శతమానంభవతి రివ్యూ

Saturday,January 14,2017 - 02:55 by Z_CLU

విడుదల : జనవరి 14 ,2017

హీరోహీరోయిన్లు : శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, రాజా రవీంద్ర, అమూల్య, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,
త‌దిత‌ర‌లు.

సంగీతం : మిక్కీ జె. మేయర్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

ఎడిటింగ్ : మధు

నిర్మాతలు : రాజు, శిరీష్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సతీష్ వేగేశ్న

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్లెటూరి అనుబంధాల నేపధ్యంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన కుటుంబ కథాచిత్రం ‘శతమానంభవతి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా
ఎలా ఎంటర్టైన్ చేసిందో? చూద్దాం..

కథ :
ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

shatamanam-bhavati-zee-cinemalu-1

నటీనటుల పనితీరు :
ముఖ్యంగా ఈ సినిమాకు తన నటనతో మరోసారి హైలైట్ గా నిలిచాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఓ పల్లెటూరి పెద్ద మనిషిగా ఇప్పటికే చాలాసార్లు మెప్పించిన ప్రకాష్ రాజ్ మరోసారి అలాంటి పాత్రతోనే మెప్పించాడు. సహజనటి జయసుధ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకుంది. కెరీర్ లో ఇప్పటి వరకూ పల్లెటూరి కుర్రాడిగా కనిపించని శర్వానంద్, రాజు అనే పల్లెటూరి కుర్రాడి క్యారెక్టర్ లో తన నటన, యాసతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. తన గ్లామరస్ యాక్టింగ్ తో నిత్యా క్యారెక్టర్ లో సినిమాకు ప్లస్ అయింది అనుపమ పరమేశ్వరన్. ప్రతీ విషయంలో కంగారు పడుతూ బంగార్రాజు క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసాడు నరేష్. ఇక తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర,ఇంద్రజ, జిజ్జు, సతీష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, రచ్చ రవి,భద్రం, మహేష్ ఆచంట, అమూల్య, శ్రీ రామ్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :
ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందు చెప్పుకోవాల్సింది మిక్కీ జె.మేయర్ గురించే. తనదైన మేజిక్ తో అన్ని పాటలతో ఆకట్టుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాలకు బలమైన బ్యాగ్రౌండ్ స్కోర్
అందించి సినిమాకు ప్లస్ అయ్యాడు మిక్కీ. శతమానం భవతి టైటిల్ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి, ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం బాగా ఆకట్టుకున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా పల్లెటూరి అందాలను తన కెమెరాతో మరింత అందంగా చూపించాడు. దర్శకుడు వేగేశ్న సతీష్… బంధుత్వాల గురించి రాసిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘పది సార్లు పిలవడానికి వాళ్ళు అతిధులు కాదు మన పిల్లలు’,’కోర్టులు ఇచ్చే విడాకుల కంటే కుటుంబాలు ఇచ్చుకునే విడాకులే ఎక్కవయ్యాయి’,ప్రేమించిన వాడు భర్త అవ్వాలని లేదు, భర్త అయినా వాడు ప్రేమించాలని లేదు’,’మన సంతోషాన్ని పది మందికి చెప్పుకొని సంతోష పడాలి కానీ మన భాధ చెప్పి వాళ్ళని భాధ పెట్టడం ఎందుకు’,టీవీ లో వచ్చే అనుబంధాలతో కూడిన సీరియల్స్ చూస్తూ తెగ సంతోష పడే జనం నిజ జీవితంలో అనుబంధాలకు దూరం అవుతున్నారు’,’ఆ దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు కానీ ప్రేమించిన మనిషిని మాత్రం కొందరికి ఇస్తాడు’,కంచంలో అన్నం పెట్టుకొని చూస్తూ ఉండలేం… తినాలి’ అనే డైలాగ్స్ తో పాటు నేటి తరం బంధుత్వాల గురించి చెప్పే ప్రతీ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

shatamanam

జీ సినిమాలు సమీక్ష :
ఇప్పటికే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ సినిమాలు చాలా చూసిన ప్రేక్షకులను కాస్త ఫ్రెష్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. సినిమా ప్రారంభంలో మురళి మోహన్ వాయిస్ తో బంధుత్వాలు గురించి వచ్చే సన్నివేశంం నుంచి ఎండింగ్ సీన్ వరకూ తన డైలాగ్స్ , స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు. తమ ఊరిని విడిచి తల్లిదండ్రుల అనుబంధాలకు దూరంగా గడుపుతున్న నేటితరం వ్యక్తుల గురించి సొంత ఊర్లో ఉంటూ తమ పిల్లల్ని అనుక్షణం తలుచుకుంటూ గడుపుతున్న తల్లిదండ్రుల ఆవేదన గురించి ప్రెజెంట్ జెనెరేషన్ కి కాస్త మెస్సేజ్ ఇస్తూ తమ ఊరిని తల్లి దండ్రులను ఎప్పటికీ మర్చిపోకూడదని వెళ్ళున్నప్పుడల్లా తమ సొంత ఊరికి వస్తూ తమ తల్లిదండ్రులను సంతోషింప జేయాలని దర్శకుడు చెప్పిన పాయింట్ బాగుంది. విదేశాల్లో నుంచి తమ సొంత ఊరి జ్ఞాపకాలను నెమరవేసుకునే సీన్స్, శర్వానంద్-అనుపమ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కేబుల్ నెట్వర్క్ ఆగిపోయినప్పుడు వచ్చే సీన్స్, కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండే సీన్స్, సంగీతం, తల్లిదండ్రులకు వారి అనుబంధాలకు దూరం అవ్వకూడదని చెప్పే క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్స్. సినిమాలో వచ్చే డబ్ స్మాష్ డైలాాగులు, తాాత-మనవడు మధ్య అనుబంధం సినిమాకు అదనపు ఆకర్షణలు. ఫైనల్ గా…. ఈ పండక్కి కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ సకుటుంబ సపరివార కథా చిత్రం ‘శతమానం భవతి’.

రేటింగ్ : 3.5/5