సిల్లీ ఫెలోస్ మూవీ రివ్యూ

Friday,September 07,2018 - 02:33 by Z_CLU

నటీ నటులు : అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా, పూర్ణ, నందిని రాయ్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, పోసాని తదితరులు

కెమెరా: అనిష్ తరుణ్ కుమార్

మ్యూజిక్ : శ్రీ వసంత్,

నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి

సహ నిర్మాత : వివేక్ కుచిబొట్ల

దర్శకత్వం : భీమినేని శ్రీనివాస్.

విడుదల తేది : 7 సెప్టెంబర్ 2018

 

కొన్నేళ్లుగా అపజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న అల్లరి నరేష్ మరోసారి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తో కలిసి ‘సిల్లీ ఫెలోస్’ అంటూ నవించడానికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈసారి అల్లరోడికి  కమెడియన్ గా సునీల్ కూడా సపోర్ట్ అందించాడు. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్, సునీల్ కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

లోకల్ ఎమ్మెల్యే జాకెట్ కి రైట్ హ్యాండ్ గా ఉండే వీరబాబు (అల్లరి నరేష్) తప్పనిసరి పరిస్థితుల్లో అదే ఊరిలో ఉండే తన ఫ్రెండ్ సూరి బాబు (సునీల్)కి రికార్డ్ డాన్సర్ పుష్ప(నందిని రాయ్) ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా వీరబాబు చేతిలో మోసపోయిన సూరిబాబు ఎలాగైనా పుష్పను వదిలించుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు.

అయితే ఎప్పటికైనా పొలీస్ అవ్వాలనుకునే వసంతి (చిత్ర శుక్ల)ని మొదటి చూపులోనే చూసి ప్రేమిస్తాడు వీరబాబు. తన పార్టీ ఎంపీ… జాకెట్ కి 500 కోట్లు డబ్బు ఉన్న స్థలం చెప్పి ఆ డబ్బును ప్రజా సేవకి ఉపయోగించమని చెప్పి చనిపోతాడు. ఆ 500 కోట్ల రహస్యం తెలుసుకోవడానికి జాకెట్ ను వెంబడిస్తారు ఎంపీ బావమరిది.. ఇంతలో ఎమ్మెల్యే జాకెట్ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. ఇక వీరబాబు, సూరిబాబు ఇద్దరి జీవితాలు ఎం.ఎల్.ఎ జాకెట్ చెప్పే మాట మీదే ఆదారపడి ఉంటుంది.. ఈ క్రమంలో జాకెట్ ను అతని శత్రువుల నుండి కాపాడడానికి వీరబాబు-సూరిబాబు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరికి వీరబాబు తన ప్రేమను గెలిపించుకొని, సూరిబాబు సమస్యను తీర్చగలిగాడనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

గతంలో కామెడీ స్టార్ గా ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన అల్లరి నరేష్ ఈ మధ్య ప్రేక్షకులను ఆ రేంజ్లో అలరించలేకపోయాడు. క్యారెక్టర్ పరంగా నరేష్ కిది కొత్తదేం కాదు కానీ తన కామెడి టైమింగ్ తో మళ్ళీ ఓ మోస్తరుగా నవ్వించాడు. ఇక ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ముఖ్యంగా అల్లరి నరేష్ కమెడియన్ గా మంచి సపోర్ట్ అందించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మొన్నటివరకూ హీరోగా నటించినప్పటికీ కమెడియన్ గా బెస్ట్ ఇచ్చి మళ్ళీ అప్పటి సునీల్ నే గుర్తుచేసాడు. చిత్ర శుక్ల తన పెర్ఫార్మెన్స్ తో పరావలేదనిపించుకుంది. పూర్ణ గెస్ట్ రోల్ లో ఆకట్టుకుంది. నందిని రాయ్ క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ అనిపించుకుంది. తన కామెడీతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు జయప్రకాశ్ రెడ్డి. బ్రహ్మానందం ఉన్నది కాసేపే అయినా మళ్ళీ తన మార్క్ కామెడీతో నవ్వించాడు. పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, హేమ, రఘు కారుమంచు, జాన్సి, రామ్ ప్రసాద్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

అనిష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వసంత్ అందించిన పాటల్లో రెండు పాటలు పరవాలేదు అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ వర్క్ బాగుంది. డ్రాగన్ ప్రకాష్ కంపోజ్ చేసిన కామెడి స్టంట్స్ అలరిస్తాయి. కాశర్ల శ్యామ్, చిలకరెక్క గణేష్ సాహిత్యం పాటలకు ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావు దర్శకుడిగా తనకున్న అనుభవంతో బాగానే డీల్ చేసాడు కానీ రైటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

 

జీ సినిమాలు సమీక్ష:

అల్లరి నరేష్, సునీల్ కలిసి ఓ కామెడి ఎంటర్ టైనర్ తో థియేటర్స్ కి వస్తున్నారనగానే కామెడి డ్రామా ఇష్టపడే ప్రేక్షకులు హ్యాపీ గా ఫీలయ్యారు. ఇక  ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇవన్నీ  ప్రేక్షకులను థియేటర్ కి రప్పించే వరకూ బాగానే కలిసొచ్చాయి కానీ ఒకసారి ప్రేక్షకుడు థియేటర్స్ లోకి అడుగుపెట్టాక ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయింది.

తమిళ్ ఓ మోస్తరు విజయం సాదించిన సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం మేకర్స్ సాహసమే.. కాకపోతే  ఆ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియక పోవడం,  ఇక్కడ పెద్దగా ఆడకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చింది. అదే ప్లాన్ తో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. ఇక తెలుగులో రీమేక్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన భీమనేని శ్రీనివాస రావు ఆ అనుభవంతో కామెడి మీద తనకున్న పట్టుతో మోస్తరుగా నవ్వించి  పరవాలేదనిపించాడు కానీ పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయాడు.

ముఖ్యంగా మొదటి భాగంలో కామెడి సన్నివేశాలు పెద్దగా పేలకపోవడం.., ఇంటర్వెల్ వరకూ వచ్చే సన్నివేశాలు కూడా బోర్ కొట్టించడం సినిమాకు పెద్ద మైనస్. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో చేసిన కొన్ని మార్పులు సినిమాకు ప్లస్ అవ్వలేదు.. ఒరిజినల్ సినిమాలో హైలైట్ గా నిలిచిన సెకండ్ హాఫ్ కామెడీ ఎపిసోడ్ ఈ సినిమాకు కూడా మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ మినహా మిగతా కామెడీ సన్నివేశాలన్నీ తెలుగులో ఇంతకు ముందు వచ్చిన కామెడి సినిమాలను గుర్తుచేస్తాయి.

తన మార్క్ కామెడీతో కమెడియన్ గా ఐయామ్ బ్యాక్ అనిపించుకున్నాడు సునీల్. ముఖ్యంగా పుష్ప పేరుతో వచ్చే కామెడి సన్నివేశాల్లో కమెడియన్ గా అలరించాడు. నరేష్, సునీల్ కామెడీ, సెకండ్ హాఫ్ లో వచ్చే జయప్రకాశ్ కామెడి ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అవి మినహా సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేం ప్లస్సులు లేవు. ఫైనల్ గా లాజిక్కులు పట్టించుకోకుండా కామెడీ డ్రామా సినిమాలు ఇష్టపడే వారిని ‘సిల్లీ ఫెలోస్’ ఓ మోస్తరుగా అలరిస్తారు.

రేటింగ్ : 2.5 / 5