Movie Review - SR కళ్యాణమండపం

Friday,August 06,2021 - 03:33 by Z_CLU

నటీనటులు:  కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వల్క‌ర్, సాయికుమార్, తులసి, తనికెళ్ళభరణి , శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు

సంగీతం : చేతన్ భరద్వాజ్

కెమెరా : విశ్వాస్ డేనియ‌ల్

నిర్మాణం : ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు : ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిర‌ణ్ అబ్బ‌వరం

ఎడిటింగ్ – ద‌ర్శ‌కుడు : శ్రీధ‌ర్ గాదే

నిడివి : 148 నిమిషాలు

విడుదల : 6 ఆగస్ట్ 2021

సాంగ్స్ , టీజర్ తో బజ్ క్రియేట్ చేసి ఎట్రాక్ట్ చేసిన చేసిన ‘SR కళ్యాణ మండపం’ సినిమా ఓ మోస్తారు అంచనాలతో ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీధర్ గాదే దర్శకుడిగా పరిచయమయ్యాడు. హీరో కిరణ్ ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. ‘రాజా వారు రాణి గారు’ తో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న కిరణ్ విజయం అందుకున్నాడా ? లేదా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

SR-Kalyanamandapam-Telugu-Movie-Review
కథ :

కడప జిల్లా రాయచోటి లో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగిన SR కళ్యాణ మండపంని సరిగ్గా మైంటైన్ చేయలేక తన మంచితనం వల్ల అప్పుల పాలవుతాడు ధర్మ(సాయి కుమార్). తాత కట్టించిన కళ్యాణమండపాన్ని తండ్రి నడిపించలేక మూసివేయడంతో ఆ బాధ్యత తీసుకొని మళ్ళీ అందులో పెళ్ళిళ్ళు చేయించి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చూస్తాడు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం).

కాలేజీలో చదువుతూ సింధు(ప్రియాంక జవల్కర్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కళ్యాణ్. ఒక వైపు కళ్యాణ మండపంని మళ్ళీ బిజీ చేసి తండ్రి గౌరవాన్ని పెంచాలని చూస్తూనే మరో వైపు సింధుని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. మరి ఫైనల్ గా కళ్యాన్ తను అనుకున్నది సాధించి చివరికి తండ్రికి ఎలా దగ్గరయ్యాడు..? ప్రేమించిన సింధు ని పెళ్ళాడాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

మొదటి సినిమాతోనే హీరోగా మంచి పెర్ఫర్మార్ అనిపించుకున్న కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ స్కిల్స్ తో మరోసారి కళ్యాణ్ గా మెప్పించాడు. ముఖ్యంగా సీమ యాసతో కిరణ్ డైలాగ్ డెలివరీ క్యారెక్టర్ ప్లస్ అయింది. ఓవరాల్ గా తన నటనతో సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాడు కిరణ్. ప్రియాంక జవల్కర్ పెర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ షో ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత మంచి క్యారెక్టర్ దొరకడంతో ధర్మ పాత్రలో ఒదిగిపోయి అలరించాడు సాయి కుమార్. తన కామెడీ టైమింగ్ తో నవ్వించడమే కాకుండా క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ పండించి సినిమాకు బలం చేకూర్చాడు.

హీరో తల్లి పాత్రలో తులసి , వడ్డీ వ్యాపారిగా శ్రీకాంత్ అయ్యంగార్ , కాలేజీ ప్రిన్సిపాల్ గా తనికెళ్ళ భరణి మంచి నటన కనబరిచారు. ఇక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో భరత్, అరుణ్ , అనీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా భరత్, అరుణ్ కామెడీ టైమింగ్ బాగుంది. ధర్మ పాత్రతో కలిసి ట్రావెల్ చేసే అబ్బయ్య పాత్రలో కిట్టయ్య బాగా నటించాడు. మిగతా ఆనతీ నటులంతా తమ నటనతో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

రిలీజ్ కి ముందే తన సాంగ్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన చేతన్ భరద్వాజ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మరింత బలాన్నిచ్చాడు. చుక్కలచున్నీ , చూశాలే కళ్ళారా , సిగ్గెందుకు రా మావ పాటలు విజువల్ గా కూడా ఆకట్టుకున్నాయి. భాస్కర భట్ల , కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం పాటలు కలిసొచ్చింది. ముఖ్యంగా చుక్కల చున్నీ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ చాలా బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే చేతన్ నేపథ్య సంగీతం సినిమాకే హైలైట్ గా. విశ్వాస్ డేనియ‌ల్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో , పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చాటుకున్నాడు. సుదీర్ ఆర్ట్ వర్క్ బాగుంది. శంకర్ కంపోజ్ చేసిన రెండు ఫైట్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

