యాణం సినిమాలో నితిన్ పెళ్లిని కనులారా చూడొచ్చు. ఇంతకీ ఈ సిల్వర్ స్క్రీన్ కళ్యాణం ఎలా ఉంది? నితిన్ కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ:

శ్రీనివాస్ (నితిన్) ది పెద్ద కుటుంబం. నానమ్మ, అమ్మ- నాన్న, మావయ్య, అత్తయ్య, పెద్దమ్మ, పిన్ని ఇలా అందరూ ఉమ్మడిగా కలిసుంటారు. చిన్నతనం నుండి నాన్నమ్మ(జయసుధ) ఇష్టపడే బంధాలు, సంప్రదాయల మధ్య పెరిగి పెద్దయిన శ్రీనివాస్ వాటికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఓ ప్రాజెక్ట్ కోసం ఇంజినీర్ గా చండీఘర్ కి వెళ్తాడు. అక్కడ తన స్నేహితులతో సరదాగా గడుపుతూ అలాగే తన కుటుంబంతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ జీవితాన్ని గడిపే శ్రీనివాస్ కి అనుకోకుండా శ్రీదేవి (రాశి ఖన్నా) పరిచయం అవుతుంది. తక్కువ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత శ్రీదేవి ప్రముఖ వ్యాపార వేత్త ఆర్.కే.గ్రూప్ అధినేత ఆర్.కే(ప్రకాష్ రాజ్) కూతురు అని తెలుసుకుంటాడు శ్రీనివాస్. ఈ క్రమంలో తమ ప్రేమ విషయాన్నీ రెండు కుటుంబాలకు చెప్పి ఒప్పిస్తారు.

చిన్నతనం నుంచి బావ శ్రీనివాస్ నే భర్తగా భావించే మరదలు పద్దు(నందిత శ్వేతా) ఈ పెళ్లి వార్త విని షాక్ అవుతుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు శ్రీదేవి తండ్రి ఆర్కేకు, శ్రీనివాస్ కు ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన ఆ అగ్రిమెంట్ ఏమిటి… అసలు చివరికి పెళ్ళంటే పండగ అని భావించే శ్రీనివాస్ కుటుంబం శ్రీనివాస కళ్యాణాన్ని ఎలా జరిపించారు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

శ్రీనివాస్ గా నితిన్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. డీసెంట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇక పెర్ఫార్మెన్స్ పెద్దగా స్కోప్ లేకపోవడంతో రాశి ఖన్నా జస్ట్ పరవాలేదనిపించుకుంది. నందిత శ్వేతా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రకాష్ రాజ్, జయసుధ ఎప్పటిలాగే తమ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు. గిరిబాబు , రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు అజయ్, జెమినీ సురేష్, ప్రభు, రచ్చ రవి, మహేష్ ఆచంట, జోష్ రవి, కృష్ణ తేజ తదితరులు కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు. ప్రవీణ్, విద్యు రామన్ కామెడీ రొటీన్ అనిపించినా కొంత వరకూ నవ్వించింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ చాలా మంది నటీనటులు కనిపిస్తారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు సమీర్ రెడ్డి పర్ఫెక్ట్ ఛాయస్. తన సినిమాటోగ్రఫీతో సినిమాను మరింత అందంగా చూపించాడు. ప్రతీ ఫ్రేమ్ లో అతని పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా పల్లెటూరి లోకేషన్స్ ను చాలా అందంగా చూపించాడు సమీర్. ‘కళ్యాణం వైభోగం’ పాట మినహా మిక్కీ అందించిన పాటలు రొటీన్ అనిపించాయి. ‘ఇతడేనా’, ‘మొదలవుదాం’, ‘వినవమ్మా తురుపు చుక్క’ పాటలు జస్ట్ పరవాలేదనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సన్నివేశాలను తన ఆర్.ఆర్ తో ఎలివేట్ చేసాడు మిక్కీ. రామ జోగయ్య శాస్త్రీ , శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది.

