'ఆపరేషన్ 2019' మూవీ రివ్యూ

Saturday,December 01,2018 - 03:42 by Z_CLU

నటీ నటులు : శ్రీకాంత్ , మంచు మనోజ్ , సునీల్, య‌జ్ఞ‌శెట్టి, దీక్షాపంత్‌, సుమ‌న్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, పోసానికృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

సంగీతం : ర్యాప్‌రాక్ ష‌కీల్

ఛాయగ్రహనం : వెంక‌ట్‌ప్ర‌సాద్

నిర్మాణం : అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత : టి. అలివేలు

రచన – దర్శకత్వం : క‌ర‌ణం బాబ్జీ

విడుదల : 1 డిసెంబర్ , 2018

‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు శ్రీకాంత్.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా శ్రీకాంత్ ను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ‘ఆపరేషన్ 2019’ అంటూ మరో పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీకాంత్.. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ హిట్ అందుకున్నాడా…? ఎన్నికల ముందు విడుదలైన ఈ సినిమా ఎంత వరకూ ఆలోచింపజేసింది… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

కృష్ణా జిల్లా కంకిపాడు ఊళ్ళో రైతు కుటుంబంలో పుట్టి చదువుల్లో రాణించే ఉమా శంకర్(శ్రీకాంత్).. ఊరందరి సహాయంతో పై చదువులు చదువుతాడు. అలా ఊరి వాళ్ళ సహాయంతో చదువుకొని మళ్ళీ సొంత ఊరికి వచ్చిన ఉమా శంకర్ తండ్రి మరణం అనంతరం ఊరి నుండి వెళ్లి ఉద్యోగరిత్యా అమెరికాలో సెటిల్ అవుతాడు.

అయితే తన ఊరులో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకొని ఎం.ఎల్.ఎ ద్వారా వారికి సహాయం అందించమని అమెరికా నుండి కోటి రూపాయిలు పంపిస్తాడు ఉమా. ఆ కోటి రూపాయిలు తీసుకొని ప్రజలకి సహాయం చేయకపోగా ఉమా శంకర్ పై ఎదురు తిరుగుతాడు కంకిపాడు ఎం.ఎల్.ఎ. ఆ సంఘటనతో తనే స్వయంగా ప్రజలకి సేవ చేయాలని భావించి ఇండియాకి తిరిగివచ్చి రాజకీయాల్లోకి అడుగుపెడతాడు ఉమా శంకర్. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శంకర్ తనకు ఎదురైన ప్రతీ సంఘటన నుండి ఓ గుణపాఠం నేర్చుకుంటూ ముందుకెళ్తాడు. రాజకీయం లో ఎలాంటి అనుభవం లేకుండా ప్రజలకోసం ఎం.ఎల్.ఎ గా నామినేషన్ వేసి గెలిచిన ఉమా శంకర్ తర్వాత రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పాడు.. చివరికి తన రాజకీయం ద్వారా ప్రజలకు ఏం చెప్పాడు..అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

గతంలో కొన్ని పొలిటికల్ క్యారెక్టర్స్ తో అలరించిన హీరో శ్రీకాంత్ మరో సారి అలాంటి క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. నటుడిగా తనకున్న అనుభవంతో పాత్రను రక్తి కట్టించగలిగాడు. కొన్ని సన్నివేశాల్లో శ్రీకాంత్ నటన బాగా ఆకట్టుకుంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే సన్నివేశాల్లో శివ కృష్ణ నటన బాగుంది. కోటా శ్రీనివాస రావు కి స్కోప్ ఉన్న పాత్ర లభించకపోవడంతో ఉన్నంతలో పరవాలేదనిపించుకున్నారు. దీక్షా పంత్ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. మంచు మనోజ్ గెస్ట్ అపిరియన్స్ సినిమాకు ప్లస్ అయింది. సునీల్, హరితేజ పాటలకే పరిమితమయ్యారు. మహేష్ ఆచంట , ఆర్.పి కామెడీ పండలేదు. ఇక నాగి నీడు, వేణుగోపాల్, జీవ ,సుమన్ , హేమ వంటి, వినీత్ కుమార్, దిల్ రమేష్,య‌జ్ఞ‌శెట్టి వారి నటనతో క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు ర్యాప్‌రాక్ ష‌కీల్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. పాటలు ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్ చేస్తే బెటర్ గా ఉండేది. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే మాటలు అలరించాయి. కారణం బాబ్జీ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ కథనం ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

తనకి కలిసొచ్చిన పొలిటికల్ డ్రామాను సెలక్ట్ చేసుకున్నాడు శ్రీకాంత్. ‘ఆపరేషన్ 2019’ అంటూ సరిగ్గా ఎన్నికల సీజన్ లో థియేటర్లలోకి వచ్చాడు. పబ్లిసిటీ పోస్టర్స్, మంచు మనోజ్, సునీల్ గెస్ట్ రోల్స్ చేయడం, ఎన్నికల సమయం… ఇలా కొన్ని అంశాలు ఈ సినిమాకు కలిసొచ్చాయి.

ఇక సినిమా విషయానికొస్తే ప్రజలకు మంచి చేయాలని పాలిటిక్స్ లో అడుగుపెట్టిన ఓ ఎన్నారై జనం మీద కోపంతో ఏం చేసాడు… చివరికి తన రాజకీయంతో ఓటు వేసి ప్రజలకి ఏం సందేశమిచ్చాడు… అనే పాయింట్ తీసుకొని సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. సినిమా ప్రారంభంలో స్క్రీన్ ప్లే తో ఓ 10 నిమిషాల పాటు ఆసక్తి కలిగించిన దర్శకుడు ఆ తర్వాత అక్కడక్కడా తడబడ్డాడు.

పొలిటికల్ డ్రామా సినిమాలంటే ప్రేక్షకులు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ.. క్లాప్స్ కొట్టేలా ఉండాలి.  గతంలో వచ్చిన కొన్ని పొలిటికల్ సినిమాలు ఈ ఫార్మాట్ తోనే సూపర్ హిట్స్ సాదించాయి. ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. ఇంకా బలమైన సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది. చాలా సన్నివేశాలు ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాను గుర్తు చేస్తాయి.

ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలు లేకపోవడం, నెమ్మదిగా సాగడం, పవర్ ఫుల్ సీన్స్ పడకపోవడం సినిమాకు పెద్ద మైనస్. కొన్ని సన్నివేశాలను బాగానే డీల్ చేసినా కొన్ని సందర్భాల్లో బోర్ కొట్టించాడు దర్శకుడు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సన్నివేశాలు, ఒక పార్టీ నుండి మరో పార్టీకి మారే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఓటు వేసే ముందు అందరూ ఒక్క క్షణం ఆలోచించాలని సరైన నాయకులను ఎన్నుకోవాలని చెప్పే క్లైమాక్స్ బాగుంది.

శ్రీకాంత్ నటన, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్  సినిమాకు హైలైట్ అనిపిస్తాయి. ఫైనల్ గా ఎన్నికల సమయంలో ఈ సినిమాతో ఓ మంచి సందేశం ఇచ్చాడు దర్శకుడు.. కాకపోతే ఆ సందేశం జనాలకు ఎంత వరకూ చేరుతుందో చూడాలి.

రేటింగ్ : 2 /5