'శంభో శంకర' మూవీ రివ్యూ

Friday,June 29,2018 - 06:05 by Z_CLU

నటీనటులు: షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు

కెమెరా : రాజ‌శేఖ‌ర్

సంగీతం: సాయి కార్తిక్

ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్

నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్

సెన్సార్ : UA

విడుదల తేది : 29 జూన్ 2018

కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు చేయడం కామనే… ఇప్పటికే అలీ, వేణు మాధవ్, సునీల్, సప్తగిరి ఇలా చాలా మంది కమెడియన్లు హీరోగా సినిమాలు చేసారు. లేటెస్ట్ గా ఈ కేటగిరిలో షకలక శంకర్ కూడా చేరాడు. షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన ‘శంభో శంకర’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ కమెడియన్ హీరోగా మెప్పించగలిగాడా… ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసింది…. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

కడప జిల్లాలో అంకాలమ్మ పల్లె ఊరిలో జనాలకు మంచి చేయకపోగా హాని కలిగించే ఓ ప్రెసిడెంట్‌( అజయ్‌ ఘోష్‌)ఉంటాడు. ఆ ప్రెసిడెంట్‌ అక్రమాలకు అండగా ఓ అవినీతి పోలీసాఫీసర్‌(ప్రభు) ఉంటాడు. వీరి ఆగడాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా నిలబడుతుంటాడు ‌శంకర్ (షకలక శంకర్)‌. అదే ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి ఉంటుంది. ఆమె పేరు పార్వతి (కారుణ్య చౌదరి). అలా ఊరి గొడవలన్నీ నెత్తినేసుకొని తిరిగే శంకర్ తను అల్లారుముద్దుగా చూసుకునే చెల్లెల్ని పోగొట్టుకుంటాడు.. తన చెల్లెలు చావుకు ప్రెసిడెంట్ కొడుకే కారణమని తెలుసుకున్న శంకర్ ప్రెసిడెంట్‌ కొడుకును చంపేస్తాడు.

దీంతో శంకర్ -ప్రెసిడెంట్ మధ్య వైరం మొదలవుతుంది. గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో ప్రెసిడెంట్ దొంగ సరుకు అక్రమంగా తరలిస్తున్నాడని తెలుసుకుంటాడు శంకర్. ఈ క్రమంలో ప్రెసిడెంట్‌ వెనుక మరో వ్యక్తి ఉన్నాడని అతనే అన్నిటికీ కారణం అని తెలుసుకుంటాడు. అతడికి శంకర్‌కి సంబంధం ఏమిటి? అసలు ఆ దొంగ ఎవరు? చివరికి అతని నిజస్వరూపాన్ని ఊరందరికీ తెలియజేసిన శంకర్ పోలీసుల సహాయంతో అతన్ని ఏం చేసాడు… అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

షకలక శంకర్ అనగానే అతను చేసే కామెడీ గుర్తొస్తుంది. శ్రీకాకుళం యాసతో తనదైన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా ఎంటర్టైన్ చేసిన శంకర్ హీరోగా మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే శంకర్… సినిమాలో మాత్రం కేవలం హీరోగా మాత్రమే కనిపించాడు. తనకి పట్టున్న కామెడీ కంటే ఎమోషన్ మీదే ఫోకస్ పెట్టి బోల్తా కొట్టాడు. తెలుగమ్మాయి కారుణ్య పరవాలేదనిపించుకుంది. ప్రెసిడెంట్ పాత్రలో అజయ్ కొంత వరకూ ఆకట్టుకున్నాడు రవి వర్మ,నాగినీడు, ఏడిద శ్రీరామ్, ప్రభు, సతీష్ తదితరులు జస్ట్ ఓకే అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సాయి కార్తీక్ అందించిన బాగ్రౌండ్ స్కోర్ , రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.. రెండు పాటలు మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోవు. సాంగ్స్ పిక్చరైజేషన్ కుదరలేదు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడా వచ్చే డైలాగ్స్ అలరిస్తాయి. శ్రీధర్ స్క్రీన్ ప్లే -డైరెక్షన్ అతనికి అనుభవం లేదన్న సంగతి తెలియజేసేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు రివ్యూ :

ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కథ పట్టుకొని త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజ లాంటి వారి దగ్గరికి వెళ్లానని కానీ వారు సినిమా తీసేందుకు కాస్త సమయం అడిగారని చెప్పుకొచ్చాడు శంకర్. ఆ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే షకలక శంకర్ ను హీరోగా పెట్టి అసలు వాళ్ళెందుకు సినిమా తీయాలని ఇటీవలే శంకర్ ని ప్రశ్నించగా సినిమాలో అద్భుతమైన కథ ఉంది… ఈ కథ వింటే ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. అంతే కాదు 2 కోట్లు పెడితే 10 కోట్లు కలెక్ట్ చేసే దమ్మున్న కథంటూ కాస్త గట్టిగానే మాట్లాడాడు.

శంకర్ ఇంత గట్టిగా చెప్తున్నాడంటే కచ్చితంగా ఈ కథ గొప్పగా ఉంటుందని థియేటర్స్ కి వెళ్తే సినిమా ప్రారంభంలోనే నవ్వొస్తుంది. అవసరం లేని పాత్రలు, శంకర్ ఓవర్ యాక్టింగ్, చిరాకు తెప్పించే సన్నివేశాలు, పాటల పిక్చరైజేషన్ ఇలా అన్నీ బోర్ కొట్టిస్తాయి. ట్రైలర్ చూసాక దర్శకుడు శ్రీధర్ కి దర్శకత్వంలో ఏ మాత్రం అనుభవం లేకపోయినా కొంత వరకూ మెప్పిస్తాడేమో అని ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రైతుల గురించి శంకర్ పోరాడే సన్నివేశాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు.

ఎంచుకున్న కథ బాగున్నా అర్థం పర్దం లేని సన్నివేశాలు సినిమాను దెబ్బతీశాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో శంకర్ ఓవర్ యాక్టింగ్… హీరోయిజం చూపించాలనుకునే సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. నిజానికి ఒక కమెడియన్ ను హీరోగా పెట్టి సినిమా చేసేటప్పుడు కామెడి బేస్డ్ కథను ఎంచుకుంటారు. కానీ శ్రీధర్ శంకర్ ను పెట్టి ఒక పెద్ద హీరో చేసే సీరియస్ కమర్షియల్ కథను ఎంచుకోవడం పెద్ద మైనస్. శంకర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే టప్పుడు తన బలాన్ని తెలుసుకోకుండా ఇలాంటి సినిమా చేయడం మిస్టేక్. కామెడి లేకపోవడం, కొన్ని సన్నివేశాలు మరీ ఓవర్ అనిపించడం సినిమాకు మైనస్.

రేటింగ్: 1.5 / 5