మధు ఎడిటింగ్ బాగుంది కానీ మొదటి భాగంలో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. రామాంజనేయలు ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి వేసిన సెట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో సతీష్ వేగేశ్న డైలాగ్స్ – స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

నిజానికి శ్రీనివాస కళ్యాణం కథ కొత్తదేం కాదు. ముందు నుండి యూనిట్ చెప్తున్నట్టే పెళ్లి గొప్పతనాన్ని చెప్పే సినిమా ఇది. అందుకే టీజర్, ట్రైలర్ లో తమ కాన్సెప్ట్ ఇదేనని కాస్త గట్టిగానే చెప్పి ప్రేక్షకులను ప్రిపేర్ చేశారు. శతమానం భవతితో బంధాలు, బంధుత్వాల గురించి గొప్పగా చెప్పి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసారి పెళ్లి గొప్పతనం గురించి అంతే గొప్పగా చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కేవలం పెళ్లి మీదే ఫోకస్ పెట్టి ఈ సినిమా తీశాడు. పెళ్ళంటే చాలా ఉంటుందని నేటి తరానికి గట్టిగానే చెప్పాడు. ఈ యాంగిల్ లో ఇతడికి ఫుల్ మార్క్ లు గ్యారెంటీ. కానీ సినిమా మొత్తం పెళ్లే ఉంటే సరిపోతుందా..? ఇంకేం అక్కర్లేదా..?

సెకండ్ హాఫ్ లో వచ్చే పెళ్లి పనుల నుండి తను చెప్పాలనుకున్నది క్లియర్ గా చెప్పాడు దర్శకుడు. దీనికి సంబంధించి పెళ్లిలో జరిపే 36 కార్యక్రమాలపై ఫుల్ రీసెర్చ్ కూడా చేసినట్టున్నాడు. అయితే ఈ క్రమంలో మరికొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ కేవలం పెళ్లి మీదే ఫోకస్ పెట్టడంతో తనకు పట్టున్న విలేజ్ క్యారెక్టర్స్ తో కూడా కామెడీ పండించలేకపోయాడు. దీనికితోడు ఫస్టాఫ్ బోర్ కొట్టేసింది. సినిమా ప్రారంభమైన మొదటి పది నిమిషాల్లోనే కథ ఏంటో తెలిసిపోవడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం, స్లో నేరేషన్, క్లైమాక్స్ సినిమాకు మైనస్.

ఫస్ట్ హాఫ్ లో నితిన్ – రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ సీన్స్ పై మరింత దృష్టి పెట్టి, కథలో అనుకోని ట్విస్టులు ఏవైనా చేర్చి కామెడి క్రియేట్ చేసి అదిరిపోయే క్లైమాక్స్ పెట్టి మరింత ఇంప్రెసీవ్ గా చెప్పి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడికి ఈ ఫీలింగ్ కలుగుతుంది.

అయితే సెకెండాఫ్ లో దర్శకుడు చెలరేగిపోయాడు. హార్ట్ టచింగ్ సీన్స్, డైలాగ్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా పెళ్లి గొప్పతనం చెప్పే సన్నివేశాలు అలాగే భార్యభర్తల అనుబంధం గురించి వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

ఫైనల్ గా శ్రీనివాస కళ్యాణం కొందరికీ వారి పెళ్లి సిడీ చూసినట్టుగా అనిపించొచ్చు. మరికొందరికీ కాస్త సీరియల్ టచ్ ఉన్న సినిమాలా అనిపించొచ్చు కానీ నేటి తరానికి మాత్రం పెళ్లి గురించి భార్యభర్తల అనుబంధం గురించి చక్కని సందేశాన్ని అందించే సినిమా. ఓవరాల్ గా ‘ శ్రీనివాస కళ్యాణం’ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా.

రేటింగ్ : 2 .75 /