సెల్ఫీ రాజా రివ్యూ

Friday,July 15,2016 - 01:26 by Z_CLU

చిత్రం : సెల్ఫీ రాజా
నటీనటులు : అల్లరి నరేష, సాక్షి చౌదరి
దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి
నిర్మాత : చలసాని రాంబ్రహ్మం చౌదరి
సంగీతం : సాయి కార్తీక్
విడుదల తేదీ : 15 జూలై, 2016

కథ :
సెల్ఫీ రాజా (అల్లరి నరేష్) సరదాగా కాలం వెళ్ళదీసే ఓ యువకుడు. సిటీ కమీషనర్ కూతురుని (కామ్న రనౌత్) ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతడికి నోటి దురుసు వల్ల ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ నోటి దురుసు వల్లే తన భార్య కూడా అతడికి దూరం అవుతుంది. ఈ క్రమంలో మరే దిక్కూ లేక సెల్ఫీరాజా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తనని కాల్చి చంపమని ఓ క్రిమినల్ (రవిబాబు)ని కోరతాడు. అయితే ఆ క్రిమినల్ మాత్రం సెల్ఫీరాజాను చంపకుండా వేరే పెద్ద ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? ఆ తర్వాత ఈ కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్ కామెడీని ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తన కామిక్ రోల్‌లో హీరో అల్లరి నరేష్ శక్తిమేర బాగా నటించాడు. గత కొద్దికాలంగా ప్రయోగాలు చేస్తూ వస్తోన్న నరేష్, ఈ సినిమాలో తన స్టైల్ అయిన స్పూఫ్ కామెడీని మళ్ళీ తెరపైకి తెచ్చాడు. ఈ స్పూఫ్ కామెడీ అందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా కమెడియన్ పృథ్వీతో చేయించిన స్పూఫ్స్ కూడా బాగా నవ్విస్తాయి.
ఫస్టాఫ్‌ను సినిమాకు మంచి అనుకూలాంశంగా చెప్పాలి. ఈ సమయంలో కథ మంచి ఫ్లోతో బాగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో కామెడీ ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. హీరోయిన్‍ కామ్న రనౌత్ మొదటి సినిమా అయినా బాగానే చేసింది. కమెడియన్ శకలక శంకర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ తర్వాత సినిమా అంతా దారితప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అనవసరమైన సన్నివేశాలను, పాత్రలను ప్రవేశపెడుతూ ఈ భాగాన్నంతా అర్థం లేనిదిగా మార్చేశారు. రవిబాబు పాత్రకు ఎక్కడా సరైన స్పష్టతనివ్వలేదు. ఆ పాత్రను కథలో జొప్పించిన విధానం కూడా అస్సలు బాగోలేదు. సెకండాఫ్‌లో వరుసగా వచ్చే పాటలు కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా ఫ్లోను ఈ పాటలు పూర్తిగా ఆపేశాయనే చెప్పుకోవాలి.
ఇక కామెడీ కథకు సరిపడే అవకాశం ఉన్న కథనే అనవసరమైన మలుపులు తిప్పి, అర్థం లేని కామెడీ ట్రాక్‌లు జతచేసి ఈ సినిమాను అసలు కామెడీని బయటకు తీసుకురావడంలో విఫలమయ్యేలా చేశారు.