కిరణ్ అబ్బవరం రాసుకున్న కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే , సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు శ్రీధర్ కిరణ్ కథతో సినిమాను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో కొంత వరకు విఫలమయ్యాడు. ఇక దర్శకుడే ఎడిటర్ అయితే ఎక్కడా డ్రాగ్ లు ఉండవు. కానీ శ్రీధర్ ఎడిటింగ్ కూడా సినిమాకు మైనస్. చాలా సన్నివేశాలు డ్రాగ్ అనిపిస్తూ వీటికి ఇంత సేపు అవసరమా ? అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

రాజా వారు రాణి గారు అంటూ విలేజ్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న హీరో కిరణ్ ఈసారి తనే సొంతంగా కథ సిద్దం చేసుకొని ఈ సినిమా చేశాడు. కథ వరకూ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే , సన్నివేశాలు మాత్రం తేడా కొట్టాయి. రైటింగ్ లో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో బలమైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు కిరణ్. హీరోగా సినిమాకు హైలైట్ అనిపించుకున్న కిరణ్ స్క్రీన్ ప్లే రైటర్ గా మాత్రం పాస్ మార్కులు అందుకోలేకపోయాడు.

సినిమా ఆరంభంలో కాలేజీలో సన్నివేశాలు , లవ్ ట్రాక్ తో నడిపించిన దర్శకుడు కాసేపటికే తండ్రి కొడుకుల మధ్య ఉండే గ్యాప్ ని అలాగే తమ కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టిన కళ్యాణ మండపాన్ని ప్రొజెక్ట్ చేస్తూ సినిమాను నడిపించాడు. కాకపోతే సినిమాకు కోర్ పాయింట్ అయిన కళ్యాణ మండపం చుట్టూ మరింత ఎమోషన్ పండేలా సన్నివేశాలు రాసుకోలేకపోయారు. కేవలం హీరో తల్లి పాత్ర చేసిన తులసితో ఆ కళ్యాణ మండపం గురించి పై పైన చెప్తూ డీటెయిలింగ్ మిస్సయ్యారు. అప్పుడపుడు బోర్డు మాత్రమే చూపిస్తూ కళ్యాణ మండపం దగ్గర సన్నివేశాలు లాగించేశారు.

అలాగే తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వవు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకోవాల్సింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే పది నిమిషాలు మాత్రం బాగుంది. అసలు కొడుకు తండ్రితో ఎందుకు మాట్లాడడో స్ట్రాంగ్ రీజన్ చెప్పకపోవడంతో వారి మధ్య సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. ఇక హీరో హీరోయిన్ నడుము చూసి లవ్ లో పడటం అనేది కూడా సిల్లీగా అనిపిస్తుంది. దాంతో లవ్ ట్రాక్ సినిమాకు ప్లస్ అవ్వలేకపోయింది. కానీ కిరణ్ -ప్రియాంక మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మాత్రం యూత్ ని అలరిస్తాయి. ఇక హీరోయిన్ కి మరో పర్సన్ తో పెళ్లి కుదరం దాన్ని హీరో ఫ్రెండ్స్ క్యాన్సల్ చేయాలనుకోవడం రొటీన్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. కళ్యాణ మండపంలో ఒక్క పెళ్లయినా చేయాలని హీరో తన ఫ్రెండ్స్ తో ఊరంతా తిరగడం చివరికి ఒక లవ్ మ్యారేజ్ చేయడానికి అమ్మాయి తండ్రి వెనకే తిరుగుతూ ఒప్పించే సన్నివేశాలు బోర్ కొట్టాయి.

కిరణ్ రాసుకున్న కళ్యాణ మండపం కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని అదిరిపోయే స్క్రీన్ ప్లే రాసుకొని బలమైన సన్నివేశాలు పెట్టుకుంటే సినిమా పూర్తి స్థాయిలో మెప్పించేది. ఇక నటీ నటులతో పాటు టెక్నీషియన్స్ నుండి కూడా సినిమాకు మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా తండ్రి పాత్రకు సాయి కుమార్ ని సెలెక్ట్ చేసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. సాయి కుమార్ కాకపోతే తండ్రి కొడుకుల ఎమోషన్ సీన్స్ ఆ మాత్రం కూడా పండేవి కావు. కిరణ్ , సాయి కుమార్ నటన , రొమాంటిక్ సీన్స్ , సాంగ్స్ , కొన్ని సన్నివేశాలు , ఫైట్స్ , క్లైమాక్స్ కి ముందు వచ్చే తండ్రి కొడుకుల ఎమోషన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా , సినిమా మొదలు నుండి ఎండింగ్ వరకు డ్రాగ్ అనిపించే సీన్స్ , ఎడిటింగ్ , బలమైన సన్నివేశాలు పడకపోవడం , కళ్యాణ మండపం కాన్సెప్ట్ ని ఇంకా డెప్త్ లో చెప్పకపోవడం మైనస్ అనిచెప్పొచ్చు. ఫైనల్ గా SR కళ్యాణమండపం ఓ మోస్తారుగా ఆకట్టుకుంటుంది తప్ప పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

రేటింగ్ : 2.75/5