'సింగం-3' రివ్యూ

Thursday,February 09,2017 - 05:58 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 9 , 2017

నటీనటులు : సూర్య, అనుష్క, శృతి హాసన్

సంగీతం : హరీష్ జయరాజ్

సినిమాటోగ్రఫీ : ప్రియన్

ఎడిటింగ్ : వి.టి.విజయన్

మాటలు : శశాంక్ వెన్నెలకంటి

నిర్మాణం : స్టూడియో గ్రీన్ , పెన్ మూవీస్, సురక్ష్

సమర్పణ : జ్ఞానవేల్ రాజా

నిర్మాత : శివకుమార్ మల్కాపురం

రచన-స్క్రీన్ ప్లే– దర్శకత్వం : హరి

గతంలో సింగం, సింగం-2లతో సూపర్ హిట్స్ అందుకున్న సూర్య-హరి కాంబినేషన్ లో సింగం సీక్వెల్ గా తెరకెక్కిన ‘సింగం-3’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సూర్య.. ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడు.. చూద్దాం.

img_4778

కథ :

ఆంధ్రప్రదేశ్ లో పేరొందిన పోలీస్ ఆఫీసర్ నరసింహం(సూర్య)ను ఒక మిషన్ మీద కర్ణాటకకు రప్పించి కర్ణాటక కమిషనర్ హత్య కేసును నరసింహంకు అప్పగిస్తాడు హోమ్ మినిష్టర్(శరత్ బాబు). అలా కమిషనర్ హత్య కేసు గురించి కర్ణాటక డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహం తన భార్య కావ్య(అనుష్క)కి దూరంగా ఉంటూ చివరికి కమిషనర్ ను హత్య చేసిన వ్యక్తుల గురించి ఎలా తెలుసుకున్నాడు… ఇక ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బిజినెస్ మేన్ గా ఉంటూ ఇండియాలో మెడిసిన్ మాఫియాను నడుపుతున్న విఠల్ ప్రసాద్(ఠాకూర్ అనూప్ సింగ్) ను మన పోలీస్ ఎలా అంతంచేశాడనేది సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

సింగం సిరీస్ లో నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందు సూర్య గురించే మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం సూర్యానే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఆ మీసకట్టుతో పాటు.. స్టన్నింగ్ యాక్షన్, అదిరిపోయే డైలాగ్స్ తో మరోసారి తన సీనియారిటీ చూపించాడు. ఇప్పటికే సింగం, సింగం 2 సినిమాలతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేసిన ఈ హీరో.. పోలీస్ క్యారెక్టర్లు తనకంటే ఎవరూ బాగా చేయలేరని నిరూపించుకున్నాడు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ ప్రేక్షకుడైనా సూర్య యాక్టింగ్ కు కనెక్ట్ అయిపోతాడు. అలాంటి మెస్మరైజింగ్ పర్ ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడు సూర్య. అనుష్క తన నాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా శృతి హాసన్ గ్లామరస్ యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేసింది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ భార్యగా రాధికా తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచింది. స్టైలిష్ విలన్ గా ఠాకూర్ అనూప్ సింగ్ తన నటనతో మెప్పించాడు. ఇక శరత్ బాబు, సుమన్, శరత్ సక్సేనా,నాజర్, సూరి, క్రిష్, రోబో శంకర్ తదితరులు తమ క్యారెక్టర్స్ కు పూర్తి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సింగం సిరీస్ లో మొదటి 2 భాగాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కానీ సింగం-3 సినిమాకు మాత్రం హరీష్ జైరాజ్ మ్యూజిక్ డైరక్టర్. కొన్ని పాటలతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హరీష్ జైరాజ్ తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ లో తన కెమెరా పనితనం తో వైజాగ్ లొకేషన్స్ ను బాగా చూపించాడు ప్రియన్. ఎడిటింగ్ పరవాలేదు. ఇక దర్శకుడి విషయానికొస్తే… హరి స్పీడ్ స్క్రీన్ ప్లే మరోసారి ఆకట్టుకోగా… పవర్ ఫుల్ డైలాగ్స్, కణల్ కణ్ణన్ ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 img_1426-1

జీ సినిమాలు సమీక్ష :

సినిమా స్టార్టింగ్ లోనే ‘సింగం’ రెండు భాగాలను గుర్తు చేస్తూ ఆ భాగాలకు కొనసాగింపు కథ అనే విషయాన్ని కొన్ని సీన్స్ తో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తనదైన స్పీడ్ స్క్రీన్ ప్లే తో ముందుకు నడిపించాడు. మొదటి 2 భాగాల్లాగే ఈ సినిమాలో కూడా ఇంటర్నేషనల్ మాఫియాను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. సూర్య పవర్ ఫుల్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, హరి ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లే, అనుష్క, శృతి హాసన్, రాధిక-సూర్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, పోలీసులు , భారతదేశం గురించి సూర్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి… సింగం సిరీస్ లో వచ్చిన తొలి రెండు భాగాలూ అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. ఈ మూడో సిరీస్ మాత్రం యాక్షన్ కోరుకునే మాస్ ఆడియన్స్ ను ఇంకాస్త ఎక్కువ అలరిస్తుంది.

 

రేటింగ్ : 3/5