'శైలజారెడ్డి అల్లుడు' మూవీ రివ్యూ

Thursday,September 13,2018 - 01:47 by Z_CLU

నటీనటులు: నాగచైతన్య, అను ఇమ్మానుయేల్, రమ్యకృష్ణ, కళ్యాణి నటరాజన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ
మ్యూజిక్ : గోపీసుందర్
సహనిర్మాత : పి.డి.వి.ప్రసాద్
నిర్మాత : నాగవంశీ
రచన -దర్శకత్వం : మారుతి
విడుదల తేదీ : 13 సెప్టెంబర్ 2018

అల్లుడు, అత్తవారింట అడుగుపెడతాడు. అత్త పొగరు అణిచి ఆమెను దారిలోకి తెస్తాడు. కూతురుకి కూడా కూసింత పొగరుంటే ఆ పని కూడా పూర్తిచేస్తాడు. శైలజారెడ్డి అల్లుడు సినిమా టైటిల్ లో అల్లుడు అనే పదం ఉంది కాబట్టి అదే రొటీన్ స్టోరీ అనుకోవద్దు. పెళ్లి కాకుండానే అత్త ఇంట్లో కాబోయే అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఇది శైలజారెడ్డి అల్లుడు కథ. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).

తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు:
సాఫ్ట్ అండ్ కూల్ క్యారెక్టర్ లో చైతూ మెప్పించాడు. తన సొంత పేరును సినిమాలో వాడడమే కాకుండా, బయట తను ఎలా ఉంటాడో అదే యాటిట్యూడ్ సినిమాలో కూడా చూపించాడు. డిఫరెంట్ లుక్, మెచ్యూర్డ్ర్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. అను ఇమ్మానియేల్ తన గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. కాకపోతే కొన్ని సన్నివేశాలో నటనతో మెప్పించలేకపోయింది. శైలజా రెడ్డి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ అదుర్స్ అనిపించారు.

రొటీన్ క్యారెక్టర్ అయినప్పటికీ మురళి శర్మ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించాడు. తన మార్క్ కామెడీతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు వెన్నెల కిషోర్.. సెకండ్ హాఫ్ లో వచ్చే పృథ్వి కామెడి పరవాలేదు. ఇక కేదార్ శంకర్, శరణ్య, మధు నందన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక బృందం పనితీరు :
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ, మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఇద్దరూ తమ వర్క్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు. గోపీసుందర్ అందించిన పాటల్లో ‘ఎగిరేగిరే’ పాట సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది.. అలాగే ‘శైలజారెడ్డి అల్లుడు చూడు’,’ పెళ్లి పందిరి’ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. సాంగ్స్ పిక్చరైజేషన్, కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో తన కెమెరా వర్క్ తో మెస్మరైజ్ చేసాడు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యంతో పాటు కృష్ణకాంత్, శ్రీమణి, కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. వెంకట్ మాస్టర్, దిలీప్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మారుతి కథ రొటీన్ అనిపించినా స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష:
అత్తా-అల్లుడు కథలు రొటీన్. గతంలో ఎన్నో చూశాం. కానీ ఇది కాబోయే అత్త, కాబోయే అల్లుడు కథ. పెళ్లికి ముందే అత్తింట్లోకి అడుగుపెట్టిన అల్లుడి కథ. దీనికి ఎప్పట్లానే ఇగో అనే స్పెషల్ కాన్సెప్ట్ ను యాడ్ చేశాడు మారుతి. తన ప్రతి సినిమాలో మనుషులకు ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ పెట్టే మారుతి, ఈసారి రమ్యకృష్ణ, అను ఎమ్మాన్యుయేల్, మురళీశర్మ కు ఇగోలు అంటగట్టాడు. ఇక్కడి వరకు సెటప్ అంతా బాగానే ఉంది కానీ బలమైన సన్నివేశాలు లేక శైలజారెడ్డి అల్లుడు నెక్ట్స్ లెవల్లో నిలబడలేకపోయాడు.

మారుతి సినిమాలకు ఇప్పటికే ఓ బ్రాండ్ క్రియేట్ అయింది. కచ్చితంగా డిసప్పాయింట్ చేయడనే ఇమేజ్ ఉంది. శైలజారెడ్డి కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. అలాఅని పూర్తి సంతృప్తిని కూడా ఇవ్వదు. అలాంటి నెరేషన్ రాసుకున్నాడు మారుతి. మనుషుల్లో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు చూపిస్తూ, హిట్లు కొట్టిన మారుతి ఇగో అనే లక్షణంతో మంచి కథ అయితే రాసుకున్నాడు కానీ బలమైన సన్నివేశాలు, అంతే బలమైన డైలాగులు మాత్రం రాసుకోలేకపోయాడు.

హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలతో ఓ మోస్తరుగా ప్రారంభమైన సినిమా ఇంటర్వెల్ వచ్చే వరకు ఆసక్తి రేకెత్తించదు. అలా ఎలాంటి హై-పాయింట్స్ లేకుండా సాగుతున్న సినిమాకు రమ్యకృష్ణ రాకతో ఊపొస్తుంది. కథలో కాస్త కదలిక వస్తుంది. ఇక అక్కడ్నుంచి తన అనుభవం చూపించాడు మారుతి. క్లయిమాక్స్ వరకు ఎక్కడా తగ్గకుండా, టెంపో మిస్ అవ్వకుండా సినిమాను లాక్కెళ్లాడు. శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ కు ఇదే బ్యాక్ బోన్.

మిగతా ఎలిమెంట్స్ పక్కనపెడితే మారుతి సినిమాల్లో వినోదం పక్కా. శైలజారెడ్డి అల్లుడు కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రథమార్థంలో వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్విస్తే, సెకెండాఫ్ లో వెన్నెలకు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనుభవం తోడైంది. దీంతో సెకండాఫ్ లో కూడా బాగానే జోకులు పేలాయి. అలా ఓవైపు ఎమోషన్, మరోవైపు కామెడీని మిక్స్ చేస్తూ బ్యాలెన్స్ డ్ గా కథ నడిపించాడు మారుతి.

అత్త-అల్లుడు.. వాళ్ల మధ్య ఆధిపత్య పోరు, సవాళ్లు ఇలాంటివేవీ సినిమాలో ఉండవని యూనిట్ అంతా ముందే ప్రేక్షకుల్ని మెంటల్లీ సిద్ధంచేయడం ఈ సినిమా సక్సెస్ కు కీలకంగా మారింది. పాత అత్తాఅల్లుడు అనుభవాల్ని మరిచిపోయి ఫ్రెష్ గా థియేటర్లలో కూర్చున్న ఆడియన్స్ కు ఈ అల్లుడు తెగ నచ్చేస్తాడు.

అలా అని ఇందులో అన్నీ ప్లస్సులే ఉన్నాయనుకుంటే పొరపాటు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమాను ఓ మెట్టు పైకి తీసుకెళ్లే బలమైన సన్నివేశాలు ఫస్టాఫ్ లో మిస్ అయ్యాయి. దీనికి తోడు క్లైమాక్స్ ఎలా ఉంటుందనే విషయాన్ని సెకండాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఊహించగలగడం మరో పెద్ద మైనస్. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ కూడా అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ‘శైలజారెడ్డి’ సహకారంతో ‘అల్లుడు చైతూ’ సినిమా బండిని సాఫీగా లాగించేస్తాడు.

బాటమ్ లైన్ – పాత అత్త.. కూల్ అల్లుడు

రేటింగ్ : 3/5