'శరభ' మూవీ రివ్యూ

Thursday,November 22,2018 - 01:52 by Z_CLU

నటీనటులు : ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు

మాటలు : సాయిమాధవ్ బుర్రా

మ్యూజిక్ : కోటి

నిర్మాత : అశ్విన్ కుమార్ సహదేవ్

రచన-దర్శకత్వం : నరసింహ రావు

విడుదల తేదీ : 22 నవంబర్ 2018

రైటర్ నరసింహరావు దర్శకుడిగా పరిచయమవుతూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘శరభ’… ఫాంటసీ స్టోరీతో గ్రాఫిక్స్ వండర్ గా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత నరసింహ రావు సక్సెస్ అందుకున్నాడా… ప్రేక్షకులను సినిమా ఏ మేరకు ఎంటర్టైన్ చేసింది.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

చండ భైరవి రాక్షస మాతను నిత్యం పూజిస్తూ క్షుద్రపూజలు చేసే చండ్రాక్షసుడు( పునీత్) కి 18 మంది కన్నెపిల్లల్ని బలిస్తే మహాశక్తి పొండుతావని తన గురువు చెప్పడంతో వరుసగా 17 మంది కన్నెపిల్లల్ని చండ భైరవికి బలిస్తాడు. చివరి బలికి సిద్దం చేస్తుండగా నరసింహ స్వామి శక్తికి బలవుతాడు. అయితే కొన్నేళ్ళ తర్వాత సిరిగిరిపురంలో నరసింహ స్వామి కటాక్షంతో పార్వతమ్మ(జయప్రద)కు మహాశక్తితో అబ్బాయి పుడతాడు. దేవుడి ఆంక్షతో పుట్టిన అతనికి శరభ(ఆకాష్ కుమార్ సహదేవ్) అని నామకరణం చేస్తారు. దుష్ట శక్తులు ఆవహించే నక్షత్రం కావడంతో సిరిగిరిపురంలో ఉన్న దేవాలయంలో దుష్ట శక్తులను తొలగించే స్వామిజి దగ్గరికి తన కూతురు దివ్య ని తీసుకొస్తాడు సెంట్రల్ మినిస్టర్(షియాజీ షిండే)..

అయితే తండ్రి సాదించలేకపోయిన మహాశక్తిని ఎలాగైనా తండ్రి చండ్రాక్షసుడికి అందించాలని 17 మంది కన్నె పిల్లల్ని చండ భైరవి కి బలి ఇచ్చి చివరి బలి కోసం ఎదురుచూస్తాంటాడు రక్తాక్ష(చరణ్ దీప్).. ఈ క్రమంలో చివరి బలికి కావాల్సిన జాతకం గల అమ్మాయి దివ్య అని తెలుసుకొని ఆమె తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు రక్తాక్ష. దివ్యని ఎలాగైనా కాపాడాలని చూస్తుంటాడు శరభ.. చివరికి దైవ బలం ఉన్న సిరిగిరి పురంలో దుష్ట శక్తి కి దేవుడికి జరిగిన మహా సంఘర్షణలో దేవుడి చేతిలో దుష్ట శక్తులు ఎలా ఓడిపోయాయి.. అనేది శరభ కథాంశం.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ కుమార్ పరవాలేదనిపించుకున్నాడు.. కాకపోతే కొత్త కావడంతో కథను మోయలేకపోయాడు. మిస్తీ చక్రవర్తి పెర్ఫార్మెన్స్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో నటిగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన జయప్రద తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచింది. నెపోలియన్ ఉన్నత సేపు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇక చరణ్ దీప్ ఇప్పటి వరకూ చేసినా పాత్రలన్నీ ఒకెత్తు ఈ సినిమాలో రక్తాక్ష పాత్ర మరో ఎత్తు. తన నటనతో పాత్రకు సరైన న్యాయం చేసాడు. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎల్.బి.శ్రీరాం ఎప్పటిలాగే బాగా చేశాడు. నాజర్ , పుద్వి రాజ్ కామెడీ పండలేదు. జబర్దస్త్ రాకేశ్ అలరించాడు. తనికెళ్ళ భరణి మిగతా నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది కోటి మ్యూజిక్ గురించే… పాటలు ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాంటి సినిమాలకు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే ఆర్ట్ వర్క్ చాలా ముఖ్యం.. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కొన్ని సందర్భాల్లో సాయిమాధవ్ బుర్రా అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్స్ అలరించాయి. రచయితగా ఓ భారీ బడ్జెట్ తో తెరకెక్కించే కథను రాసుకున్న దర్శకుడు ఆ కథను సినిమాగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

పాత తరంలో నరసింహరాజు చాలా సినిమాలు చేశారు. అప్పట్లో ఆయన చేసిన కథను మరోసారి రిపీట్ చేశాడు దర్శకుడు నరసింహరావు. దేవుడు వెర్సెస్ దెయ్యం అనే పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ కాన్సెప్ట్ ను ఈకాలం ప్రేక్షకులకు మరోసారి గుర్తుచేయాలనుకోవడం తప్పులేదు. కానీ ఆ కాన్సెప్టుతో గాయం చేశాడు దర్శకుడు.

కథలో కొత్తదనం లేనప్పుడు.. కొత్త నటీనటులతో పాత కథను సరికొత్తగా చూపించాలి. కానీ శరభలో అదేం కనిపించదు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథలకు హీరోనే బలం. కొత్త కుర్రాడు పైగా మొదటి సినిమా కావడంతో కథను మోయలేకపోయాడు ఆకాష్. కనీసం గతంలో వచ్చిన నరసింహరాజు సినిమాలు చూసినా బాగుండేది.

సినిమా ప్రారంభంలోనే అసలు కథ చూపించేయడంతో సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకుడు ఈజీ గా అంచనా వేసేయొచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఏదో ట్విస్ట్ పెట్టినా అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, గ్రాఫిక్స్ తో వచ్చే సీన్స్, దేవుడి పవర్ చూపించే సీన్స్ అలరిస్తాయి. అవి మినహా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. కథలో కీలకమైన చోట చాలా లాజిక్స్ మిస్ అయ్యాడు దర్శకుడు అవే సినిమాను దెబ్బతీశాయి. కాకపోతే గతంలో స్టార్ డైరెక్టర్  శంకర్ దగ్గర పనిచేసిన అనుభవంతో గ్రాఫిక్స్ టీం నుండి మంచి అవుట్ పుటే రాబట్టుకున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఇలాంటి సినిమాలకు దర్శకుడు చాలా కేర్ తీసుకోవాలి.. ఆ పొరపాటు వల్లే మొదటి భాగంలో చాలా సన్నివేశాలు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. ఇక కామెడీ సన్నివేశాలు నవ్వించకపోగా కథకి అడ్డు తగిలేట్టుగా ఉన్నాయి. ఫైనల్ గా శరభ అనే పవర్ ఫుల్ టైటిల్ తో గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఫెయిలైన ఓ భారీ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 2 / 5