Movie Review - 'షాదీ ముబారక్'

Friday,March 05,2021 - 02:20 by Z_CLU

నటీ నటులు :  వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ తదితరులు.

కెమెరా :  శ్రీకాంత్‌ నారోజ్

ఆర్ట్‌: నాని

ఎడిటర్‌: మధు

సంగీతం: సునీల్‌ కశ్యప్‌

అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: టి. శ్రీనివాస్‌రెడ్డి,

నిర్మాతలు: రాజు, శిరీష్‌,

కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ

నిడివి : 136 నిముషాలు

విడుదల :  5 మార్చ్ 2021

వీర్ సాగర్ , దృశ్యా రఘునాథ్ జంటగా కొత్త దర్శకుడు పద్మ శ్రీ తీసిన ‘షాదీ ముబారక్’ ఈరోజే విడుదలైంది. సినిమా పోస్టర్ మీద దిల్ రాజు  పేరు పడటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈరోజు మిగతా సినిమాలతో పాటు వచ్చిన ఈ సాఫ్ట్ లవ్ స్టోరీ ఆడియన్స్ ని మెప్పించిందా ? దిల్ రాజు జడ్జిమెంట్ మరోసారి రుజువైందా ? ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తూ పెళ్లిచూపుల కోసం ఇండియా వచ్చిన మాధవ్ సున్నిపెంట(వీర్ సాగర్) ఒక మ్యారేజ్ బ్యూరో సహాయంతో ఒకే రోజు మూడు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటాడు. తన తల్లి కాలికి గాయం అవ్వడంతో ఆ పెళ్లి చూపులకి మాధవ్ ని తీసుకెళ్ళే బాధ్యత సత్యభామ పై పడుతుంది. మొదటి చూపులోనే సత్యభామతో ప్రేమలో పడతాడు మాధవ్.

కారులో  పెళ్లి చూపులకు తిప్పుతూ సత్యభామ కూడా మాధవ్ తో ప్రేమలో పడుతుంది. కానీ తమ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకునే లోపే మాధవ్ కి పెళ్లి చూపులకు వెళ్ళిన  ఒకమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఇంతకీ ఆ పెళ్లికి మాధవ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ? ఫైనల్ గా సున్నిపెంట మాధవ్ , తుపాకుల సత్యభామ ఒకటయ్యారా లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

ఇప్పటికే నటుడిగా సీరియల్స్ , సినిమాలతో ప్రూవ్ చేసుకున్న హీరో సాగర్ తన నటనతో డీసెంట్ యాక్టర్ అనిపించుకున్నాడు. సున్నిపెంట మాధవ్ క్యారెక్టర్లో సాగర్ నటన బాగుంది. ఈ సినిమాతో  టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన దృశ్యా రఘునాథ్ సత్యభామగా ప్రేక్షకులను ఫిదా చేసింది.  దృశ్యా క్యారెక్టర్ సినిమాకే హైలైట్. అదితి మైకల్ తన రోల్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది.

హీరోయిన్ తల్లి తండ్రులుగా ప్రియదర్శి రామ్ , రాజశ్రీ నాయర్ అలాగే హీరో తల్లితండ్రులుగా హేమ , బెనర్జీలు ఆకట్టుకున్నారు. రాహుల్ రామకృష్ణ, భద్రం, హేమంత్ కామెడీ ట్రాక్స్ బాగా పేలాయి. అజయ్ ఘోష్ , శత్రు, మధునందన్ తమ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు.

సాంకేతిక వర్గం : 

సాఫ్ట్ లవ్ స్టోరీకి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చే మ్యూజిక్ ఇంపార్టెంట్. తన మ్యూజిక్ తో అలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు సునీల్ కశ్యప్. వినసొంపైన పాటలతో పాటు సన్నివేశాలకు తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించాడు సునీల్. శ్రీకాంత్‌ నారోజ్ కెమెరా వర్క్ బాగుంది. సినిమాలో అనవసర సన్నివేశాలు లేకుండా చూసుకొని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశాడు మధు.

పద్మ శ్రీ రాసుకున్న కథ రొటీన్ అనిపించినా కథనం మాత్రం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

ShaadiMubarak-teaser-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష : 

కొన్ని కథలకు ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు. కథకి మంచి కథనం రాసుకుంటే కారులోనే దాదాపు సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించొచ్చు. సరిగ్గా దర్శకుడు పద్మ శ్రీ అదే చేశాడు. రొటీన్ అనిపించే సింపుల్ కథకి ఆకట్టుకునే కథనం , బలమైన సన్నివేశాలు, కామెడీ రాసుకొని అలరించారు. ముఖ్యంగా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా అనిపించే నటీ నటులను ఎంచుకోవడం సినిమాకు కలిసొచ్చింది. దృశ్యా రఘునాథ్ ని హీరోయిన్ గా తీసుకోవడం దర్శకుడి మొదటి సక్సెస్ అనిపిస్తుంది.

ఏ లవ్ స్టోరీకయినా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ప్రేమకథకి కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు ఉండడు.  సాగర్ – దృశ్యా కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవ్వడంతో వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హాయిగా సాగే ప్రేమకథ , పెళ్లి చూపుల ఎపిసోడ్స్ , కామెడీ సినిమాను నిలబెట్టాయి. ఆ విషయంలో దర్శకుడిగా కంటే రచయితగా పద్మ శ్రీ ని ఎక్కువ మెచ్చుకోవాలి. దర్శకుడు కృష్ణవంశీ దగ్గర పనిచేసిన అనుభవంతో ఈ సాఫ్ట్ లవ్ స్టోరీని పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు పద్మ శ్రీ. మ్యూజిక్ , విజువల్స్ కూడా సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. బోర్ కొట్టే కొన్ని సందర్భాల్లో కమెడియన్స్ ని సరిగ్గా వాడుకుంటూ లైట్ హార్టెడ్ కామెడీతో సినిమాను ఎంటర్టైన్ మెంట్ తో  నడిపించాడు దర్శకుడు.

సినిమా అంతా ఒకే టెంపోలో సాగడం , స్టోరీ రొటీన్ అనిపించడం సినిమాకు మైనస్ అనిపిస్తాయి. అవి మినహాయిస్తే ఈ లవ్ స్టోరీలో చెప్పుకోవాల్సిన మైనస్ లు పెద్దగా లేవు. ఓవరాల్ గా పెళ్లి చూపుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘షాదీ ముబారక్’ సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటూ అలరిస్తుంది.

రేటింగ్ : 3 /5